ప్రభంజనం | Sakshi
Sakshi News home page

ప్రభంజనం

Published Fri, Nov 10 2017 6:24 AM

peoples in ys jaganmohan reddy prajasankalpayatra - Sakshi

ప్రజా సంకల్పం పాదయాత్రకు జనం పోటెత్తుతున్నారు..భావి తరాల బాగుకోసం కఠోర దీక్షకు నడుం బిగించినఅవిశ్రాంత యోధుడి కర స్పర్శ కోసం కదలి వస్తున్నారు..బాధలు చెప్పుకుని బాసటగా నిలవమని కోరేందుకుబారులు తీరుతున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేదన్నా.. ఎన్నేళ్లుగా పనిచేస్తున్నా కొలువులకుగ్యారెంటీ లేదన్నా.. అని కంట తడిపెట్టిన కర్షకులు,కార్మికులు.. మా భవిష్యత్తుకు భరోసా ఇవ్వన్నా అనివిన్నవించిన విద్యార్థులు.. అందరి కష్టాలు.. కన్నీళ్లుచూసి చలించిన జననేత.. రానున్నది రాజన్నరాజ్యమని.. బంగరు భవితకు అదే పునాది అనిఅభయమిస్తూ ముందుకు సాగుతున్నారు..

పండించే పంటలకు గిట్టుబాటు ధర లేదని.. సాగు చేసేటప్పుడు ఒక ధర ఉండగా పంట చేతికొచ్చాక ధర లేకుండా పోతోందని, బుడ్డశనగ, మినుము, ధనియాల రైతులు వైఎస్‌ జగన్‌తో గోడు వెళ్లబోసుకున్నారు. వై. కోడూరు క్రాస్‌ సమీపంలో ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రతిపక్ష నేత రైతులతో మాట్లాడారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో పాటు పెట్టుబడులు పెరిగి ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు అభయమిచ్చారు.

సాక్షి, కడప: జనం... జనం... ప్రభంజనం... ప్రజాసంకల్పం పాదయాత్ర చేపట్టిన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా నీరాజనం. గ్రామగ్రామాన చీమల పుట్టలా అడుగడుగునా జనం హోరెత్తుతున్నారు. కిలోమీటర్ల మేర బారులు తీరుతున్న జనం మధ్య జగన్‌కు స్థానికులు సమస్యలు చెప్పుకుంటుండగా... వారి కష్టసుఖాలు వింటూ భరోసా ఇస్తూ ముందుకు కదులుతున్నారు. మూడు రోజులు పూర్తి చేసుకుని నాలుగో రోజైన గురువారం చేపట్టిన పాదయాత్రకు తండోపతండాలుగా తరలి వచ్చిన జనం బ్రహ్మరథం పట్టారు. రాజన్న బిడ్డను కనులారా చూసేందుకు 90 ఏళ్ల పండుటాకులు కూడా రోడ్డుపైకి వస్తుండగా... చిన్నారులను ఎత్తుకుని బాలింతలు... నడవలేని దివ్యాంగులు సైతం కర్రల సాయంతో తమ అభిమాన నేతతో కలిసి అడుగులో అడుగు వేస్తుండటం విశేషం. వేలకు వేల జనం అలుపు సొలుపు లేకుండా పాదయాత్రలో కదం తొక్కుతున్నారు. 

జగన్‌ను కలిసిన ఆర్టీపీపీ కార్మికులు
రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో తాము దాదాపు 15 ఏళ్లుగా పని చేస్తున్నా రెగ్యులర్‌ చేయలేదని కాంట్రాక్టు కార్మికులు వైఎస్‌ జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఏపీ జెన్‌కోలో కూడా సుమారు మూడు వేలమంది కార్మికులు ఇలాంటి పరిస్థితుల మధ్యనే కాలం వెల్లదీస్తున్నారని, ప్రభుత్వం వచ్చిన వెంటనే తమను రెగ్యులర్‌ చేయాలని విన్నవించారు. తెలంగాణలో విద్యుత్‌ కార్మికులను రెగ్యులర్‌ చేసి బోర్డు ద్వారా జీతాలు ఇస్తున్నారని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకుడు సాంబశివారెడ్డి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆర్టీపీపీ ఆరో యూనిట్‌కు సంబంధించిన వారిని కూడా రెగ్యులర్‌ చేయాలని యూనియన్‌ నాయకుడు రఘునందన్‌రెడ్డి కోరారు. జూవారి సిమెంట్‌ ఫ్యాక్టరీకి చెందిన డెమొక్రటిక్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు కూడా ఇదే సమస్యపై జగన్‌తో చర్చించారు. వేతన సవరణ ప్రకారం తమకు రూ.18వేలు ఇవ్వాలని, జీఓ నెంబరు 11ను సవరించాలని, అన్ని ప్రైవేటు సంస్థలలో పని చేసే కార్మికుల రిటైర్మెంటు వయస్సును పెంచేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

స్థానికుల సమస్యలు తెలుసుకుంటూ..
ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం 8.45 గంటల ప్రాంతంలో వీరపునాయునిపల్లె మండలంలోని ఉరుటూరు సమీపం నుంచి బయలుదేరి జమ్మలమడుగు నియోజకవర్గంలోని యర్రగుంట్ల మండలం సర్వరాజపేట కొత్తకాలనీ చేరుకున్నారు. అక్కడి నుంచి పెద్దనపాడు, తురకపల్లె క్రాస్, వై కోడూరు క్రాస్‌ మీదుగా వచ్చి యర్రగుంట్ల సమీపంలో ఏర్పాటు చేసిన టెంట్‌లో భోజనం చేశారు. తనను కలిసిన ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఎక్కువగా రేషన్‌కార్డులు, పింఛన్లు, గృహాలు తదితర సమస్యలను జనం జగన్‌ దృష్టికి తెస్తున్నారు.

వైఎస్సార్‌సీపీలో చేరిక
ప్రజాసంకల్పం పాదయాత్రలో టీడీపీ ఎంపీటీసీ లింగాల మహేశ్వరి, మార్తల సాంబశివారెడ్డి వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. సర్వరాజపేటలో 30 కుటుంబాలు జగన్‌ సమక్షంలో పార్టీలో చేరాయి.

Advertisement
Advertisement