కంగారెత్తించిన సుడిగాలి | Sakshi
Sakshi News home page

కంగారెత్తించిన సుడిగాలి

Published Thu, Sep 7 2017 4:00 AM

కంగారెత్తించిన సుడిగాలి

- ఆకివీడు ప్రాంతంలో 40 నిమిషాలపాటు భయోత్పాతం.. ఈ ఏడాదిలో రెండోసారి
ఎగిరిపోయిన రేకుల షెడ్లు, తాటాకు గుడిసెలు
రొయ్యల చెరువుల్లోని  మోటారుసెట్లు ధ్వంసం
స్వల్పంగా గాయపడ్డ వృద్ధురాలు
 
సాక్షి, ఆకివీడు: ఆకివీడులోని గాలిబ్‌ చెరువు ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ప్రారంభమైన సుడిగాలి 40 నిమిషాలపాటు పరిసర గ్రామాల ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. ఇక్కడి నుంచి కోళ్లపర్రు వంతెన సమీపంలోని రొయ్యల చెరువులో హోరున శబ్దం చేసుకుంటూ.. చినకాపరం డ్రెయిన్‌ మీదుగా తరటావ మీదుగా వేగంగా దూసుకుపోయింది. కోళ్లపర్రు సమీపంలోని చెరువుల్లో నీటిని సుడులు తిప్పుతూ.. 25 అడుగుల ఎత్తులో వృత్తాకారంలో ఎగజిమ్మింది. ఈ గాలి ఇళ్లపై నుంచి కాకుండా పక్కనుంచి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది.

సుడిగాలి తీవ్రతకు మూడు రేకులషెడ్లతోపాటు తాటాకు గుడిసెలపై ఆకులు, గడ్డి ఎగిరిపోయాయి. నాలుగైదు చెట్లు విరిగిపడ్డాయి. రొయ్యల చెరువుల్లోని ఫ్యాన్లు, మోటారుసెట్లు ధ్వంసమయ్యాయి. మర్రివాడ వెంకట్రావు చెరువు వద్ద సుమారు రూ.2.50 లక్షలు, సుంకర శ్రీనివాస్‌ చెరువు వద్ద సుమారు రూ.2 లక్షలు నష్టం వాటిల్లింది. గుమ్ములూరు రోడ్డు వద్ద షెడ్డుపై రేకులు పది అడుగుల ఎత్తులో ఎగిరిపడ్డాయి. ఈ రేకు అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలిపై పడడంతో ఆమె స్వల్పంగా గాయపడింది.  
 
ఇది రెండోసారి: ఆకివీడులో సుడిగాలి వీయడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది కూడా ఆనాల చెరువు ప్రాంతంలో సుడిగాలి రేగింది. అది అజ్జమూరు గ్రామం వైపు దూసుకువచ్చింది. అక్కడ  భారీ చెట్లను నేల కూల్చింది. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు, పూరిపాకలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ నష్టం వాటిల్లింది. అర్ధరాత్రి సమయంలో జరగడం వల్ల అప్పట్లోనూ ప్రాణనష్టం తప్పింది. 
 
ఉష్ణోగ్రత, పీడనంలో వ్యత్యాసాల వల్లే 
ఉష్ణోగ్రత, పీడనంలో ఏర్పడిన వ్యత్యాసాల వల్లే సుడిగాలులు ఏర్పడతాయి. ఇటీవల రొయ్యల చెరువులు పెరగడం కూడా దీనికి కారణం కావచ్చు. ఆకాశంలో ఏర్పడిన కారుమబ్బులు, తెల్లమబ్బులు వల్ల కూడా ఈ పరిస్థితి ఉంటుంది.  తెల్లమబ్బుల్లో తక్కువ, కారుమబ్బుల్లో ఎక్కువ పీడనం ఉండటం వల్ల వచ్చే వ్యత్యాసానికి సుడిగాలులు రేగుతాయి.   
–పి.ఎ.రామకృష్ణంరాజు, వెట్‌ సెంటర్, ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, భీమవరం
Advertisement
Advertisement