సభలెందుకు దండగ | Sakshi
Sakshi News home page

సభలెందుకు దండగ

Published Wed, Jan 9 2019 1:50 PM

People Protest in Janmabhoomi Maa vooru Programme - Sakshi

తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి సభలపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. గత గ్రామ సభల్లో ఇచ్చిన అర్జీల గురించి పట్టించుకోకుండా మళ్లీ ఎందుకు వచ్చారంటూ నిలదీస్తున్నారు. ఇప్పుడు ఇచ్చే అర్జీలు కూడా బుట్టదాఖలు కావాల్సిందేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు గ్రీవెన్స్‌లో ఇచ్చిన అర్జీలకే దిక్కు లేనప్పుడు ఈ సభలెందుకు దండగని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ తీరు కారణంగా తాము మాటలు పడాల్సి వస్తోందని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, గుంటూరు: ఏళ్ల తరబడి జన్మభూమి సభల్లో ఇచ్చిన అర్జీలు, ఫిర్యాదులకు మోక్షం లభించలేదు..మళ్లీ జన్మభూమి సభలెందుకంటూ జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి గ్రామ సభల్లో అధికారులు, అధికార పార్టీ నేతలను నిలదీస్తున్నారు. పలు ప్రాంతాల్లో మంగళవారం జన్మభూమి సభలు రసాభాసగా మారాయి. ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రేషన్‌ కార్డులు మంజూరు చేయడం లేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి మండలం కాజ గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన జన్మభూమి గ్రామ సభలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్‌ పునేఠా పాల్గొన్నారు. గత జన్మభూమి సభల్లో ఇచ్చిన అర్జీలు పరిష్కారం కాలేదని వృద్ధులు సీఎస్‌కు చెప్పుకునే ప్రయత్నం చేయగా అధికారులను వారిని అడ్డుకున్నారు. సీఎస్‌ కేవలం అర్ధగంట సేపు మాత్రమే సభలో ఉన్నారని, కనీసం తమ బాధలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదని ప్రజలు వాపోయారు.

అధికారులను నిలదీసిన వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌లు...
అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం పక్షపాతం చూపిస్తోందని, పచ్చ కండువా కప్పుకుంటేనే సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు అధికారులను నిలదీశారు. సత్తెనపల్లి పట్టణం 20వ వార్డులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ కూకుట్ల లక్ష్మి అధికారులపై మండిపడ్డారు. పొన్నూరు 22, 23వ వార్డుల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌లు అధికారులను నిలదీశారు. వార్డుల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు దుర్వినియోగమవుతున్నాయని మండిపడ్డారు.  

ఎన్ని పంటల పొలాలు లాక్కుంటారు...
ప్రభుత్వం అభివృద్ధి, పథకాల పేరుతో పంట పొలాలను లాక్కుంటోందని మేడికొండూరు మండల పరిధిలో నిర్వహించిన సభలో నీరు చెట్టు పథకం పేరుతో అధికార పార్టీ నేతలు తమ పంట పొలాలు లాక్కున్నారని మహిళా రైతులు అధికార పార్టీ నేతలపై ఫిర్యాదు చేశారు. రోడ్డు విస్తరణల పేరుతో ఇంకా ఎన్ని పొలాలు లాక్కుంటారని అధికారులను రైతులు నిలదీశారు. తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురంలో శ్మశానం లేక ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదు చేశారు.

ఇళ్ల స్థలాలు మంజూరు చేయరా ?
దుగ్గిరాల, తాడేపల్లి మండలాల్లో నిర్వహించిన జన్మభూమి సభల్లో ఇళ్ల స్థలాలు, పట్టాల కోసం ప్రజలు ఆందోళన చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే అధికార పార్టీ నేతలకు ప్రజలు గుర్తుకు వస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం..
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 29, 40, 28 డివిజన్లలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ కేవలం నెల్లూరు జిల్లాకు మాత్రమే మంత్రా.. అధికారులు, మంత్రి తమషాలాడుతున్నారా? గుంటూరు నగరపాలక సంస్థ రెగ్యులర్‌ ఎస్సీ నియమించకపోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సాధికారక సర్వే ఓ పెద్ద బోగస్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదకూరపాడు, మాచర్ల, నరసరావుపేట, తెనాలి సహా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన జన్మభూమి సభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రజలు సమస్యల పరిష్కారంపై నిలదీశారు. పూలు ప్రాంతాల్లో పాఠశాలలు జరిగే రోజుల్లోనే జన్మభూమి సభలు పాఠశాలల్లో ఏర్పాటు చే యడంతో పాటు జనాలు లేని ప్రాంతాల్లో విద్యార్థులను కూర్చోబెట్టి సభలు నిర్వహించారు.  

Advertisement
Advertisement