దగాపడ్డ బతుకులకు..నీవే భరోసా | Sakshi
Sakshi News home page

దగాపడ్డ బతుకులకు..నీవే భరోసా

Published Sun, May 27 2018 8:35 AM

people sharing their sorrows ys jagan praja sankalpa yatra - Sakshi

అన్నా.. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా పింఛన్లు మంజూరు కావడం లేదు.. మా కాలనీలో అన్నీ సమస్యలే పట్టించుకున్న నాథులు లేరు.. టీడీపీ తరఫున వార్డుమెంబర్‌నీ.. నేను అడిగితేనే దిక్కులేదు.. ఇలా ఎందరో.. చంద్రబాబు పాలనలో దగాపడ్డ ప్రజలు.. వారందరికీ ప్రజాసంకల్పయాత్ర పేరిట జిల్లాకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ఆశాదీపమయ్యారు. జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో శనివారం జరిగిన పాదయాత్రలో అనేక మంది జననేతను కలుసుకుని తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. 

ఇంటి స్థలం ఇప్పించన్నా.. 
ఉందుర్తి రామలక్ష్మి
 నాకు ఇంటి స్థలం ఇస్తానని కలెక్టర్‌ గారు ఒక పత్రం కూడా ఇచ్చారు. అయితే ఇంత వరకు స్థలం ఇవ్వలేదన్నా అంటూ కాళ్ల గ్రామానికి చెందిన ఉందుర్తి రామలక్ష్మి అనే మహిళ అదే గ్రామంలో సంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకుని తన బాధ చెప్పారు.  ఇద్దరు పిల్లలతో పూరిగుడిసెలో ఉంటున్నామని, తమరూ ఎలాగైనా న్యాయం చేయాలని కోరారు. 

ఆ పిల్లలకు.. నేనే దిక్కయ్యాను
వడ్డే అమ్మామణి అన్నా జగనన్న నా కొడుకు, కోడలు ఇటీవల మృతిచెందారు. వారికి కలిగిన ఇద్దరు పిల్లలు నా వద్దే పెరుగుతున్నారు. ఆడపిల్ల పెళ్లీడుకు వచ్చింది. నాకా వృద్ధాప్యం వచ్చి పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులపెడుతున్నాయన్నా అంటూ వడ్డే అమ్మామణి అనే మహిళ అదే గ్రామంలో పాదయాత్ర చేస్తోన్న జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకుని తన బాధను చెప్పుకున్నారు. తమకో దారి చూపించాలని విజ్ఞప్తి చేశారు. 

వైఎస్‌ కుటుంబమంటే అభిమానం
అన్న జగనన్న.. మీ కుటుంబమంటే మాకు ఎనలేని ప్రేమ. మీరు వస్తున్నారని తెలిసి నా బిడ్డ కార్తికేయను హాస్టల్‌ నుంచి తీసుకువచ్చానంటూ భీమవరానికి చెందిన కంచెల పద్మావతి అనే మహిళ ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తోన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జక్కవరంలో కలుసుకుని చెప్పారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డితో సెల్ఫీ దిగి ఆనందం వ్యక్తం చేశారు. 

పేరుకే పెద్దలు.. ఊరికి ఉపకారం లేదు 
బండారు విజయలక్ష్మి, చలమలశెట్టి దుర్గ, మోటుపల్లి లక్ష్మి.,కుప్పనపూడి 
మా ఊరిలో అనేక మంది పెద్దలు ఉన్నారు. ఉపకారం మాత్రం ఏమిలేదు. గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో మాత్రం శ్రద్ధ చూపించరు. తాగునీరు బాగోదు. రోడ్లు అధ్వానం. మాకు గ్రామంలో సమస్యలు ఎప్పుడు తీరతాయో అని ఆశగా ఎదురుచూస్తున్నామంటూ కుప్పనపూడి గ్రామానికి చెందిన బండారు విజయలక్ష్మి, చలమలశెట్టి దుర్గ, మోటుపల్లి లక్ష్మి జగన్‌ పాదయాత్రలో తమ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజా సేవకు అంబులెన్స్‌ 
ఆకివీడు గ్రామ వైస్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ హుస్సేన్‌ ఆకివీడు గ్రామ ప్రజలకు అందివ్వనున్న అంబులెన్స్‌ను జగన్‌మోహన్‌ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు. శనివారం జగన్‌ పాదయాత్ర కుప్పనపూడి గ్రామ శివారుకు చేరుకున్న తరువాత అక్కడ ఏర్పాటు చేసిన ఈ అంబులెన్స్‌ను జననేత ప్రారంభించారు. తన తల్లి షేక్‌ మస్తాన్, ఆలీ బీబీ జ్ఞాపకార్థం ఈ అంబులెన్స్‌ను ఆకివీడు గ్రామానికి అందిస్తున్నట్టు హుస్సేన్, ఆయన భార్య రసూల్‌ బీబీ, బంధువులు షేక్‌ రఫీ, షేక్‌ అమిర్‌ తెలిపారు. 

జగన్‌మోహన్‌రెడ్డికి తజ్బీ బహూకరణ 
జగనన్న అధికారంలోకి రావాలని మక్కా నుంచి తీసుకువచ్చిన తజ్బీని ఆకివీడుకు చెందిన మహ్మద్‌ ఉమర్, ఆశిబ్‌జాక్, ఎండి అహ్మద్‌లు కుప్పనపూడి పాదయాత్రలో జగన్‌కు అందజేశారు. రంజాన్‌ పండుగ వెళ్లిన తరువాత మక్కాకు వెళుతున్నామని వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబం అంటే తమకు ఎంతో అభిమానమని మక్కాలో జగన్‌ ముక్యమంత్రి కావాలని ప్రార్ధించుకుంటామని ఉమర్‌ కుటుంబ సభ్యులు తమ అభిమానాన్ని చాటుకున్నారు.  

పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదు 
ఏఎన్‌ఎంలు 
వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్‌ పద్ధతిన సెకండ్‌ ఏఎన్‌ఎంలుగా 2008 నుంచి పనిచేస్తున్నామని కాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సీసలి వద్ద జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి చెప్పారు. రెగ్యులర్‌ ఏఎన్‌ఎంలతో సమానంగా పనిచేస్తున్నా  మా జీతాల్లో  భారీ వ్యత్యాసం వస్తోందని వాపోయారు. కనీసం ప్రసూతి సెలవులు, టీఏ, డీఏ కూడా ఇవ్వడం లేదని వాపోయారు. 24 గంటలూ ఉద్యోగంలో ఉన్నా బయోమెట్రిక్‌ వేయకపోతే జీతాల్లో కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ముఖ్యమంత్రి అయ్యాక మా ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాలని  ఏఎన్‌ఎంలు బీఎస్‌ మాణిక్యం, మరియమ్మ, కృష్ణకుమారి, మహాలక్ష్మి, విజయలక్ష్మి జనేనతకు విజ్ఞప్తి చేశారు. 

ఇంటికి పెద్ద కొడుకై ఆదుకోండి 
మాదాసు అచ్చమ్మ 
సీసలి గ్రామానికి చెందిన మాదాసు అచ్చమ్మ సీసలి వద్ద జగన్‌మోహన్‌రెడ్డిని పాదయాత్రలో కలిసి “నీవే నా పెద్ద బిడ్డవయ్యా’ అంటూ ఆశీర్వదించారు. తనకు ఇద్దరు కుమారులని, నాలుగేళ్ల క్రితం రెండో కుమారుడు ప్రమాదంలో మరణించాడని, దీంతో తన భర్త మానసిక స్థితి కోల్పోయాడని చెప్పారు. పూట తిండికి గతిలేక జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ముఖ్యమంత్రి అయి మాలాంటి అమ్మలకు పెద్ద బిడ్డగా ఆదుకోవాలని జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. 

ఇల్లు లేక అవస్థ 
సంతోషమ్మ 
నా పేరు ఏలూరు సంతోషమ్మ. మాది కాళ్ల గ్రామం. మాకు ఇల్లు లేదు. కూలీ,  నాలీ చేసుకుని జీవిస్తున్నాం. నాకు ముగ్గురు పిల్లలు. కనీసం అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి. పూరింట్లో ఉన్నాం  అంటూ కాళ్ల గ్రామంలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తన బాధ చెప్పుకున్నారు. తమరు సీఎం అయ్యాక ఇల్లు మంజూరు చేయాలని జననేతకు విజ్ఞప్తి చేశారు. 

Advertisement
Advertisement