సంక్షేమమే లక్ష్యంగా సంకల్పం | Sakshi
Sakshi News home page

సంక్షేమమే లక్ష్యంగా సంకల్పం

Published Mon, Aug 6 2018 7:14 AM

People Sharing Their Problems In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి :అడుగడుగునా అవినీతి.. ఆశ్రిత పక్షపాతం.. పథకాల అమలులో వివక్ష.. వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులపై కక్ష.. దేవాలయాల్లో అయినవారికే కాంట్రాక్టులు.. ఒకటేమిటి? అన్నింటా ఇదే తంతు. నాలుగేళ్ల చంద్రబాబు ప్రభుత్వ పనితీరుతో ప్రజలు విసిగి వేసారిపోయారని జననేత జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు సైతం రాజన్న రాజ్యంలో పొందిన సంక్షేమాన్ని మళ్లీ ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే అందుకోగలమని భావిస్తున్నారు. అందుకే.. వనాల వద్దకు తరలివచ్చిన వసంతాన్ని చూసిన కోయిల కూసినట్టు.. జననేతను చూడగానే తమవాడిని చూసినవారిలా కేరింతలు కొట్టారు. ఆశలకు రెక్కలొచ్చినట్టు ఒక్కటొక్కటిగా సమస్యలు ఆయనకు ఏకరువుపెట్టారు. దేవుడు దయదలచి మన ప్రభుత్వం వచ్చాకా మన సంక్షేమాన్ని మనమే సాధించుకుందామని ఆయన భరోసా ఇచ్చారు. ఆదివారం  ప్రజా సంకల్ప యాత్ర గొల్లప్రోలు మండలం దుర్గాడలో ప్రారంభమై శంఖవరం మండలం కత్తిపూడి వరకూ సాగింది.

శాశ్వత పట్టాలు ఇవ్వడం లేదు
గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్‌–1లో ఉన్న కొండ భూమికి సంబంధించి శాశ్వత పట్టాలు ఇవ్వడం లేదని చెందుర్తికి చెందిన వాసా చిన్నబుల్లి జననేతకు ఫిర్యాదు చేసింది. హరిజన కులానికి చెందిన తాము నిరుపేదలమని, అర్హులకు ఇవ్వాల్సిన పట్టాలు ఇవ్వలేదని చెందుర్తికి చెందిన నక్కా మంగ వాపోయింది. కొడవలి, చెందుర్తికి చెందిన నిరుపేద కుటుంబాల వారమని, 25 ఏళ్లుగా జీడిమామిడి తోటలు పెంచుకుని జీవిస్తున్నామని, తమకు పట్టాలు ఇవ్వలేదని వాపోయారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని వారు కోరారు.

హౌసింగ్‌ బిల్లులుచెల్లించలేదయ్యా...
రుణం ఇస్తామంటే ఇల్లు కట్టుకున్నాం. తీరా కట్టేశాకా బిల్లులు చెల్లించలేదు. రూ.ఐదు లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టాం. అప్పులు తీర్చలేక సతమతమవుతున్నామయ్యా అంటూ తన సమస్యలను చెప్పుకున్నారు పాతకొట్టాంకు చెందిన వింటూరి రాజమణి. సామాన్యులను ఇలా ఇబ్బందులపాల్జేయడం ఏమైనా బాగుందా అంటూ జగన్‌తో తన బాధను చెప్పుకున్నారు. దేవుని దయతో ఏర్పడే ప్రభుత్వంలో ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటుందని జగన్‌ చెప్పినట్టు రాజమణి అన్నారు

పింఛను పెంచుతానన్నారు
అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను సొమ్ము పెంచుతానని జగన్‌ బాబు తెలిపారని కత్తిపూడికి చెందిన వృద్ధురాలు సాపుపునీడి నారాయణమ్మ తెలిపింది. తన భర్త చనిపోయి ఆరేళ్లయ్యిందని, మూడు నెలల క్రితం నుంచి పింఛను ఇస్తున్నారని, జగన్‌ సీఎం అయిన తరువాత నా పింఛను సొమ్ము పెంచి ఇస్తానన్నారని చెప్పడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది.

Advertisement
Advertisement