చిరువ్యాపారులకో.. చిరునామా! | Sakshi
Sakshi News home page

చిరువ్యాపారులకో.. చిరునామా!

Published Mon, Oct 27 2014 1:38 AM

చిరువ్యాపారులకో.. చిరునామా!

  •  వీధి విక్రేతలకు గ్రీన్ వెండింగ్ జోన్
  •  హక్కులతో పాటు ఆర్థిక, సామాజిక భద్రత
  •  జిల్లాలో 2వేల మంది వ్యాపారుల గుర్తింపు
  • యలమంచిలి : పట్టణాల్లోని వీథి వ్యాపారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అసంఘటిత రంగంలో వివిధ వర్గాల్లోని వీథి వ్యాపారులను గుర్తించడం.. వారితో సంఘాలు ఏర్పాటు..వాటి సంఘటితంతో సమాఖ్యగా రూపొందించడం... తద్వారా వారికి హక్కులతో పాటు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడం... ఇలా దశల వారీగా పట్టణ వీథి వ్యాపారులు సంక్షేమ పథకాన్ని వర్తింపజేయనున్నారు.
     
    జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలోని వీథి వ్యాపారులను ఆయా పురపాలక సంస్థ పరిధిలోని పేదరిక నిర్మూలన విభాగాలు (మెప్మా) గుర్తించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 2వేల మందిని గుర్తించి సంఘాలుగా ఏర్పాటుచేశారు. యలమంచిలి 230 మంది వీథి వ్యాపారులను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. వీధి విక్రేత కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను నమోదు చేస్తున్నారు. మిగిలిన వ్యాపారులను గుర్తించి సంఘాలు, సమాఖ్యలుగా ఏర్పాటు చేయనున్నట్లు మెప్మా అధికారులు వెల్లడించారు.
     
    వారికి  ఇవీప్రయోజనాలు

    ఒకే రంగంలో ఉన్న పది మంది వీధి వ్యాపారులను గుర్తించి సంఘంగా ఏర్పాటు చేస్తారు. పట్టణ పరిధిలో అన్ని సంఘాలను కలిపి సమాఖ్యగా రూపొందిస్తారు. ఆ సమాఖ్య మున్సిపల్ కమిషనర్ పట్టణ విక్రేతల సంఘం పర్యవేక్షణలో పనిచేస్తుంది. సమాఖ్యలోని వ్యాపారులందరికీ కమిషనర్ గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. వ్యాపారాలు నిర్వహిచేందుకు ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని (హాకర్స్ జోన్) కేటాయిస్తారు. వీరికి పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, ఇతర అధికారుల నుంచి వేధింపులు ఎదురుకాకుండా టౌన్ వెండింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది.
     
    సంఘాల్లోని సభ్యులందరినీ బీమా పరిధిలోకి తీసుకువస్తారు. జనశ్రీ బీమా, స్వావలంబన, జనతా ప్రమాద బీమా పథకాలను అమలు చేస్తారు. ఏ వ్యాపారికైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి నష్టపరిహారం లభిస్తుంది. విక్రేతకు చదువుకునే పిల్లలు ఉంటే వారికి ఆయా బీమా పథకాల ద్వారా ఉపకార వేతనాలు లభిస్తాయి.
     
    సంఘాలుగా ఏర్పడిన సభ్యులు వారు పొదుపుచేసే మొత్తాలను అంతర్గతంగా అప్పు ఇచ్చుకోవచ్చు. ఒక సంఘంలోని పొదుపు మొత్తాన్ని సభ్యుడికి రుణం ఇవ్వొచ్చు. ఆ అప్పును వడ్డీతో సహా నిర్ణీత గడువులోగా చెల్లించేలా సంఘాలు, కమిటీలు స్వీయ పర్యవేక్షణ చేసుకోవాలి. బ్యాంకుల నుంచి లింకేజీ రుణాలు తీసుకుని వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. దీనికి మున్సిపల్ కమిషనర్లు, టౌన్ వెండింగ్ కమిటీలు తోడ్పాటునందిస్తాయి.

    వీధి విక్రేతలు ప్రైవేట్, వడ్డీ వ్యాపారుల గుప్పెట్లో చిక్కి ఉంటే టౌన్ వెండింగ్ కమిటీ వారికి రక్షణగా నిలుస్తుంది. వారికి బ్యాంకుల నుంచి లింకేజీ రుణాలు ఇప్పించి ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల కబంధహస్తాల నుంచి విముక్తి కల్పిస్తారు.

    వ్యాపారం నిర్వహించుకునేందుకు వీలుగా గ్రీన్ వెండింగ్ జోన్‌లో చోటు కల్పించి ఆశీలు వసూలుకు సంబంధించి గుత్తేదారు వేధింపులు లేకుండా చర్యలు తీసుకుంటారు. వ్యాపారాలకు సంబంధించిన అనుమతులు మంజూరు చేసి ఆ మేరకు గుర్తింపు కార్డులు జారీ చేస్తారు.
     
    త్వరలో గుర్తింపు కార్డులు
     త్వరలో జిల్లాలోని వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డుల జారీ చేస్తాం. ఇప్పటికే వీరి వివరాలు సేకరించాం. ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ప్రకారం ఒక్కో వీధి వ్యాపారి రూ.200 చెల్లిస్తే వారి ఫొటోలు, ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తాం. ఈ ప్రక్రియ పూర్తికాగానే సంబంధిత మున్సిపల్ కమిషనర్లు వీరికి ఫొటోతో కూడిన కార్డులు జారీ చేస్తారు. మూడేళ్ల వరకు ఈ కార్డు పని చేస్తుంది. హాకర్స్‌జోన్‌లో వీరు నిర్భయంగా వ్యాపారాలు చేసుకునే వెసులబాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయి. వారికి పోలీసులు, ఇతర అధికారుల నుంచి ఎటువంటి వేధింపులు ఉండవు.                                    
    - పాండురంగారావు, పీడీ, మెప్మా
     

Advertisement
Advertisement