సంకల్ప సిద్ధిరస్తు.. | Sakshi
Sakshi News home page

సంకల్ప సిద్ధిరస్తు..

Published Mon, Nov 6 2017 11:52 AM

people support to praja sankalpa yathra visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రలో అడుగు వేసేందుకు పార్టీ జిల్లా నేతలు కదిలి వెళ్లారు. పార్టీ కో–ఆర్డినేటర్లు.. ముఖ్యనేతలతో పాటు జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు.. అభిమానులు పెద్ద ఎత్తున ఇడుపులపాయకు పయనమయ్యారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం సోమవారం నుంచి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని కాంక్షిస్తూ జిల్లా వ్యాప్తంగా పార్టీలకతీతంగా మద్దతు వెల్లువెత్తుతోంది. దేవాలయాలు.. చర్చిలు.. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మొక్కులు తీర్చుకుంటున్నారు. జిల్లాలో ఏమూలకెళ్లినా సోమవారం నుంచి ప్రారంభం కానున్న ప్రజాసంకల్ప యాత్ర కోసమే చర్చ జరుగుతుంది. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి అధికార టీడీపీలో వణుకు పుడుతోంది. ఆ పార్టీలో కూడా జగన్‌ పాదయాత్రపై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది.

ఆనాడు మహానేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరిట, ఆ తర్వాత ఆయన తనయ షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట నిర్వహించిన సుదీర్ఘ పాదయాత్రలను నెమరు వేసుకుంటున్నారు. వారితో అడుగులో అడుగు వేసిన పలువురు మళ్లీ జగనన్నతో కలిసి నడవాలని ఉవ్విళ్లూరుతున్నారు.
పాదయత్ర విజయవంతం కావాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ ఉత్తర నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ పసుపులేటి ఉషాకిరణ్‌ సీతమ్మధారలోని ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌ ఎదురుగా ఉన్న బాల ఏసు ప్రార్థనా మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
పార్టీ భీమిలి పట్టణ అధ్యక్షుడు అక్కరమాని వెంకటరావు ఆధ్వర్యంలో తగరపువలస జాతీయ రహదారి వద్ద వెంకటేశ్వరస్వామి పాదాల చెంత నుంచి భీమిలి వరకు 6 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.
ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావాలని కోరుతూ యలమంచలి నియోజకవర్గ నాయకుడు ప్రగడ నాగేశ్వరరావు రాంబిల్లిలోని పంచదార్ల పుణ్యక్షేత్రంలో ఉమా ధర్మలింగేశ్వర స్వామి సన్నిధిలో 101 కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేశారు.
జీవీఎంసీ 5వ వార్డు మధురవాడలో వైఎస్సార్‌ సీపీ నాయకులు ర్యాలీ నిర్వహించి, బెబ్బేలమ్మ గుడివద్ద 501 కొబ్బరి కాయలు కొట్టారు. పార్టీ వార్డు అధ్యక్షుడు పోతిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పాదయాత్ర పాత పీఎంపాలెం నుంచి కార్‌షెడ్‌ కూడలి మీదుగా బెబ్బేలమ్మ గుడి వరకు సాగింది.
కె.కోటపాడు మండలం వారాడ గ్రామంలోని వినాయకుని ఆలయంలో పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షుడు గొర్రుపోటు వెంకటరావు, సర్పంచ్‌ లెక్కల నాగవిజయలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు బొడ్డు సీతారామలక్ష్మిల ఆధ్వర్యంలో పూజలు చేశారు.
పార్టీ ఆనందపురం మండల అధ్యక్షుడు బంక సత్యం ఆధ్వర్యంలో పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ర్యాలీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా జగన్‌ పాదయాత్రకు మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీలు..ప్రదర్శనలు జరిగాయి. సిటీ మహేష్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆరిలోవలో జరిగిన కార్తీక వన సమారాధనలో రాష్ట్ర భవిష్యత్‌ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్ప పాద యాత్రకు తమ సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్టు అసోసియేషన్‌ ప్రకటించింది.

ఇడుపులపాయలో జిల్లా నేతలు
పాడేరు, మాడుగుల ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, బూడి ముత్యాలనాయుడులతో పాటు విశాఖ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ, అనకాపల్లి, అరకు పార్లమెంటు నియోజకవర్గాల జిల్లా అధ్యక్షులు తైనాల విజయకుమార్, గుడివాడ అమర్‌నాథ్, పరీక్షిత్‌ రాజు, అనకాపల్లి పార్లమెంటు కో–ఆర్డినేటర్‌ వరుదు కళ్యాణిలతో పాటు నియోజక వర్గాల కో–ఆర్డినేటర్లు వంశీకృష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, అక్కరమాని వెంకటరత్నం, అన్నంరెడ్డి అదీప్‌రాజు, బొడ్డేటి ప్రసాద్, పెట్ల ఉమాశంకర గణేష్, కరణం ధర్మశ్రీ, గొల్ల బాబూరావు, చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ, చెట్టి ఫల్గుణ, సనపల చంద్రమౌళి, సత్తి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు ప్రత్యేక వాహనాల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఇడుపులపాయ పయనమయ్యారు. మరో వైపు పార్టీ నాయకులు రైళ్లు, బస్సులు, సొంత వాహనాల్లో పెద్ద సంఖ్య తరలివెళ్లారు.

Advertisement
Advertisement