Sakshi News home page

రంగులేసి పేరు పెట్టుకున్నారు..

Published Tue, Oct 2 2018 7:30 AM

People Support To YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

విజయనగరం : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు రంగులు పూసి ముఖ్యమంత్రి పేరు, ఫొటో పెట్టుకున్నారే తప్ప ఎటువంటి అభివృద్ధి జరగలేదు. జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని హెల్త్‌ సిబ్బంది, ఏఎన్‌ఎంలు కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఈ. గౌరి, ఎం. విజయమ్మ, పి. కాంతమ్మ, వి. సుగుణ, ఎం. రమేష్‌బాబు, పి. హరినాథ్‌బాబు, ఎస్‌. ప్రసన్నకుమార్, సీహెచ్‌ శ్రీనివాసరావు, తదితరులు మాట్లాడుతూ ఎన్‌జీఓలు, ప్రభుత్వం ఆధ్వర్యంలో గతంలో రూ.70 వేలతో అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు నడిచేవన్నారు. ఇప్పుడు వాటికి ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలుగా మార్చారని తెలిపారు. అవసరమైన మందుల బడ్జెట్‌ లేకపోగా.. ఏఎన్‌ఎం, ఉద్యోగులకు వేతనాలు పెంచలేదని చెప్పారు. కేవలం ముఖ్యమంత్రి ప్రచారానికి, కార్పొరేట్‌ ఏజెన్సీలకు ప్రయోజనాలు కల్పించడానికే బడ్జెట్‌ను రూ.4 లక్షలకు పెంచారని ఆరోపించారు.  ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో ఏడుగురు సిబ్బంది, ఒక వైద్యుడ్ని నియమించాల్సి ఉండగా, ఎక్కడా పూర్తిస్థాయిలో సిబ్బంది లేరని చెప్పారు. జీఓ 27 ప్రకారం వేతనాలు పెంచాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. మీ హయాంలోనైనా మాకు న్యాయం చేయాలని కోరారు.

ముఖ్యమంత్రి అవుతారు..
జగన్‌మోహన్‌రెడ్డి కచ్ఛితంగా ముఖ్యమంత్రి అవుతారు. 2003లో ప్రజాప్రస్థానంలో భాగంగా పాదయాత్ర చేస్తూ జిల్లాకు వచ్చిన రాజశేఖరరెడ్డికి ఖడ్గాన్ని బహూకరించాను. అనంతర కాలంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి రాజశేఖరెడ్డితో ఉన్న ఫొటోను ఇప్పుడు ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డికి బహూకరించాను. ఈయన కూడా తప్పకుండా 2019లో ముఖ్యమంత్రి అవుతారు.
– రాణి హోటల్‌ యజమాని వైవీవీ సత్యనారాయణ (అబ్బులు), విజయనగరం

 పూట గడవడం కష్టంగా ఉంది..
నా భర్త పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు రఘు దివ్యాంగుడు. దీంతో పూట గడవడమే కష్టంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వంలో ఎటువంటి ఆసరా కలగలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే మాలాంటి వారికి న్యాయం జరుగుతుంది.– పి సావిత్రి, వీటీ అగ్రహారం, విజయనగరం.

పంచాయతీలు బలి...
చంద్రబాబు తన స్వార్థ రాజకీయం కోసం పంచాయతీలను బలి చేస్తున్నారని లోకల్‌ గవర్నెన్స్‌ చాంబర్‌ జాతీయ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు అన్నారు. విజయనగరం వై జంక్షన్‌ వద్ద సోమవారం జరిగిన ప్రజాసంకల్ప యాత్రలో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగంలోని 243ఈ ప్రకారం 5 సంవత్సరాల పదవీకాలం పూర్తయిన వెంటనే ఎమ్మెల్యే, ఎంపీల ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారో.. పంచాయతీలకు కూడా వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబునాయుడు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారుల పాలన తీసుకురావడం కోసమే జీఓ 90 విడుదల చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కోసం వైఎస్సార్‌సీపీ సహకరించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. దీనికి జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు.

Advertisement

What’s your opinion

Advertisement