ఎగిసిన ధరలు | Sakshi
Sakshi News home page

ఎగిసిన ధరలు

Published Thu, Jan 15 2015 12:24 AM

ఎగిసిన  ధరలు - Sakshi

సరకులన్నీ ప్రియం
భారంగా మారిన  పిండివంటలు
సంక్రాంతినాడూ సామాన్యులు ఉసూరు

 
యలమంచిలికి చెందిన శ్రీను దంపతులు సంక్రాంతి పండుగకు అవసరమైన సరకుల జాబితాను రాసుకుని మార్కెట్‌కు వెళ్లారు. పిండివంటల తయారీకి అవసరమైన సరకులు నూనె, బెల్లం, నువ్వులు సహా ఇతర వస్తువులు కొనుగోలు చేశారు. అటు నుంచి అటే నోములకు కావాల్సిన సరకులను ఖరీదు చేశారు. మార్గమధ్యలో పిండిమరకు వెళ్లి పిండిపట్టించుకుని ఇంటికి చేరారు. ఆయా చోట్ల వారు ఖర్చుచేసిన డబ్బు లెక్కచూసుకుంటే గుండె గుభేలుమంది. ఎందుకంటే రూ.2వేలకు పైగా ఖర్చయింది. గతేడాది రూ.1,400 దాటలేదు. అప్పటికీ, ఇప్పటికీ వస్తువుల కొనుగోలులో తేడా లేకపోయినప్పటికీ ఖర్చుమాత్రం పెరిగింది.
 
యలమంచిలి: సంక్రాంతి అంటే సంబరం.. రోజూ కన్నా కాస్త భిన్నంగా గడుపుతాం.. పండుగకి పిండివంటలతో పాటు ప్రత్యేక వంటకాలు ప్రతి ఇంటిలోనూ ఉంటాయి. ఇవన్నీ ఇళ్లల్లో సంతరించుకోవాలంటే ధరలన్నీ అందుబాటులో ఉండాలి. కాని అవి సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగబాకాయి. వాటిని అందుకోలేక  పండుగను పక్కనపెట్టలేక సామాన్యులు సతమతమవుతున్నారు. ధరల పెరుగుదల ప్రభావం సామాన్యులపై పడటంతో ‘సమ్‌క్రాంతి’ కనిపించడం లేదు. ఈ ఏడాది హుద్‌హుద్ ప్రభావంతో విశాఖజిల్లా అతలాకుతలమైంది. పేద, దిగువమధ్య తరగతి వర్గాలవారు తీవ్రంగా నష్టపోయారు. దీంతో గతంలో మాదిరి ఈ పండుగను జరుపుకునే అవకాశం లేకుండా పోయింది. సంక్రాంతి వస్తున్నదంటే వారం రోజుల ముందు నుంచే ఇళ్లల్లో సందడి మొదలవుతుంది. అల్లుళ్లు, కుమార్తెలు, మనుమళ్లలో ఒకటే సరదా.. మరోవైపు బంధువులు, మిత్రులు, ఆత్మీయుల రాకపోకలతో ఇళ్లన్నీ కళకళలాడుతుంటాయి. పిండివంటల తయారీ, నోములకు సిద్ధమవటం వంటి పనులతో మహిళలు బిజీగా ఉంటారు. మరోవైపు పాఠశాలలకు సెలవులుతో పిల్లల ఆటలు, పతంగుల ఎగిరివేతతో అంతటా సందడి నెలకొంటుంది. సందడిగా జరుపుకునే సంక్రాంతికి ధరాఘాతం పట్టుకుంది.

మార్కెట్‌లో పండుగకు కావాల్సిన వివిధ రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా ఒక్కోకుటుంబపై అదనంగా రూ.500 నుంచి రూ.1,000 వరకు భారం పడుతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. గతేడాది నువ్వుల ధర కిలో రూ.120 నుంచి రూ.150 ఉంటే, ఈ ఏడాది రూ.200 నుంచి రూ.250 వరకు ఎగబాకింది. బెల్లం ధర కూడా రూ.10 అదనంగా పెరిగింది. పామాయిల్ ధర రూ.9 పెరగ్గా, నోము వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ఈ పండుగను అన్ని వర్గాల ప్రజలు పొదుపుగా జరుపుకునే పరిస్థితి నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లావాసులపై పండుగభారం భారీగానే పడుతోంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement