బాహాబాహీ | Sakshi
Sakshi News home page

బాహాబాహీ

Published Wed, Feb 12 2014 3:34 AM

Photos of the Youth Congress walked the controversy continued Tuesday.

యువజన కాంగ్రెస్ పాదయాత్రలో ఫొటోల వివాదం మంగళవారం కూడా కొనసాగింది. మొన్న హెచ్చరికలతో సరిపెట్టుకున్న నాయకులు.. నిన్న బాహాబాహీకి సిద్ధపడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను పంపించి వేయడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. యువజన కాంగ్రెస్ పాదయాత్ర సందర్భంగా కరీంనగర్‌లోని భగత్‌నగర్ చౌరస్తాలో మంగళవారం మధ్యాహ్నం ఈ గొడవ జరిగింది. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, పీసీసీ కార్యదర్శి వై.సునీల్‌రావు టిక్కెట్టు పోరుతో పార్టీ పరువు బజారునపడింది.
 
 కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ :  యువజన కాంగ్రెస్ పాదయాత్రలో ఒక నాయకుడి ఫొటోలు పెట్టడం వివాదానికి కారణమైంది. కరీంనగర్ భగత్‌నగర్ చౌరస్తాలో ఉదయం 10.30 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుందనే సమాచారంతో పీసీసీ కార్యదర్శి వై.సునీల్‌రావు ఆధ్వర్యంలో కార్యకర్తలు అడ్డుకోవడానికి భారీ సంఖ్యలో భగత్‌నగర్ చౌరస్తా వద్దకు చేరుకున్నారు. అప్పటికి పాదయాత్ర రాకపోవడంతో రెండుగంటల పాటు వేచిచూసి, కార్యకర్తలంతా వెళ్లిపోయారు. చివరకు మధ్యాహ్నం 1.30కు పాదయాత్ర భగత్‌నగర్‌కు చే రిందనే సమాచారంతో సునీల్‌రావు మళ్లీ అక్కడకు చేరుకుని రథయాత్రకు అడ్డుపడ్డారు.
 
 కరపత్రాలను లాక్కొని చించివేశారు. తాము కూడా టికెట్ ఆశిస్తున్నామని, ఒక్క చల్మెడ లక్ష్మీనర్సింహారావు కరపత్రాలను ఎలా పంచుతారంటూ యూత్ కాంగ్రెస్ నాయకుడు ఇమ్రాన్‌తో వాదనకు దిగారు. ఎవరికి అమ్ముడుపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కాబట్టే చల్మెడ ఫొటో పెట్టామని, పార్టీ కోసం కరపత్రాలను ఎవరైనా ముద్రించి పంచుకోవచ్చని ఆర్‌టీఏ సభ్యుడు ఎలగందుల మునీందర్ బదులిచ్చారు. దీంతో ‘నువ్వు పార్టీ గురించి నాకు చెప్పేటోడివయ్యావా...’ అంటూ సునీల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 ఇరువురి వాగ్వాదం తీవ్రస్థాయిలో చేరుకోవడంతో, ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపుతప్పే అవకాశం కనిపించడంతో వన్‌టౌన్ సీఐ కరుణాకర్‌రావు ఇరువర్గాలను సముదాయించారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ కార్యాలయంలో తేల్చుకోవాలని, రోడ్లపై గొడవకు దిగొద్దని రెండు వర్గాల నాయకులను పంపించివేశారు. గొడవ సమాచారంతో యువజన కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు వి.అంజన్‌కుమార్, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు ఆమ ఆనంద్, రెడ్డవేని వినోద్ తదితరులు ఇమ్రాన్‌కు మద్దతుగా అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇదే సమయంలో అంజన్‌కుమార్‌ను దుర్భాషలాడారంటూ ఇమ్రాన్ మరో వర్గంవైపు దూసుకుపోవడంతో పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు. అంజన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేయడంతో, తననెవరూ ఏమీ అనలేదని సునీల్‌రావు సర్ధిచెప్పారు.
 
 అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా : సునీల్‌రావు
 యూత్ కాంగ్రెస్ లక్ష్యానికి వ్యతిరేకంగా వ్యక్తికోసం పాదయాత్ర చేస్తుండడంపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని పీసీసీ కార్యదర్శి వై.సునీల్‌రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ పాదయాత్ర తలపెడితే, ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి కోసం పాదయాత్రను వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
 
 పార్టీకి లోబడే పాదయాత్ర : అంజన్‌కుమార్
 పార్టీ ఆదేశాలకు లోబడే యూత్ కాంగ్రెస్ పాదయాత్ర సాగుతోందని, దీనిని రాజకీయం చేయడం సరికాదని యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు  వి.అంజన్‌కుమార్ అన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కాబట్టే చల్మెడ లక్ష్మీనర్సింహారావు ఫొటో పెట్టారని, ఆయన ముద్రించిన కరపత్రాలను పాదయాత్రలో అందచేస్తున్నారని, ఎవరైనా అలా చేసుకోవచ్చని అన్నారు.
 
 ప్రచారార్భాటం కోసమే : విలాస్‌రెడ్డి
 ప్రచారం కోసమే సునీల్‌రావు పాదయాత్రలో సమస్యలు సృష్టిస్తున్నారని డీసీసీ అధికార ప్రతినిధి గడ్డం విలాస్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రస్థాయి నాయకుడైనప్పటికి గల్లీలీడర్‌లా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. అభ్యంతరాలుంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి తప్ప బహిరంగంగా అడ్డుకోవడం సరికాదన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement