అన్నవచ్చాడు... ఆనందం తెచ్చాడు... | Sakshi
Sakshi News home page

అన్నవచ్చాడు... ఆనందం తెచ్చాడు...

Published Thu, Sep 27 2018 8:02 AM

People Support To YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం: తూరుపు దిక్కున ఉదయించిన సూరీడులా జననేత జనం ముందుకు వచ్చారు. ఓవైపు సూరీడు భగభగ మంటున్నా... మండుటెండను లెక్కచేయకుండా జగన్‌ రాకకోసం పల్లెలన్నీ ఎదురు తెన్నులు చూశాయి. ప్రతి పల్లె ఆయన రాకతో పోటెత్తింది. అభిమానం వెల్లివిరిసింది. అప్యాయతానురాగల మధ్య జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 271 రోజైన బుధవారం ఉదయం ప్రారంభించారు. ఓ వైపు మార్తాండుడు మండిపోతున్నాడు. మరోవైపు ఉక్కపోత... మంచి నీరు తాగినా నిమిషాల్లో శ్వేదంలా మారిపోతోంది. అయినా అవేవీ లెక్కచేయక జగన్‌ ముందుకు నడుస్తుంటే ప్రకృతి సైతం ప్రణమిల్లి సాయంత్రం వేళ మలయమారుతాలతో తాకింది.

రంగరాయపురం నుంచి మొదలై...
ఎల్‌కోట మండలం రంగరాయపురం నుంచి జిల్లాలో మూడో రోజు పాదయాత్ర సంతపేట, లక్కవరపుకోట, ఖాసాపేట, కూర్మవరం క్రాస్, తలారి మీదుగా కొట్యాడ వద్దకు చేరుకుంది. అడుగడుగునా జగన్‌కు ప్రజలు నీరాజనాలు పడుతూ, జై జగన్, అన్నా నువ్వే మా కాబోయే సీఎం అంటూ హర్షధ్వానాలు పలుకుతూ పాదయాత్రలో జగన్‌ వెంట నడిచారు.

కుమ్మరి సారి తిప్పి...
రంగరాయపురంలో కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన శిబిరంలో కుమ్మరి సారి తిప్పిన జగన్‌మోహన్‌రెడ్డి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులు, వితంతు మహిళలు అర్హత ఉన్నా పింఛన్లకు నోచుకోవటం లేదని చెప్పుకున్నారు. స్థానిక ఎస్సీ కులస్థులు ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేవని, ఎన్ని సార్లు అర్జీలు పెట్టుకున్నా పట్టించుకునే వారు లేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంతపేటలో మహిళలు అభిమాననేతకు బూడిదగుమ్మడి కాయలతో దిష్టి తీసి అప్యాయంగా స్వాగతం పలికారు. లక్కవరపుకోటలో గుంటూరు జిల్లాకు చెందిన యువకులు ప్రత్యేక హోదా కావాలి... జగన్‌ రావాలి అన్న ప్లకార్డులు ప్రదర్శించగా... స్థానిక మహిళలు కర్పూర హారతులతో ఎదురేగారు. క్రిస్టియన్‌ పాస్టర్లు  జగన్‌మోహన్‌రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థనలు చేశారు.

వేదనలు వింటూ... భరోసా కల్పిస్తూ...
అలా ముందుకు సాగిన జననేతను కలిసిన కల్లుగీత కార్మికులు ç2014 అక్టోబర్‌ నెలలో సంభవించిన హుద్‌హుద్‌ తుఫాన్‌ సమయంలో జరిగిన నష్టానికి పక్క జిల్లా విశాఖలో పరిహారం చెల్లిస్తే తమకు ఇప్పటి వరకు ఎటువంటి పరిహారం ఇవ్వలేదని, వృత్తి చేసుకునేందుకు ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్నామంటూ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయారు. సీపీఎస్‌ రద్దుకు హామీ ఇచ్చిన జననేతకు ఉద్యోగ సంఘాల నాయకులు అబినందనలు తెలిపారు. మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు తమ వేదన వినిపించారు. పాదయాత్రలో తనను చూసేందుకు రోడ్డుపైకి వచ్చి వేచి ఉన్న వికలాంగులను జనహృదయ నేత అప్యాయంగా పలకరించారు.

పల్లెలన్నీ పోటెత్తాయి
లక్కవరపుకోట చేరుకున్న రాజన్నతనయుడిని చూడాలని చంటి బిడ్డలతో అక్కాచెల్లెమ్మలు. తమ మనవడిని అప్యాయంగా పలకరించాలని ఊత కర్రతో అడుగులో అడుగు వేసుకుంటూ అవ్వతాతలు, తమ అభిమాన నాయకుడి ఆటోగ్రాఫ్, సెల్ఫీల కోసం యువత రోడ్లపై వరసకట్టింది. తమ అభిమాన నేతను చూశామన్న ఆనందంతో వారంతా ఎంతగానో మురిసిపోయారు. సామాన్యులు చెప్పుకున్న సమస్యలను జగన్‌మోహన్‌రెడ్డి సావధానంగా విన్నారు. తానున్నానని వారికి భ రోసా కల్పిస్తూ ముందుకు సాగారు. ప్రతి పల్లెలో నూ... మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కళా బృందాల డప్పు మోతలతో పెద్ద సంబరమే జరి గింది. సంతపేట, కొట్యాడ తలారిలో పెద్ద సంఖ్య లో మహిళలు తమ అభిమాన నేతపై పాటలు కూర్చి ఆలపిస్తూ వెంట నడిచారు. పాదయాత్రలో జగన్‌ వెంట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కో ఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ప్రొగ్రామ్స్‌ కమిటీ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, అరకు, విశాఖ పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, తైనాల విజయ్‌కుమార్, విశాఖ పార్లమెంట్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ ఎం.వి.వి.సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శులు నెక్కల నాయుడుబాబు, రొంగలి జగన్నాథం, వేచలపు చినరాముడునాయుడు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు, మామిడి శ్రీకాంత్,  పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, ప్రముఖ సినీ దర్శకులు ఎస్‌.వి.కృష్ణారెడ్డి, నిర్మాత కె.అచ్చిరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు  కె.వి.సూర్యనారాయణరాజు, అంబళ్ల శ్రీరాములునాయుడు,  తదితరులు పాల్గొన్నారు.

జగన్‌ను కలిసినకడప జిల్లా నేతలు
ప్రజాసంకల్పయాత్ర బృందం: ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కడప జిల్లాలోని పెళ్లిమర్రి మండల నేతలు కలిశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఎస్‌.కోట నియోజకవర్గంలోని ఎల్‌.కోట మం డలం ఖాసాపేట వద్ద కడప జిల్లా పెళ్లిమర్రి మండలంలోని ఉలవలపల్లి, గొందిపల్లి, టిజి. పల్లి గ్రామాలకు చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో కలిశారు. ఆయనను కలిసిన వారిలో ఎంపీటీసీ వెంకటశివారెడ్డి, మాజీ సర్పంచ్‌లు ఎ.బ్రహ్మానందరెడ్డి, సి.నాగిరెడ్డి, రామన్నరెడ్డి, రమణారెడ్డి, రామాంజనేయరెడ్డి ఉన్నారు. జగన్‌కు మద్దతుగా తామంతా వచ్చినట్టు తెలిపారు.  

సొమ్మసిల్లిన వృద్ధురాలికి ఆసరా...
ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తన కష్టాన్ని చెప్పుకుందామని వచ్చిన వృద్ధురాలు జన సంద్రాన్ని చూసి తన అభిమాన నేతను గుర్తించలేకపోయింది. కానీ ప్రతిపక్ష నేత జగన్‌ మాత్రం ఆమె స్పృహ తప్పిపోతోందని గ్రహించి సెక్యూరిటీని అలర్ట్‌ చేశారు. ఆమెను వెంటనే పొదివి పట్టుకుని నేలపడకుండా సెక్యూరిటీ సిబ్బంది ఆపారు. వెంటనే నీళ్లను ముఖంపై చల్లి సేదతీరేలా చేసి బంధువులకు అప్పగించారు. వేపాడ మండలం కరకవలసకు చెందిన మానాపురపు రాములమ్మకు పింఛను అందడం లేదు. కరకవలస జంక్షన్‌లోకి పాదయాత్ర వచ్చేసరికి జగన్‌ను కలసి తన గోడు వెళ్లబోసుకుందామనుకుంది. కానీ తీవ్రమయిన ఎండధాటికి ఆమె సొమ్మసిల్లిపోయింది. జననేత గమనించి ఆమెకు సేదతీర్చేలా చేశారు.

Advertisement
Advertisement