మిమ్మల్నే నమ్ముకున్నాం | Sakshi
Sakshi News home page

మిమ్మల్నే నమ్ముకున్నాం

Published Tue, Dec 4 2018 7:46 AM

People Sharing Their Problems in Praja Sankalpa Yatra - Sakshi

శ్రీకాకుళం అర్బన్‌ : టీడీపీని నమ్మి ఓట్లు వేస్తే నట్టేట ముంచారంటూ అన్ని వర్గాల ప్రజలు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయారు. రాజాంలో నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో భాగంగా సోమవారం జగనన్నను కలిసి నాలుగున్నరేళ్లుగా తాము పడుతున్న బాధలను, అధికార పార్టీ వైఫల్యాలను విన్నవించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ న్యాయం చేస్తానని జగనన్న భరోసా ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేశారు.– ప్రజా సంకల్పయాత్ర బృందం

ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించారు
సంతకవిటి మండలంలో 2007 నుంచి పనిచేస్తున్న 21 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లను రాజకీయ కారణాలతో 2014లో తొలగించారు. ఏడాదిలో 75 పని దినాలు కూడా ఉపాధి వేతనదారులకు కల్పించడం లేదు. సోషల్‌ ఆడిట్‌లో తప్పుగా చూపిస్తూ..ఫీల్డ్‌ అసిస్టెంట్లను అకారణంగా తొలగించేశారు అన్నా. మా కుటుంబాలన్నీ ఆర్థికంగా అవస్థలు పడుతున్నాయి.– కురుకాన వినయ్‌కుమార్, గొల్లవలస

రేషన్‌ లేదు...పింఛన్‌ కూడా లేదు
అయ్యా.. ఈ ప్రభుత్వంలో నిరుపేదలకు న్యాయం జరగడం లేదు. రేషన్, పింఛన్‌ కోసం కలెక్టర్‌ను కలిసి విన్నవించినా ప్రయోజనం చేకూరలేదు. నాలుగేళ్ల క్రితం నా  తెలుపు రేషన్‌ కార్డు రద్దు చేశారు. ప్రస్తుతం పింఛన్‌ కూడా ఇవ్వడం లేదు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు.– విట్ల సూర్యనారాయణ, రాజాం

వైద్యం అందడం లేదు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం దారుణంగా ఉందన్నా.. పోనీ ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుందామం ఆర్థిక స్థోమత సహకరించడం లేదు. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు రారు. మందులు ఇవ్వరు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులను పట్టించుకోకుండా దారుణంగా చూస్తున్నారు.– వోల్టి అప్పలనారాయణ, బూరాడ, రాజాం మండలం

నష్టపోయాం
అన్నా..పత్తి రైతులకు ప్రభుత్వం రాయితీపై సరఫరా చేస్తున్న పురుగు మందులేవీ పని చేయడం లేదు. గత ఏడాది నుంచి పంట దిగుబడులు లేక తీవ్రంగా నష్టపోయాం. పత్తి పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేదు. సాగుకు అప్పులు చేయాల్సి వచ్చింది. ఆర్థికంగా చితికిపోయాం. పత్తిరైతులను ఆదుకోవాలి.                 – ఇద్దిబోని సూర్యనారాయణ, నెమలాం గ్రామం, తెర్లాం మండలం, విజయనగరం

కక్ష సాధిస్తున్నారు...
వైఎస్సార్‌ సీపీకి మద్దతుదారుడునని నన్ను ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం నుంచి తొలగించారు. టీడీపీ ప్రభుత్వం మాపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఎలాగైనా ఇటువంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలి.– పోలిరెడ్డి సత్యవతి, మగ్గూరు

నిరుద్యోగులనుమోసం చేసిన టీడీపీ
టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసిందని రాజాంకు చెందిన వై.విజయ సుశీల ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సమస్య వివరించారు. గత ఎన్నికల సమయంలో అన్ని రకాల పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు ప్రగల్భాలు పలికారని, అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదని వాపోయారు. తాను మూడు విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసి బీఈడీ పూర్తి చేశానని, తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని విన్నవించింది.

Advertisement
Advertisement