ఏడి‘పింఛెన్’.. | Sakshi
Sakshi News home page

ఏడి‘పింఛెన్’..

Published Sat, Sep 20 2014 1:13 AM

ఏడి‘పింఛెన్’.. - Sakshi

  • తొలి రోజు ఆలస్యంగా పింఛన్ల సర్వే ప్రారంభం
  •  జగ్గయ్యపేట, గుడివాడ, తిరువూరులోఅసలు మొదలు కాలేదు
  •  మచిలీపట్నం, నూజివీడులలో సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం
  •  అన్ని కేంద్రాల వద్ద పండుటాకుల పడిగాపులు
  •  సర్వే కేంద్రాల వద్ద టీడీపీ నాయకుల హవా
  • మచిలీపట్నం : ప్రభుత్వం సర్వే పేరుతో జిల్లా వ్యాప్తంగా పింఛనుదారులను తొలి రోజు ఏడిపించింది. లబ్ధిదారులందరూ ఉదయం తొమ్మిది గంటలకే పంచాయతీ కార్యాలయాలు, పింఛను పంపిణీ కేంద్రాలకు రావాలని ప్రచారం చేసిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. అసలే ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పండుటాకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అల్లాడిపోయారు.

    కూర్చునేందుకు చోటు లేక, తాగేందుకు మంచినీరు దొరక్క వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పింఛనుదారుల సర్వే కార్యక్రమం శుక్రవారం అనేక ప్రాంతాల్లో ఆలస్యంగా ప్రారంభమైంది. కొన్ని ప్రాంతాల్లో అసలు ప్రారంభం కాలేదు. సర్వే జాబితాలు సకాలంలో అందకపోవడంతో పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటలకు కూడా సర్వే ప్రారంభం కాలేదు. కొన్ని ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది వచ్చినా సామాజిక కార్యకర్తలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచిలు, కౌన్సిలర్లు సకాలంలో రాకపోవటంతో సర్వే ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది.

    దీంతో లబ్ధిదారులు పడిగాపులు పడ్డారు. వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికుల పింఛన్లకు సంబంధించిన వివరాలను సర్వే కమిటీ సభ్యులు సేకరించారు. సర్వే జాబితాలో ఉన్న వివరాలు, లబ్ధిదారుల వద్ద ఉన్న పత్రాలను సరిచూసుకున్నారు. వితంతు పింఛన్లు తీసుకునే వయసు మళ్లిన వారి వద్ద భర్త డెత్ సర్టిఫికెట్లు లేకపోవటంతో శనివారం వాటిని చూపించాలని నిబంధన విధించారు. ఆ సర్టిఫికెట్ ఏదో తమకు తెలియదని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు.
     
    టీడీపీ నేతల హడావుడి..

    ఈ సర్వే ప్రక్రియలో టీడీపీ నేతల హడావుడి ఎక్కువగా ఉంది. వైఎస్సార్ సీపీ సర్పంచిలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు ఉన్న ప్రాంతాల్లో టీడీపీ నేతలు తమ హవాను కొనసాగించేందుకు ప్రయత్నించారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన టీడీపీ అభ్యర్థులకే పెత్తనం అప్పగించారు. సర్వే కమిటీలో సామాజిక కార్యకర్తలు, డ్వాక్రా సభ్యులను ఇద్దరు చొప్పున నియమించే అవకాశం ఉంది. ఈ నలుగురు స్థానాల్లో టీడీపీ సానుభూతిపరులకే అవకాశం ఇచ్చారు. కమిటీల నియామకం మొత్తం ఆయా నియోజకవర్గాల శాసనసభ్యుల కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది.
     
    సర్వే ప్రక్రియ సాగిందిలా..

    మచిలీపట్నం పురపాలక సంఘం, బందరు మండలంలో సాయంత్రం 4.30 గంటలకు సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. పింఛను పొందే లబ్ధిదారుల జాబితాలు సకాలంలో అందకపోవటంతో ఈ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. పట్టణంలో టీడీపీ నాయకుల హడావుడే ఎక్కువగా ఉంది. జాబితాలు ఆలస్యంగా రావటంతో పట్టణంలో 1 నుంచి 30 వార్డుల వరకు మాత్రమే సర్వే ప్రారంభమైంది. మిగిలిన 12 వార్డుల్లో సర్వే శనివారం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
     
    అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి, కోడూరు, అవనిగడ్డ మండలాల్లో కూడా సాయంత్రం 4 గంటలకు సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని పత్రాలతో ఉదయం తొమ్మిది గంటల నుంచి సిద్ధంగా ఉన్న లబ్ధిదారులు పడిగాపులు పడాల్సి వచ్చింది.
     
    కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, కైకలూరు మండలాల్లో మధ్యాహ్నం 2గంటలకు సర్వే  ప్రారంభమైంది. అన్ని ప్రాంతాల్లోనూ కమిటీ సభ్యులుగా సామాజిక కార్యకర్తలు, డ్వాక్రా మహిళలను టీడీపీ సానుభూతిపరులనే నియమించారు.
     
    పెడన నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తల హడావుడే అధికంగా కనిపించింది. గ్రామ స్థాయిలో ఎవరికి ఎంత భూమి ఉందో వివరాలు తెలిసే అవకాశం ఉన్నందున, టీడీపీకి సానుభూతిపరులుగా ఉన్న వారి పత్రాలను పరిశీలించే సమయంలో నోరుమెదపని కమిటీ సభ్యులు.. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు వస్తే వారి భూమి, ఇతర వివరాలు గుచ్చిగుచ్చి ప్రశ్నించారు.
     
    పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కల, పెదపారుపూడి, పామర్రు, మొవ్వ, తోట్లవల్లూరు మండలాల్లో కూడా సర్వే ఆలస్యంగానే ప్రారంభమైంది. పామర్రులో జరిగిన సర్వేలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు, టీడీపీకి చెందిన బీఏఎం లాజరస్ తనదైన శైలిలో సొంతపార్టీ వారికి అనుకూలంగా వ్యవహరించారు.
     
    గుడివాడ పురపాలక సంఘంలో సర్వే ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కాలేదు. జాబితాలు రాలేదని అధికారులు తెలిపారు.
     
    పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరు మండలాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య సర్వే ప్రారంభమైంది.
     
    మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీం పట్నం, జి.కొండూరు, రెడ్డిగూడెం, మైలవరం మండలాల్లోనూ సర్వే ఉదయం 11గంటల తరువాతే ప్రారంభమైంది. అధిక సంఖ్యలో పింఛనుదారులు రావటంతో తాగేందుకు నీరు, కూర్చునేందుకు వసతి లేక వృద్ధులు ఇక్కట్ల పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల హడావుడి స్పష్టంగా కనిపించింది.
     
    జగ్గయ్యపేట మున్సిపాలిటీలో సర్వే ప్రారంభం కాలేదు. పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సర్వే ప్రక్రియ మొదలైంది.
     
    నందిగామ నియోజకవర్గంలో వీరులపాడులో మధ్యాహ్నం 3గంటలకు సర్వే ప్రారంభమైంది. చనిపోయిన వారి పేర్లను కమిటీ సభ్యులు సేకరించారు. నందిగామ పురపాలక సంఘంలో సర్వే ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కాలేదు. కమిటీ సభ్యుల నియామకం, వారికి విధివిధానాలు వివరించే సమావేశం ఏర్పాటు చేశారు. సర్వే సందర్భంగా ఒకే కుటుంబంలో ఇద్దరికి పింఛను వస్తుంటే ఒకరికి మాత్రమే ఇస్తామని చెబుతున్నారు.
     
    గన్నవరం నియోజకవర్గంలో సర్వే ప్రక్రియ సకాలంలోనే ప్రారంభమైంది. లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్, రేషన్‌కార్డు తదితర వివరాలను కమిటీ సభ్యులు సేకరించారు.  
     
    తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట, తిరువూరు పురపాలక సంఘం, తిరువూరు మండలం, ఎ.కొండూరులలో సర్వే ప్రక్రియ ప్రారంభం కాలేదు. గంపలగూడెంలో సర్వే ప్రక్రియ ప్రారంభమైంది.
     
    నూజివీడు పురపాలక సంఘంలో శుక్రవారం సాయంత్రం 5గంటలకు సర్వే ప్రక్రియ నిర్వహించారు. ఆగిరిపల్లి, చాట్రాయి మండలాల్లో ఆలస్యంగా సర్వే ప్రక్రియ ప్రారంభమైంది.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement