పింఛన్ల కోసం పండుటాకుల పడిగాపులు | Sakshi
Sakshi News home page

పింఛన్ల కోసం పండుటాకుల పడిగాపులు

Published Thu, Apr 16 2015 3:47 AM

people suffering with pentions problems

కంచికచర్ల : ప్రభుత్వం మారితే సకాలంలో అధికారులు సామాజిక పింఛన్లు ఇవ్వరా అంటూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక పోస్టాఫీస్ వద్ద బుధవారం పింఛన్ల కోసం పడిగాపులు పడుతున్నారు.  పట్టణంలో 1732 మంది పింఛనుదారులున్నారు.పోస్టాఫీస్ వద్ద రోజుకు 100 మందికి మాత్రమే అందజేస్తున్నారు. కేవలం ఒకే మిషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఐరిస్ సక్రమంగా పడడం లేదని, ఎక్కువమందికి  పంపిణీ చేయలేకపోతున్నారు. నెలలో 15రోజులు గడిచినా పింఛన్లు పంపిణీ చేయట్లేదని వృద్ధులు ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆధార్ కార్డు నంబర్‌లు లేవని కొన్ని రోజులు, ఐరీస్ పడడం లేదని మరికొన్ని రోజులు, వేలిముద్రలు పడడం లేదని నెల రోజుల వరకు తంతితపాలా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. పింఛను డబ్బులు వస్తాయని రోజూ ఆటోలకు రూ 20 నుంచి రూ. 30ల వరకు ఖర్చు అవుతుందని సకాలంలో భోజనం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు వృద్దులు, వికలాంగులు ఆరోపిస్తున్నారు. మధుమేహ వ్యాధితో బాధపడుతున్నా అధికారులు తమ గోడును పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు.

డబ్బులు పెరిగినా ప్రయోజనం లేదు
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పింఛన్ డబ్బులు పెంచారు కాని ఆధార్‌కార్డు లేదని, మిషన్ సక్రమంగా పనిచేయట్లేదని, ఐరిస్ పడడం లేదని, వేలిముద్రలు సరిగ్గా రావట్లేదని కుంటి సాకులు చెప్పి నెలంతా కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని వృద్ధులు ఆరోపిస్తున్నారు. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో రూ.200 పింఛను డబ్బులిచ్చినా ఐదు రోజుల లోపు ఇచ్చేవారు.  అయితే ప్రస్తుతం పింఛను కోసం రోజుల తరబడి తిరగాల్సి రావడంతో ఆటోలకు, రిక్షాలకు రోజూ రూ20 నుంచి రూ.30 వరకు ఖర్చు అవుతుందని వాపోతున్నారు.

ఆధార్‌కార్డు, రేషన్ కార్డు జిరాక్సుల ఖర్చులతో పాటు, తమతో పాటు వచ్చు వారికి మధ్యాహ్నం టిఫిన్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. పింఛను డబ్బుల్లో రూ.600 నుంచి రూ.800 వరకు ఖర్చు అవుతుందని మిగిలేది ఆ రెండు వందలు మాత్రమేనని అంటున్నారు. అధికారులు సకాలంలో పింఛన్లు మంజూరు చేయాలని పలువురు వితంతువులు, వృద్ధులు, వికలాంగులు కోరుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement