మా ఊరు.. నిరసనల హోరు | Sakshi
Sakshi News home page

మా ఊరు.. నిరసనల హోరు

Published Fri, Jan 4 2019 7:35 AM

People Protest Against Janmabhoomi Committee - Sakshi

సాక్షి, విశాఖపట్నం: జన్మభూమి–మావూరులో నిరసనలు హోరెత్తుతున్నాయి. రెండో రోజైన గురువారం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను ఎక్కడికక్కడ ప్రజలు నిర్బంధించారు. పిం ఛన్లు, రేషన్‌కార్డులు, గృహాలు, మరుగు దొడ్ల బి ల్లులు చెల్లింపులపై నిలదీశారు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించలేనప్పుడు జన్మభూమి సభలెందుకంటూ మండిపడ్డారు. రాష్ట్రమంత్రి సీహెచ్‌ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో పాల్గొనగా, మరోమంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ పాడేరు, హుకుంపేట మండలాల్లో కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఈ సభల్లో పాల్గొన్నారు. తొలిరోజు నిరసన సెగను ఎదుర్కొన్న మరో మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం రెండ రోజు సభలకు దూరంగా ఉన్నారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, బండారు సత్య నారాయణమూర్తి, వంగలపూడి అనిత తదితరులకు రెండోరోజు కూడా నిరసన సెగలు తప్పలేదు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార్‌లు సభలకు వచ్చిన అర్జీదారులపై అసహనం ప్రదర్శించారు. సభలకు డ్వాక్రా సంఘాలు, విదా ్యర్థులను బలవంతంగా తరలించారు. మరోవైపు జన్మభూమి సభలకు వచ్చిన సిబ్బందికి మధ్యా హ్న భోజన పథకం కింద పిల్లలకు తయారు చేసిన భోజనాలు పెడుతున్నారు. ఇది వార్డెన్లు, ఏజెన్సీ నిర్వాహకులకు భారమవుతోంది.

భీమిలిలో రసాభాస
భీమిలి జోన్‌ ఒకటోవార్డు బంగ్లామెట్టపై జరిగిన గ్రామసభలో మహిళలు తాగునీటి కోసం అధి కారులను నిలదీయడంతో రసాభాసగా మారిం ది. బంగ్లామెట్టపై కుళాయిల ద్వారా తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేక పోయిందన్నారు. బోరు బావులు కూడా లేనందున మహిళలు ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. మెట్టపై తాగునీటి పథకం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో గంటపాటు సభకు ఆటంకం కలిగించారు.

ఇళ్ల సమస్య తేల్చండి
పదేళ్లుగా కాలనీలో ఇళ్ల సమస్యను తేల్చకుండా నాన్చుతున్నారని, ఈ సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారో తెలపాలని ఆనందపురం మండలం వెల్లంకిలో జరిగిన గ్రామసభలో అధికారులను స్థానికులు నిలదీశారు. గొలగాని చిన్నమ్మ అనే అంధురాలు కాలనీ కోసం ఐదేళ్లుగా దరఖాస్తు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆర్డీవో తేజ్‌ భరత్‌కు వివరించారు. ఎనిమిదేళ్ల కిందట 440 మందికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ జాబితాను విడుదల చేశారని, కానీ నేటి వరకు అప్పగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 70 మందికి రూ.25 లక్షల వరకు రుణమాఫీ అయిందని అధికారులు సభలో ప్రకటించగా.. వివరాలను వెల్లడించాలని గ్రామస్తులు పట్టుబట్టారు.

దరఖాస్తులు బుట్టదాఖలు
పద్మనాభం మండలం ఐనాడలో జరిగిన జన్మభూమి సభ రసాభాస అయింది. అసంపూర్తిగా మరుగుదొడ్లు నిర్మించిన అధికార పార్టీకి చెందిన వారికి బిల్లులు మంజూరు చేశారని, వైఎస్సార్‌ సీపీకి చెందిన వారు పూర్తిగా మరుగుదొడ్లు నిర్మించినా బిల్లులు మంజూరు చేయలేదని ఆ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మామిడి శివరామకృష్ణ ఆరో పించారు. హుద్‌హుద్‌ బాధితులకు ఇళ్లు, ఒంటరి మహిళలకు ఎందుకు పింఛన్లు మంజూరు చేయడం లేదని అధికారులను మహిళలు నిలదీశారు. జన్మభూమి సభల్లో చేసుకున్న దరఖాస్తులను బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు.

మాట్లాడేందుకు అవకాశం ఇవ్వరా.?
గాజువాక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో 64వ వార్డు సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని మాజీ కార్పొరేటర్, వైఎస్సార్‌ సీపీ నేత పల్లా చినతల్లి, నాయకుడు పల్లా పెంటారావు కోరారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, నాయకులు కార్యక్రమం ఆఖరులో అవకాశం ఇస్తామని చెప్పడంతో.. చివ ర్లో అవకాశం ఇస్తే ప్రయోజనం ఏముందని వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఐ కె.రామారావు ఆదేశాలతో ఎస్‌ఐలు వారిని వేదిక కిందకు దింపేశారు. దీంతో వారు వేదిక ముందే నిరసన తెలిపారు. వార్డులో భూ కబ్జాలు పెరిగిపోయానని, ఇళ్లు మంజూరు కావాలంటే రూ.50 వేలు లంచం కావాలని జన్మభూమి కమిటీ డిమాండ్‌ చేస్తోందని వారు ఆరోపించారు.

జిల్లాలోనూ నిరసనల పర్వం
ఏజెన్సీలోని జి.మాడుగుల–సొలభం రోడ్డు పనులు చేపట్టాలని సొలభం, గడుతూరు, వంతాల, పెదలోచలి పంచాయతీల గిరిజనులు, మహిళా సంఘం, గిరిజన సంఘం, వైఎస్సార్‌సీపీ, జనసేన, కాంగ్రెస్‌ నాయకులు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, అధికారులను అడ్డుకున్నారు.  గిరిజన సంక్షేమ శాఖమంత్రి కిడారి శ్రావణ్‌కుమార్, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ హుకుంపేట, అడ్డుమండ గ్రామాల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గిరిజనులు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నించినా పోలీసులు అడ్డుకోవడంతో మాట్లాడలేకపోయారు. అరకులోయ మండలం చొంపిలో జరిగిన గ్రామసభను గిరిజనులు అడ్డుకున్నారు. ఖాళీ బిందెలతో గిరిజనులు నిరసన తెలిపారు. ముంచంగిపుట్టు మం డలం సుజనకోట పంచాయతీ కేంద్రంలో జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరించారు. పాడేరు మండలం ఇరడాపల్లిలో సబ్‌సెంటర్‌ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ను డిమాండ్‌ చేశారు. కె.కోటపాడు మండలం వారాడలో జరిగిన జన్మభూమి సదస్సును రైతులు అడ్డుకున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement