పింఛన్‌దారుల మెడపై సర్వే కత్తి | Sakshi
Sakshi News home page

పింఛన్‌దారుల మెడపై సర్వే కత్తి

Published Fri, Sep 19 2014 3:59 AM

పింఛన్‌దారుల మెడపై సర్వే కత్తి - Sakshi

సాక్షి, చిత్తూరు: గ్రామంలో అర్హులైన వారు ఎందరున్నా ఏ ఐదారుగురికో 75 రూపాయల పింఛన్ వస్తుండేది. అది కూడా నాలుగు, ఐదునెలలకోసారి ఇచ్చేవారు. ఎవరికైనా కొత్త పింఛను ఇవ్వాలంటే తీసుకుంటున్న వారిలో ఒకరు చనిపోవాలి. లేదంటే కొత్త పింఛను రాదు.
 
...ఇది 2004కు ముందు పరిస్థితి.

గ్రామంలో ఎంతమంది అర్హులుంటే అందరికీ పింఛన్లు అందాయి. అది కూడా 200 రూపాయల చొప్పున ఠంచన్‌గా ఒకటో తేదీ జీతంలాగా ఇచ్చేవారు. కొత్త పింఛన్ కావాలంటే మండలానికి పోతే చాలు అర్హత ఉంటే తక్షణమే ఇచ్చేవారు.
 
...ఇది 2004 తర్వాత పరిస్థితి.

 ప్రస్తుతం పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లోఆచరణ సాధ్యం కానీ హామీలను ఇచ్చిన టీడీపీ వాటి అమలు కోసం ఉద్యోగులు, సంక్షేమపథకాల లబ్ధిదారుల కడుపు కొడుతోంది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే  ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేసిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు పింఛన్‌దారులవైపు చూస్తోంది. ప్రస్తుతం జిల్లాలో పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారులు అర్హులా? కాదా అని నిర్ణయించేందుకు ప్రభుత్వం అధికారులు కమిటీలను నియమించారు. అయితే కమిటీలో ప్రభుత్వ అధికారులు కాకుండా రాజకీయనేతలకు చోటు కల్పించారు. తద్వారా టీడీపీ సానుభూతిపరులకు పింఛన్లు దక్కేలా చూసి, తమ దారిలో నడవనివారికి నిర్ధాక్షిణ్యంగా పింఛన్లను తొలగిచేందుకు ‘పచ్చ’పార్టీ నేతలు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించి తనిఖీల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మండల, గ్రామ స్థాయి నేతలకు దిశానిర్దేశం చేసేలా పథకరచన చేశారు.
 
కమిటీలు ఇవే!

గ్రామస్థాయిలో: గ్రామ సర్పంచ్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీటీసీ సభ్యుడు, స్వయంసహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులు ఇద్దరు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు, గ్రామ పంచాయతీ కార్యదర్శి.
 మునిసిపాలిటీల్లో: వార్డు సభ్యుడు అధ్యక్షుడు. ఇద్దరు ఎస్‌హెచ్‌జీ సభ్యులు, ముగ్గురు సామజిక కార్యకర్తలు, ఒక బిల్‌కలెక్టర్.
 
కార్పొరేషన్‌లో: కార్పొరేటర్ అధ్యక్షుడు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఇద్దరు, సామాజిక కార్యకర్తలు ముగ్గురు, బిల్‌కలెక్టర్ ఒకరు.ఈ కమిటీలు ఇచ్చిన నివేదికలను మండలస్థాయి కమిటీ, ఆపై జిల్లా స్థాయి కమిటీ నిర్ణయించి లబ్ధిదారుల తుదిజాబితాను ఖరారు చేస్తారు.
 
ముందస్తు సమాచారం లేకుండానే

ఈ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం, శనివారం తనిఖీ లు నిర్వహించనున్నారు. కమిటీల ఏర్పాటు, తనిఖీ ల తేదీలపై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న వెంటనే తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. గురువారం పత్రికల్లో కథనాలు వచ్చాయి. శుక్ర, శనివారాల్లో సర్వే ఉంది. ఉన్న ఫళంగా సర్వే నిర్వహిస్తే...లబ్ధిదారుల్లో చాలామంది బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి ఉంటారు. వీరంతా కమిటీ ముందు హాజరు కాకపోతే పింఛన్లు తొలగి స్తారు. దీంతో ముందస్తు సమాచారం లేకుండా తనిఖీలు నిర్వహించడాన్ని విశ్లేషకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అలాగే సామాజిక కార్యకర్తల పేరుతో టీడీపీ నేతలు కమిటీలో చోటు దక్కించుకుని కానివారిపై కక్షపూరితంగా వ్యవహరించనున్నారు. పైగా పింఛన్‌దారుడికి తప్పనిసరిగా ఆధార్ ఉండేలా నిబంధన ఉంచారు. ఆధార్ లేకపోయినా, ఆధార్ కార్డులో తప్పులు ఉన్నా అనర్హుని కింద లెక్కగట్టనున్నారు.
 
కొత్త సమస్యకు తెరతీస్తున్న బీపీఎల్


తనిఖీలో బీపీఎల్(బిలో పావర్టీ లైన్)కొత్త సమస్యగా మారనుంది. రేషన్‌కార్డు ఉన్నవారంతా బీపీఎల్ కిందకు వస్తారు. వీరంతా పింఛన్‌కు అర్హులవుతారు. అయితే సరిపోని వారంతా బీపీఎల్ కిందకు రారని టీడీపీ నేతలు వితండవాదం చేసి పింఛన్లు తీసేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మూడు గదుల ఇళ్లు ఉన్నా పింఛన్ ఇవ్వరని ప్రభుత్వం నిర్ణయించడంతో దీనిపై కూడా గందరగోళం నెలకొంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 4.01 లక్షల మంది లబ్ధిదారుల్లో సగం మందిని తొలగించాలనే యోచనతోనే తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement