Sakshi News home page

ఎందుకొచ్చారు!

Published Thu, Jan 3 2019 11:30 AM

People Rejects TDP Janmabhoomi Maa vooru Programme - Sakshi

నెల్లూరు(పొగతోట): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 6వ విడత జన్మభూమి గ్రామ సభలకు నిరసనల సెగ తగిలింది. గతంలో ఇచ్చిన అర్జీలకే దిక్కులేదని, మళ్లీ ఎందుకొచ్చారంటూ అధికారులను నిలదీశారు. గ్రామ సభలకు వెళ్లే అధికారులను అడ్డుకుని రాస్తారోకోలు చేశారు. నిరసనలు, నిలదీతలతో గ్రామ సభలు రసాభాసగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో జనం రాక వెలవెల బోయాయి. తొలి రోజు జిల్లా వ్యాప్తంగా 123 గ్రామ సభలు నిర్వహించారు. గతంలో ఇచ్చిన అర్జీలకే దిక్కులేదు.. మళ్లీ మోసం చేయడానికి వచ్చారా? అంటూ  ప్రజలు అధికారులను నిలదీశారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీరు లేక అగచాట్లు పడుతుంటే నీరు ఇవ్వకుండా చోద్యం చూస్తున్న అధికారులు ఇప్పుడెందుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని పట్టించుకోవడం లేదని సాగునీరు కోసం రైతులు నిరసన వ్యక్తం చేశారు. సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి, ఉదయగిరి, గూడూరు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో ప్రజల నుంచి నిరసన సెగలు ఎదురయ్యాయి.

రేషన్‌కార్డుల కోసం గతంలో వేల సంఖ్యలో అర్జీలు సమర్పించినా ఇంత వరకూ అతీగతీ లేదని ప్రజలు అధికారులను నిలదీశారు. పింఛన్లు సైతం మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వారిని మాత్రమే ఎంపిక చేశారని, అర్హులను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభలో అధికారులు ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేసేందుకే ఎక్కువ సమయం కేటాయించారు.  ప్రభుత్వ పథకాలు అర్హులకు అందడం లేదని ప్రజలు చెబుతున్నా అవేమీ పట్టనట్లు వారికి ఇచ్చిన పత్రాలను అధికారులు చదువుకుంటూ పోయారు. అనేక ప్రాంతాల్లో సభలకు ప్రజలు తక్కువసంఖ్యలో హాజరయ్యారు. దీంతో విద్యార్థులు, మహిళలను గ్రామ సభలకు తరలించారు. ఎలాంటి ఫలితాలు ఇవ్వలని ఇలాంటి సభలు నిర్వహించడం దండగని నిరసనలు వ్యక్తమయ్యాయి. గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం ఉప్పలమర్తి, మల్లాం గ్రామాల్లో జన్మభూమి సభల్లో సాగునీరు లేదని, భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదని ప్రజలు అధికారులను నిలదీశారు. దుత్తలూరులో మంచినీటి కోసం మహిళలు రోడ్డుపై మూడు గంటల పాటు రాస్తారోకో చేశారు. జన్మభూమికి వెళుతున్న అధికారులు, అధికారపార్టీ నాయకులను మహిళలు అడ్డుకున్నారు.

జన్మభూమి రసాభాస
వెంకటగిరి: అంతా అనుకున్నట్టే అవుతుంది. రేషన్‌కార్డులు.. íపింఛన్లు వచ్చేస్తాయోనని ఎదురు చూసిన లబ్ధిదారులకు నిరాశే మిగిలింది. సమస్యలను చెప్పుకుందామంటే అవకాశం ఇచ్చే పరిస్ధితి లేదు.. ఎవరైనా ముందుకు వచ్చి తమ ఆవేదనను ఒకింత ఆగ్రహంగా వ్యక్తం చేస్తే మధ్యం సేవించి గోడవలు సృష్టిస్తావా అంటూ పోలీసులచే అరెస్టులకు తెగబడడం. ఇదీ వెంకటగిరి మున్సిపాలిటీలో తొలిరోజు జన్మభూమి తీరు తెన్ను...

సమస్య ప్రస్తావిస్తే అరెస్ట్‌లా..
3 వార్డుకు చెందిన సిద్దయ్య అనే యువకుడు సంక్షేమపథకాలు అమలుతీరుపై అధికారులని, ప్రజాప్రతినిధులను నిలదీయడంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే రామకృçష్ణ సమీపంలో ఉన్న పోలీసులతో అరెస్ట్‌ చేయించారు. దీంతో పోలీసులు సిద్ధయ్యను అరెస్ట్‌ చేసి సభ ముగిసే వరకు పోలీసు జీపులోనే ఉంచారు. దీంతో సిద్ధయ్య కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ దిక్కుతోచని స్థితిలోఉండిపోయారు.

గంగ జలాలు ఇవ్వకుంటే జన్మభూమిని జరగనివ్వం
డక్కిలి: వర్షాభావంతో సాగు, తాగు నీరులేక అల్లాడుతుంటే కండలేరు నీటిని ఎందుకు విడుదల చేయడంలేదని రైతులు జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో అధికారులను నిలదీశారు. బుధవారం ఉదయం మండలంలోని నాగవోలు పంచాయతీలో జన్మభూమి కార్యక్రమం తొలిరోజు ప్రారంభమైంది. అధికారులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదే సమయంలో నాగవోలు పంచాయతీలోని నాగవోలు, మిట్టపాళెం, వడ్డిపల్లి, చెన్నసముద్రం, పీవై సముద్రం గ్రామాలకు చెందిన 100 మంది పైగా రైతులు పార్టీలకతీతంగా జన్మభూమి కార్యక్రమాన్ని మూకుమ్మడిగా అడ్డుకున్నారు. గ్రామసభను నిర్వహించేందుకు సహకరించాలని మండల ప్రత్యేకాధికారి అమరనాథ్‌రెడ్డి, తహసీల్దార్‌ అబ్దుల్‌ఖాదర్‌లు రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. పొలాలకు సాగునీరు, పశువులకు తాగునీరు తెలుగుగంగ కాలువ ద్వారా అందించే వరకు జన్మభూమిని జరగనివ్వమని అధికారులకు రైతులు తేల్చి చెప్పారు. ఇక చేసేదేమి లేక ప్రత్యేక అధికారి గూడూరు సబ్‌కలెక్టర్, జిల్లా కలెక్టరేట్‌కు ఈ సమాచారాన్ని ఫోన్‌ ద్వారా చేరవేశారు. దీంతో తెలుగుగంగ డీఈ వచ్చి రైతులకు త్వరలో తెలుగుగంగ ద్వారా పశువులకు తాగునీరు విడుదల చేస్తామని తెలిపారు. అయినా రైతులు శాంతించకపోవడంతో ఎంపీపీ పోలంరెడ్డి వెంకటరెడ్డి నాగవోలుకు చేరుకుని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అంతేగాక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు ఆయన ఫోన్‌ చేసి సంఘటన వివరించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే రైతులతో ఫోన్‌లో మాట్లాడి త్వరలో నీరు విడుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నీరిచ్చిన తరువాతే జన్మభూమి నిర్వహించుకోవాలని రైతులు చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్‌ ఏఈ రసూల్, ఎంఈఓ కే వెంకటేశ్వర్లు, ట్రాన్స్‌కో ఏఈ జహీర్‌ అహ్మద్, ఎస్సై మరిడినాయుడు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

సభల వల్ల ఒరిగిందేమీ లేదు!
ముత్తుకూరు: నాలుగున్నరేళ్ల కాలంలో గ్రామసభల వల్ల పనులేవీ జరగలేదని మండలంలోని నారికేళపల్లి టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో భాగంగా బుధవారం పంచాయతీ కార్యాలయం వద్ద ప్రారంభించిన గ్రామసభను వారు అడ్డుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ ఆఫీసర్, వెటర్నరీ జేడీ విజయమోహన్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఇతర అధికారుల సమక్షంలో సమస్యలు ఏకరవు పెట్టారు. డెయిరీ చైర్మన్‌ కోట చంద్రశేఖర్‌రెడ్డి, టీడీపీ నేత పబ్బారెడ్డి చంద్రారెడ్డి, మాజీ సర్పంచ్‌ భాస్కర్‌ తదితరులు మాట్లాడుతూ, రెవెన్యూ శాఖలో ఒక్క పని కూడా జరగడంలేదన్నారు. రికార్డుల్లో రైతుల పేర్లు నమోదు చేయకపోవడం వల్ల బ్యాంకుల్లో రుణాలు లభించని దుస్థితి ఏర్పడిందన్నారు. గ్రామంలో ఒక్క ఎల్‌ఈడీ బల్బు అమర్చలేదని, కార్యదర్శి అందుబాటులో లేడన్నారు. గ్రామసభ జరుగుతుందని కనీసం దండోరా కూడా వేయలేదన్నారు. ముఖ్యమంత్రి ఎన్నో పథకాలు, ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు చెబుతుంటే అధికారులు ఒక్క పనికూడా చేయడం లేదన్నారు. తాము గ్రామసభ బహిష్కరిస్తున్నామని వినతిపత్రం అందచేశారు.

Advertisement
Advertisement