నిలదీతలు.. నిరసనలు | Sakshi
Sakshi News home page

నిలదీతలు.. నిరసనలు

Published Thu, Jan 3 2019 12:52 PM

People Protests in Janmabhoomi Maa vooru Programme Guntur - Sakshi

సాక్షి, అమరావతిబ్యూరో: జన్మభూమి సభలు తొలిరోజు ప్రజలు లేక వెలవెలబోయాయి. పలు చోట్ల తమ సమస్యలు పరిష్కారం కాలేదని అధికారపార్టీ నేతలను ప్రజలు నిలదీశారు. గత నాలుగేళ్లుగా పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదని, అలాంటప్పుడు గ్రామసభలు ఎందుకంటూ  అధికార పార్టీ నేతలను ప్రశ్నించి, నిరసన తెలిపారు. మొత్తం మీద జన్మభూమి – మా ఊరు సభలకు జనాలు రాకపోవడంతో పింఛన్లు ఇస్తామంటూ వృద్ధులను, డ్వాక్రా మహిళలను పిలిపించి మమా అనిపించారు. పలు చోట్ల జరిగిన జన్మభూమి సభలు కాస్త టీడీపీ నాయకుల రాజకీయ ప్రచార సభలుగా మారాయి.
గుంటూరు నగరంలోని నల్లచెరువులోని 18, 19 డివిజన్‌లలో జరిగిన జన్మభూమి సభల్లో ఇంటి స్థలాలు, రేషన్‌ కార్డులు, రేషన్‌ కార్డులు, గత మూడేళ్లుగా దరఖాస్తు చేసుకున్నా ఇవ్వడం లేదంటూ మహిళలు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డిని నిలదీయడంతో జన్మభూమి సభ రసభాసగా మారింది.
రేపల్లె నియోజకవర్గంలో ధూళిపూడి గ్రామంలో జనాలు లేక జన్మభూమి సభలు వెలవెలబోయాయి. చెరుకుపల్లి మండలం కుంచలవానిపాలెం పంచాయతీలో జెడ్పీటీసీ సభ్యుడు టి.శ్రీనివాసరెడ్డి అంగన్‌వాడీ న్యూట్రీషిన్‌ ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ. 2.50 లక్షలు తీసుకున్నాడని, ప్రస్తుతం ఆపోస్టులో రద్దు కావడంతో జెడ్పీటీసీ సభ్యుడు డబ్బులు ఇవ్వకపోవడంతో తమ కోడలు శివలక్ష్మి మతిస్థిమితం లేకుండా పోయిందంటూ ఆమె బంధువులు గ్రామసభలో ఎమ్మెల్యేను నిలదీశారు.
ప్రత్తిపాడు నియోజకవర్గంలో జొన్నలగడ్డ, నల్లపాడు ప్రాంతాల్లో రేషన్, పింఛన్‌లు రావడం లేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. పెందనందిపాడు మండలం అబ్బినేని గుంటపాలెంలో రైతురథం ట్రాక్టర్లు అధికార పార్టీ నేతలకే ఇస్తున్నారని, మిగతా రైతులను పట్టించుకోవడంలేదని నిరసన తెలిపారు.
తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో పెథాయ్‌ తుపానుకు తడిచి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలంటూ భారతీయ కిసాన్‌ సంఘ సభ్యులు ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.
మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ కాలేదంటూ నిలదీశారు. మంగళగిరి మండలంలో రామచంద్రాపురంలో సైతం అదే పరిస్థితి నెలకొంది. జన్మభూమి సభలు టీడీపీ ప్రచార సభలుగా మారాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
n వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం ఈపూరు గ్రామంలో మరుగుదొడ్లకు బిల్లులు చెల్లించడం లేదని పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని గ్రామస్తులు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును నిలదీశారు. బిల్లులు ఇప్పిస్తామని మరుగుదొడ్లకు సంబంధించిన పత్రాలు తీసుకుని వాటి బిల్లులను కొంత మంది కాజేశారని ఆందోళన వ్యక్తం చేశారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలోని సత్తెనపల్లి, రొంపిచర్ల మండలాల్లో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు పాల్గొన్నారు. జన్మభూమి సభల్లో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల మాట్లాడిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని, రాజకీయ ప్రసంగానికి తెరలేపారు.
మాచర్ల పట్టణంలో బుగ్గవాగు రిజర్వాయర్‌ నుంచి పట్టణానికి తాగునీరందించే పథకం పనులు పూర్తి కాలేదంటూ బీజేపీ నాయకులు నిరసన తెలిపారు.  పలు మండలాల్లో తమ సమస్యలు పరిష్కారం కాలేదంటూ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
తాడికొండ నియోజకవర్గంలోని తుళ్లూరు మండలం వెంకటగ్రామంలో మూడేళ్ల నుంచి రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని, అధికారులను నిలదీశారు. కంతేరు గ్రామంలో జెడ్పీవైస్‌చైర్మన్‌ వడ్లమూడి పూర్ణచంద్రరావును విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు రావడం లేదంటూ తల్లిదండ్రలు ఆందోళన వ్యక్తం చేశారు.
పెదకూరపాడు నియోజకవర్గంలోని 75 త్యాళ్లూరులో  బుడగజంగాల కాలనీకి వెళ్లేందుకు కనీసం రోడ్డు కూడా లేదంటూ కాలనీ వాసులు అధికారులను అడ్డుకున్నారు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో కుక్కపల్లెవారిపాలెం గ్రామంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా భూ విస్తీర్ణం వెబ్‌ల్యాండ్‌లోకి ఎక్కించడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. యడ్లపాడు మండలంలో డ్వాక్రా మహిళలకు రుణాలు అందడంలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

పెసర్లంకలో అధికారుల నిర్బంధం
వేమూరు నియోజకవర్గంలోని పెసర్లంకలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ‘జన్మభూమి – మా ఊరు’లో గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల హద్దులు తేల్చాలని గత విడత జన్మభూమి కార్యక్రమంలో అర్జీలు అందించినా, జిల్లా కలెక్టర్, తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేసినా ఫలితం లేదని వాపోయారు. ఈ క్రమంలో అ«ధికారులను అడ్డుకుని గ్రామస్తుల సమస్యను పరిష్కరించిన తర్వాత గ్రామ సభ నిర్వహించుకోవాలని డిమాండ్‌ చేస్తూ మహిళలు, పిల్లలు, పెద్దలు  కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అధికారులను రిజిస్టర్‌లలో సైతం సంతకాలు పెట్టనీయలేదు. ఉదయం తొమ్మిది గంటలకు రావాల్సిన అధికారులు 10 గంటలకు రాగా, సాయంత్రం వరకు వారిని నిర్బంధించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement