ఉక్కిరి బిక్కిరి | Sakshi
Sakshi News home page

ఉక్కిరి బిక్కిరి

Published Sat, Jun 14 2014 2:29 AM

ఉక్కిరి బిక్కిరి - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అప్రకటిత విద్యుత్ కోతలు.. మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో వారం రోజులుగా 42 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమయంలో విద్యుత్ సరఫరా ఉండకపోవడంతో ప్రజలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు.

 =    ప్రాజెక్టులో తగినంత నీరు లేకపోవడంతో శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోయింది.
 =    మరోవైపు నాణ్యమైన బొగ్గు దొరకకపోవడంతో బొగ్గుతో పనిచేసే థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు.
 =    కృష్ణా జిల్లాలోని ఎన్‌టీటీపీఎస్(నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్)లో సుమారు ఐదు వందల మెగావాట్ల విద్యుత్ తక్కువగా ఉత్పత్తి అవుతోంది. ఇదే పరిస్థితి రామగుండం, కొత్తగూడెం విద్యుత్ కేంద్రాల్లో ఉండగా ముద్దనూరు విద్యుత్ కేంద్రం పూర్తిగా మూతపడింది. విద్యుత్ ఉత్పత్తి తగ్గి వినియోగం పెరగడంతో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ విధిస్తున్నట్టు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఎపీఎస్పీడీసీఎల్) అధికారులు చెబుతున్నారు.
 =    ఒంగోలు నగరంలో కూడా అప్రకటిత విద్యుత్ కోత అమలవుతోంది. నాలుగు రోజులుగా వేళాపాళా లేకుండా సరఫరా నిలిపివేస్తున్నారు. రోజుకు కనీసం నాలుగైదు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. జిల్లా కేంద్రం ఒంగోలులోనూ ఇదే పరిస్థితి ఉండటం గమనార్హం.
 =    జిల్లాలోని మున్సిపాలిటీల్లో కూడా లోడ్ రిలీఫ్ పేరుతో కోతలు విధిస్తున్నారు.
 =    నైరుతీ రుతుపవనాలు వచ్చి వాతావరణం చల్లబడే వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
 =    కర్ణాటక, మహారాష్ట్రల్లో వర్షాలు పడి శ్రీశైలం జలాశయానికి నీరు వ చ్చి జల విద్యుత్ ఉత్పత్తి పెరిగితే అప్పుడు విద్యుత్ కోతలు తగ్గించే అవకాశం ఉంది.
 
జలవిద్యుత్ నిలిచిపోవడం వల్లే : జయకుమార్, ఎస్‌ఈ, ట్రాన్స్‌కో
రాష్ట్ర వ్యాప్తంగా జల విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.  దీనికి తోడు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకావడం విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. జిల్లాకు 390 మిలియన్ యూనిట్లు కావాల్సి ఉండగా 340 మిలియన్ యూనిట్ల వరకే సరఫరా అవుతోంది.  ఉత్పత్తికి మించి వినియోగం పెరగడం వల్ల గ్రిడ్‌కు సాంకేతిక లోపం తలెత్తకుండా ఉండేందుకు అత్యవసరంగా విద్యుత్ లోడ్ రిలీఫ్ ఇవ్వాల్సి వస్తోంది.

 విద్యుత్ కోతలతో ఇబ్బంది : కె.ప్రసాద్, వ్యాపారి, పామూరు
 వేలకు వేలు వెచ్చించి కోత మిషన్, ఫినిషింగ్ యంత్రాలు తెచ్చి పెట్టుకున్నా విద్యుత్ కోతలతో ఉపయోగం లేకుండా పోతోంది. దుకాణంలో ఇద్దరికి జీతాలు ఇవ్వాలి. పగటి వేళ, ముఖ్యంగా పని సమయాల్లో కోతల పేరుతో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నా.  

కంప్యూటర్ సెంటర్ నిర్వహించడం కష్టంగా ఉంది : పశుపులేటి నారాయణ, పామూరు
విద్యుత్ కోతలతో కంప్యూటర్ సెంటర్ నిర్వహించడం కష్టంగా ఉంది. ఇన్వర్టర్ ఉన్నా దాని ప్రభావం కొద్ది గంటలే. కంప్యూటర్ నేర్చుకోవాలన్న విద్యార్థుల ఆశలపై విద్యుత్ కోతలు నీళ్లు చల్లుతున్నాయి. వేల రూపాయల బాడుగలు చెల్లించి నెట్ సెంటర్‌లు నిర్వహించడం నిరుద్యోగ యువతకు కత్తిమీద సాములా మారింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement