నేరమే అధికారమైంది.. | Sakshi
Sakshi News home page

నేరమే అధికారమైంది..

Published Fri, Jan 10 2014 4:31 AM

PDSU district conference

బోధన్,న్యూస్‌లైన్ : నేరమయమైన అధికార పక్షం ప్రజలను నేరస్తులుగా చేస్తోందని  సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు పోటు రంగారావు ఆరోపించారు. పార్లమెంట్‌లో 545 మంది సభ్యుల్లో 350 మంది కోటీశ్వర్లు ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయన్నారు. పీడీఎస్‌యూ 19వ జిల్లా మహాసభలను గురువారం బోధన్‌లోని ఉర్ధూహాల్‌లో నిర్వహించారు. సభకు పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షరాలు సరిత అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తగా హాజరైన రంగారావు మాట్లాడుతూ పీడీఎస్‌యూ వ్యవస్థాపకుడు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, మరో మహిళా నేత రంగవల్లీ ఈ ప్రాంతానికి చెందిన వారు కావడం విశేషమన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు మాట్లాడుతు బడా కంపెనీలు దేశ వనరులను దోచుకునేందుకు ప్రభుత్వాలు ప్రోత్సాహమిస్తున్నాయని ఆరోపించారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ బాలికల విద్య పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుచేయక తప్పదన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం ప్రసాద్ మాట్లాడుతు ఉన్నతవిద్య పేద వర్గాలకు భారంగా మారిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలకు ఆధార్‌కార్డు లింకేజీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సభ ప్రారంభానికి ముందు మౌనం పాటించి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సభలో పిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె యాదగిరి, నాయకులు ఆకుల పాపయ్య. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సరిత, వరదయ్య, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కట్లె భూమయ్య, నాయకులు ఎల్‌బీరవి, శ్రీనివాస్, మల్లేష్, మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు న్యాయవాది వి సంగం మాట్లాడారు. నాయకులు స్వప్న, జైత్రాం, గంగాధర్,యాదగిరి, ఆకుల పాపయ్య, వి ప్రబాకర్, ఎన్ దాసు, వేల్పూర్ భూమయ్య, వనమాల కృష్ణ, నరేందర్, గంగాధర్, మల్లేశ్ పాల్గొన్నారు.
 
 విద్యార్థులతో భారీ ర్యాలీ..
 ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) జిల్లా 19 వ మహాసభలు అట్టహాసంగా చేపట్టారు. స్థానిక శక్కర్‌నగర్ క్రీడా మైదానానికి చేరుకున్న వందలాది మంది కార్యకర్తలు, విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అరుణోదయ కళాకళాకారులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు. సభ ప్రారంభ సూచకంగా పిడికిలి గుర్తు ఉన్న ఎర్ర జెండాను జిల్లా అధ్యక్షురాలు సరిత ఆవిష్కరించారు.
 
 రెండువర్గాల ఘర్షణ..
 మహాసభలో కాసేపు పీడీఎస్‌యూ నాయకులు రెండు వర్గాలు విడిపోయి ఘర్షణ పడటం ఉద్రిక్తతకు దారితీసింది. భోజన విరామ సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రెండు గ్రూపులుగా విడిపోయి కార్యకర్తలు దాడులకు యత్నించారు. బోధన్ సీఐ శంకరయ్య పోలీసు సిబ్బంది అక్కడి చేరుకున్నారు. యూనియన్, పార్టీ నాయకులు రెండువర్గాలను సముదాయించేందుకు ప్రయత్నించారు.

Advertisement
Advertisement