‘ఈ ప్రభుత్వం ఉంటే కష్టాలు తప్పవు’ | Sakshi
Sakshi News home page

‘ఈ ప్రభుత్వం ఉంటే కష్టాలు తప్పవు’

Published Mon, Jul 3 2017 6:56 PM

‘ఈ ప్రభుత్వం ఉంటే కష్టాలు తప్పవు’ - Sakshi

కంకిపాడు: రాష్ట్రంలో అరాచకం నెలకొందని, శాంతిభద్రతలు క్షీణించాయని వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడ్పుగల్లులో సోమవారం జరిగిన పార్టీ జిల్లా ప్లీనరీకి ముఖ్య అతిథిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు అవినీతిలో కూరుకుపోయారని.. ఇసుక, మట్టి, మద్యం ఇలా ప్రతి విషయంలోనూ అధికార పార్టీ దోపిడీ కొనసాగుతోందని ఆరోపించారు. అమరావతి రాజధాని పేరుతో భూదందా జరుగుతోందని.. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీలు ఒక్క వర్షానికే కురవడాన్ని ప్రజలు గమనించారన్నారు.

మహానేత వైఎస్ఆర్ పోలవరం కాలువలు నిర్మిస్తే వాటిని నేటి పాలకులు వాడుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని, ఒక్క పురుషోత్తపట్నంలోనే వెయ్యి కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. పెన్షన్లు తొలగించారు, రేషన్ కార్డులను ఎత్తివేస్తున్నారని, ఈ ప్రభుత్వం ఇంకా ఎక్కువ కాలం కొనసాగితే పేదలకు మరింత కష్టాలు తప్పవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేకపోయారన్నారు. తిరిగి వైఎస్ఆర్ పాలన కావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు.

పార్టీ రాష్ట్ర నేత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం డబ్బు ఇవ్వడం లేదంటూ సీఎం చంద్రబాబు కుంటిసాకులు చెబుతున్నారన్నారు. ప్రతిదానికి ప్రతిపక్ష నేతపై దుమ్మెత్తిపోయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని విమర్శించారు.

పార్టీ అధికార ప్రతినిధి పేర్ని నాని మాట్లాడుతూ వైఎస్ఆర్ హయాంలో ప్రతి ఏటా జూన్‌లో డెల్టాకు సాగునీరు ఇచ్చిన విషయాన్ని మంత్రి దేవినేని గుర్తు చేసుకోవాలన్నారు. ఇసుక, మట్టితో అవినీతికి పాల్పడిన టీడీపీ నేతలు తరతరాలకు సరిపడేంత సంపాదించుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు ఆదిమూల సురేష్, కొడాలి నాని, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా ప్లీనరీలో ప్రసంగించారు.     

 

Advertisement
Advertisement