ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి వ్యథ | Sakshi
Sakshi News home page

ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి వ్యథ

Published Wed, Aug 29 2018 7:52 AM

People Sharing Their Problems To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

విశాఖపట్నం : ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి వ్యథ. భార్యాభర్తలిద్దరూ అంధులే.. కుమారుడికి పక్షవాతం. సాయం చేయాలని ఆ కుటుంబం వేడుకోలు. వింత వ్యాధితో బాధపడుతున్న ఓ విద్యార్థి. తండ్రి చనిపోయారు. తల్లి మంచానికే పరిమితం. చూసి వారంతా అసహ్యించుకుంటున్నారు. ఆదుకోవాలని అతను విన్నపం. పుట్టుకతోనే ఆమె దివ్యాంగులు. ఇప్పటికీ పింఛన్‌ రాని వ్యథ ఓ బాలికది. ఓఎన్‌జీసీ పైపులైన్‌ వేసినప్పుడు రెండున్నర రెట్లు అదనంగా నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు తక్కువ ఇస్తామంటున్నారని బాధితుల ఆవేదన. ఇలా ఒకటేమిటి.. జననేతకు అడుగడుగునా ప్రజలు తమ కష్టాలు చెప్పుకుని సాంత్వన కోరారు. నేనున్నానంటూ అందరికీ భరోసా ఇస్తూ.. వారి కన్నీళ్లు తుడుస్తూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర కొనసాగిస్తున్నారు.

రాజన్నను చూసినట్లే ఉంది
‘నాయనా నిన్ను చూస్తా ఉంటే రాజన్నను చూసినట్లే ఉంది. నువ్వు సీఎం అయి తీరుతావు. అధికారంలోకి రాగానే టీడీపీ వాళ్లు ఆపేసిన పింఛన్లు అన్నీ మంజూరు చేయాలి.’ అంటూ హరిపాలేనికి చెందిన రామునాయుడు పాదయాత్రలో జననేత జగన్‌ను కోరారు. నాకు వృద్ధాప్య పింఛన్‌ ఇవ్వడం లేదు. మా ఊర్లో చాలా మందిది ఇదే పరిస్థితి. జన్మభూమి కమిటీ వల్లే మాకు పథకాలు అందడం లేదు. నువ్వే సీఎం అయితే, మాలాంటోళ్లందరికీ రూ.2 వేలు పింఛన్‌ తీసుకునే భాగ్యం కలుగుతుంది.– బుద్ధా బలరామునాయుడు, హరిపాలెం

జీవో 27తో తీరని అన్యాయం
మేమంతా వైద్య ఆరోగ్య శాఖలో 16 ఏళ్లుగా కాంట్రాక్ట్‌ పద్ధతిలో హెల్త్‌ అసిస్టెంట్లుగా పని చేస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న హెల్త్‌ అసిస్టెంట్ల పోస్టులను 2002, 2006లో నోటిఫికేషన్‌ విడుదల చేసి, భర్తీ చేశారు. మమ్మల్ని మాత్రం రెగ్యులర్‌ చేయడం లేదు. వైఎస్సార్‌ హయాంలో వేతనాలతో పాటు నెలకు రూ.900 చొప్పున ఎఫ్‌టీఏ ఇచ్చారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాకు ఎఫ్‌టీఏలు రద్దు చేశారు. కొత్తగా జీవో నం.27 తెచ్చి మాకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఈ జీవో కారణంగా హెచ్‌ఆర్‌ఏ, డీఏ కోల్పోతున్నాం. జీవో నెం.27ను రద్దు చేయాలి. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం.– హరిపాలెం పీహెచ్‌సీ కాంట్రాక్ట్‌ హెల్త్‌ అసిస్టెంట్లు

తక్కువ నష్ట పరిహారంఇస్తారటా..
మా గ్రామం మీదుగా ఓఎన్‌జీసీకి చెందిన గ్యాస్‌ పైప్‌లైన్‌ వెళ్తోంది. మా భూముల్లో నుంచి ఆరు అడుగుల లోతున పైప్‌లైన్‌ వేసేందుకు కంపెనీ అధికారులు ముందుగా గ్రామసభ నిర్వహించారు. పైప్‌లైన్‌ వేస్తున్న భూములకు ప్రభుత్వ విలువ ప్రకారం రెండున్నర రెట్లు అదనంగా ఇస్తామన్నారు. ఇప్పుడు కేవలం ప్రభుత్వ విలువలో 10 శాతం మాత్రమే ఇస్తామంటున్నారు. జననేత జగన్‌కు మా సమస్యను వివరించాం.–దొడ్డి వెంకటసూరి అప్పారావు,  చూచుకొండ, మునగపాక మండలం

Advertisement
Advertisement