ఉప్పొంగిపోయింది గోదావరి | Sakshi
Sakshi News home page

ఉప్పొంగిపోయింది గోదావరి

Published Tue, Jul 3 2018 6:55 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

మామూలుగా ఇది గోదావరికి వరదల సీజన్‌. ఈసారి ఇప్పటివరకూ ఆ జీవనదిలో వరద నీరు రాలేదు. కానీ గత నెల 12వ తేదీన ప్రజాసంకల్ప యాత్ర జిల్లాలోకి ప్రవేశించింది మొదలు.. దఫదఫాలుగా ఆ తల్లి ఎదపై జనవరద పరవళ్లు తొక్కుతూనే ఉంది. రాజమహేంద్రవరం రోడ్‌ కం రైల్‌ బ్రిడ్జి, ధవళేశ్వరం సర్‌ ఆర్థర్‌ కాటన్‌ ఆనకట్ట, పి.గన్నవరం డొక్కా సీతమ్మ అక్విడెక్ట్, పాశర్లపూడి వంతెన– ఇలా వారధి ఏదైనా మహాజనప్రవాహం ఉరకలెత్తుతూనే ఉంది. తాజాగా సోమవారం ఎదుర్లంక – యానాం వారధిపై కూడా అదే దృశ్యం ఆవిష్కృతమైంది. గౌతమీ గోదావరి ఇరు తీరాలూ ఏకమైనట్టు పాదయాత్ర ఆద్యంతం జనవాహిని ఉప్పొంగిపోయింది. ముమ్మిడివరం నియోజకవర్గంలో దారి పొడవునా.. పల్లెపల్లెనా.. ‘జై జగన్‌’ నినాదాలతో వేలాదిగా ప్రజలు కదం తొక్కారు. అరాచక రాజ్యాన్ని పారదోలే లక్ష్యంతో.. చీకటి బతుకుల్లో వెన్నెల వెలుగులు నింపాలనే ధ్యేయంతో.. అప్రతిహతంగా అడుగులు వేస్తున్న యాత్రా సారథి.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జేజేలు పలుకుతూ, ఆయన వెంట కదిలారు.

సాక్షి, తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం: తమ సమస్యలు తెలుసుకునేందుకు వస్తున్న పాదయాత్రికుడిపై ప్రజల అభిమానం ఉప్పొంగింది. ఆప్యాయత, ఆతిథ్యానికి మారుపేరైన జిల్లాలో వైఎస్‌ జగన్‌కు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఆయన రాకతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంటోంది. ఆ పాదయాత్రికుడిని చూడాలన్న బలమైన కాంక్ష మండుటెండను సైతం విస్మరించేలా చేసింది. గంటల తరబడి ఎదురుచూస్తూ తమ అభిమాన నేత గ్రామాల్లో అడుగుపెట్టగానే కేరింతలు, జగన్‌ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, పిల్లలు, పసిబిడ్డల తల్లులు, యువత వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు పోటీ పడుతున్నారు. ఆయనతో సెల్ఫీలు దిగి అపురూపంంగా చూసుకుంటున్నారు.

ఆటోగ్రాఫ్‌ తీసుకుని పదిలపరుచుకుంటున్నారు. ముఖ్యంగా పాదయాత్రలో యువత హల్‌చల్‌ చేస్తూ సందడి వాతావరణం సృష్టిస్తోంది. తమ భవిష్యత్తుకు బంగారుబాట వేసే నాయకుడితో అడుగులో అడుగేస్తోంది. యువత చూపిస్తున్న ఆప్యాయతకు ముగ్ధుడవుతున్న వైఎస్‌ జగన్‌ వారి కోరిక మేరకు బృందాలవారీగా సెల్ఫీలు దిగుతున్నారు. మరోవైపు ఆపన్నులు తమ సమస్యలు, కష్టాలపై వినతులు ఇస్తూ గోడు చెప్పుకుంటున్నారు. ఆపన్నుల కష్టాలు వింటూ, తనను కలిసేందుకు వచ్చిన అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలను ఆప్యాయంగా పలకరిస్తూ వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ముందుకెళుతున్నారు.

గోడు వెళ్లబోసుకున్న ఆపన్నులు
పాదయాత్రలో పలువురు తమ సమస్యలు చెప్పుకోగా, మరికొందరు వైఎస్‌ జగన్‌ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు తగిన నిధులు ఇవ్వడంలేదని ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఆ సామాజిక వర్గ నేతలు వైఎస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. ఓఎన్‌జీసీ ఫైర్‌ విభాగంలో పనిచేస్తున్న 36 మందిని తొలగించారని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేలా చూడాలని కార్మికులు వినతిపత్రం ఇచ్చారు. అంబాజీపేట మార్కెట్‌ యార్డులో శిథిల భవనాలను తొలగించి రైతులకు ఉపయోగపడేలా చేయాలని రైతులు విన్నవించారు. మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నామని కాపులపాలెం మహిళలు వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయారు. యానాం–ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న తమకు విద్యుత్‌ సౌకర్యం కల్పించడంలేదని మల్లవరం పంచాయతీకి చెందిన పి.ఆశాజ్యోతి ఫిర్యాదు చేశారు. ఇల్లు లేదని సుంకరపాలేనికి చెందిన పితాని నాగమణి వాపోయింది. వినతులు స్వీకరిస్తూ పరిష్కారంపై భరోసా ఇస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగారు.

పాదయాత్రలో పార్టీ నేతలు
ప్రజా సంకల్పయాత్రలో సోమవారం పార్టీ అమలాపురం, కాకినాడ పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కురసాల కన్నబాబు, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పినిపే విశ్వరూప్, తలశిల రఘురాం, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ అరుణ్‌కుమార్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పొన్నాడ సతీష్‌కుమార్, సీహెచ్‌ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, అనంత ఉదయ్‌భాస్కర్, పర్వత పూర్ణచంద్రప్రసాద్, కొండేటి చిట్టిబాబు, పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి విప్పర్తి వేణుగోపాల్, రాష్ట్ర కార్యదర్శలు భూపతిరాజు సుదర్శనబాబు, పెయ్యల చిట్టిబాబు, పెనుమత్స చిట్టిరాజు, మిండగుదిటిమోహన్, గిరిజాలబాబు, కర్రి పాపారాయుడు, చేనేత విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జాన గణేష్, జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు యనమదల మురళీకృష్ణ, అమలాపురం పార్లమెంటరీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కాశి బాల మునికుమారి, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాల పార్టీ కన్వీనర్లు జగతా పద్మనాభం, నల్లా నరసింహమూర్తి, పిన్నమరాజు వెంకటపతిరాజు, కాదా గోవిందకుమార్, పార్టీ నేతలు కాలే రాజబాబు, బళ్ల వెర్రబ్బాయి, భూపతిరాజు బుల్లిరాజు, ఢిల్లీ నారాయణ, రాయపురెడ్డి జానకిరామయ్య, దున్నా జనార్థనరావు, దంతులూరి రాఘవరాజు, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ నేతలు గుర్రంగౌతమ్, ఆర్‌వీవీఎస్‌ చౌదరి పాల్గొన్నారు. 

కోనసీమలో సమాప్తం
ప్రజా సంకల్పయాత్ర 203వ రోజు ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. సోమవారం ఉదయం ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం కొమరిగిరి శివారులోని రాత్రి బస కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్ర యానాం బ్రిడ్జి మీదుగా తాళ్లరేవు మండలంలోని సుంకరపాలెం, చింతాకులవారిపేట, ఇంజరం, రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం కోలంక గ్రామం వరకు 11.1 కిలోమీటర్ల మేర సాగింది. చింతాకులవారిపేటలో శ్రీశ్రీశ్రీ విరాట్‌ రూప అభయాంజనేయస్వామి 48 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఉదయం కొద్దినిమిషాలు జల్లులతో వాతావరణం చల్లబడినా కొద్దిసేపటికే ఎండ తీవ్ర రూపం దాల్చింది. ప్రజల్లోని అభిమానం భానుడి భగభగలను పటాపంచలు చేసింది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత ప్రారంభమైన వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు ఇంజరం గ్రామంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని మెయిన్‌రోడ్డు జనంతో కిక్కిరిసింది. తనను కలిసిన వారిని పలకరిస్తూ, మిద్దెలు, మేడలపై ఉన్నవారికి అభివాదం చేస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగారు. గ్రామం దాటేందుకు దాదాపు 1:15 గంటల సమయం పట్టింది. సాయంత్రం కాజులూరు మండలం కోలంక వద్ద రామచంద్రపురం నియోజకవర్గంలోకి పాదయాత్ర అడుగిడింది. కోలంకలో రాత్రి బస ప్రాంతానికి 6:15 గంటలకు చేరుకున్న వైఎస్‌ జగన్‌ను పలువురు పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలు కలిశారు.

Advertisement
Advertisement