కన్నీటి విన్నపం | Sakshi
Sakshi News home page

కన్నీటి విన్నపం

Published Fri, Sep 7 2018 7:37 AM

People Sharing Their Problems To YS Jagan - Sakshi

విశాఖపట్నం : మహానేత తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద పల్లె కన్నీరు పెట్టింది. తెలుగుదేశం కబంధహస్తాలలో చిక్కుకున్న పల్లెకు విముక్తి కలిగించాలని అక్కడి ప్రజలు జననేతను వేడుకున్నారు. అక్రమ క్వారీ తవ్వకాలు, పేదల భూముల్లో పైపులైన్లు, పేదల భూములు దోచుకుని ఇతరులకు విక్రయాలు, ఆన్‌లైన్‌లో పేర్ల మార్పిడి.. ఇలా ఒకటేమిటి ఇక్కడ అధికార పక్షం ప్రజలను ఏవిధంగా మోసం చేస్తుందో కళ్లకు కట్టినట్టు వివరించారు. తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వారి సమస్యలు ఓపికగా విన్న జననేత అందరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.– ప్రజా సంకల్పయాత్ర ప్రత్యేక బృందం

వికలాంగుడినైనా వెయ్యి రూపాయలే..
నాది పెందుర్తి మండలం నందవానిపాలెం. నేను వికలాంగుడిని. రూ. వెయ్యి మాత్రమే పింఛన్‌ వస్తోంది. కార్యదర్శిని అడిగితే అంగ వైకల్యం శాతం తక్కువగా ఉందని ఇవ్వలేదు. నా చేతులతో ఏ పని చేయలేని దుస్థితిలో ఉన్నాను. చాలా ఇబ్బందులు పడుతున్నాను. జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఈ విషయాన్ని విన్నవించుకున్నాను. న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.  – సాలపు అప్పారావు

నా కుమార్తెకు పింఛన్‌మంజూరు చేయడం లేదు
మాది పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం. నా కుమార్తె వితంతువు. పింఛన్‌ కోసం దరఖాస్తు చేస్తే గ్రామ కార్యదర్శి, ఎంపీడీవో పట్టించుకోవడం లేదు. కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణీలో అర్జీ పెట్టినా ఫలితం లేకపోయింది. ఈ విషయాన్ని జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి విన్నవించాను. త్వరలో మన ప్రభుత్వం వస్తుందని, అందరికీ న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు.                       – ఆర్‌.గంగాభవానీ

క్వారీ పేరిట రెండెకరాలుఆక్రమించారు
నాది సబ్బవరం మండలం అమృతపురం. 30 ఏళ్లుగా నాలుగు ఎకరాల్లో జీడితోట సాగు చేసుకుంటున్నారు. ఈ భూమి కొండపై ఉంది. ఇక్కడ ప్రభుత్వం క్వారీ తవ్వకాలకు అనుమతి ఇవ్వడంతో సర్పంచ్‌ భర్త, టీడీపీ నాయకులు నా రెండు ఎకరాల జీడితోటను నాశనం చేశారు. నేను రెండేళ్ల కిందట సబ్బవరం డిప్యూటీ తహసీల్దార్‌కు 4సీ రికార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయినా ఫలితం లేదు. నా సమస్యను జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాను.– వడిసెల అప్పారావు

రాజన్న బిడ్డను కలవడానికి వచ్చాను
మాది పెందుర్తి మండలం ఇప్పవానిపాలెం. మహానేత రాజన్న బిడ్డను ప్రజా సంకల్ప యాత్రలో కలిశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు పింఛను సరిపోతుందా అని జగన్‌ బాబు అడిగారు. మన ప్రభుత్వం రాగానే అర్హులందరికీ రూ.2వేలు ఇస్తామని ఆ బాబు చెప్పారు.–గండి దేవుడమ్మ ్ఠ

నా భూమిని వేరొకరి పేర ఆన్‌లైన్‌ చేశారు
నాకు ఆరిపాకలో 20 సెంట్ల భూమి ఉంది. సబ్బవరం రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకుని మళ్ల సన్యాసి అనే వ్యక్తి పేర ఆన్‌లైన్‌ చేశారు. నేను ఆర్డీవోకు అప్పీలు చేసుకుని తరువాత కలెక్టర్‌ అనుమతితో ఆన్‌లైన్‌ చేయించుకున్నాను. ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది ఆన్‌లైన్‌లో డిజిటల్‌ సైన్‌ తీసేశారు. కలెక్టర్, ఆర్డీవోల ద్వారా అన్ని అనుమతులు తెచ్చుకున్నా.. సబ్బవరం రెవెన్యూ అధికారులు నన్ను మానసికంగా వేధిస్తున్నారు. మా కుటుంబానికి న్యాయం చేయండి.–మళ్ల సత్యనారాయణ, ఆరిపాక

రైతులకు రుణమాఫీ ఓ చరిత్ర
వైఎస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలలో రైతు రుణమాఫీ అమోఘమైనది. మాకు సంబంధించి రూ.50 వేల రుణమాఫీ అయింది. గరిష్టంగా రూ.5 లక్షలు మాఫీ అయిన రైతులూ ఉన్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ప్రజాబలం ఉంది. ఆయన రైతులు కష్టాలు తెలుసుకుని మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తారని భావిస్తున్నాను.– గొంప నాగరాజు, ఇప్పవానిపాలెం

Advertisement
Advertisement