చెత్త కుప్పలో తుపాకీ | Sakshi
Sakshi News home page

చెత్త కుప్పలో తుపాకీ

Published Mon, Dec 8 2014 1:33 AM

చెత్త కుప్పలో తుపాకీ

ఉలిక్కిపడిన విజయవాడ వాసులు
* చెత్త కుప్పలో దొరికిన రివాల్వర్
* బొమ్మ తుపాకి అంటున్న పోలీసులు
* పోలీసుల వైఖరిపై అనుమానాలు

విజయవాడ సిటీ : నగరంలో మళ్లీ రివాల్వర్ కలకలం రేగింది. ఖరీదైన వ్యక్తులు తిరిగే ప్రాం తంలో రివాల్వర్ దొరకడం పోలీసు వర్గాలను ఉరుకులు పరుగులు పెట్టించగా.. స్థానికులను ఆందోళనకు గురి చేసింది.  రివాల్వర్ స్వాధీనం చేసుకున్న నగర పోలీసు యంత్రాంగం పరిశీలన తర్వాత సిగరెట్ వెలిగించుకునేందుకు ఉపయోగించే బొమ్మ తుపాకీగా నిర్ధారించారు. అయితే దీనిని గోప్యంగా ఉంచడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కమిషనరేట్ ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడమే దీనిని బహిర్గతం చేయకపోవడానికి కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం లబ్బీపేట రెవెన్యూ కాలనీలోని కామినేని వెంకటేశ్వరరావు వీధిలో ఓ వ్యక్తికి చెందిన ఖాళీ స్థలంలో చెత్త తరలిస్తుండగా రివాల్వర్ బయటపడింది. దీంతో చెత్త తరలింపుదారులు ఆందోళనకు గురై విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. టాస్క్‌ఫోర్స్, మాచవరం పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు.
 
నగరవాసుల్లో ఆందోళన
లబ్బీపేటలో రివాల్వర్ లభ్యమైందనే సమాచారం నగరవాసుల్లో ఆందోళన రేకెత్తించింది.  గతంలో చోటు చేసుకున్న ఘటనలే నగరవాసులు ఉలిక్కిపడేందుకు కారణం. ఉంగుటూరు మండలం పెద అవుటపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ట్రిపుల్ మర్డర్, నందిగామలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొగ్గవరపు శ్రీశైలవాసు హత్యల్లో అత్యాధునిక తుపాకులను నిందితులు ఉపయోగించారు. గత కొంతకాలంగా జిల్లాలో పెరిగిపోయిన గన్ కల్చర్ నగరవాసులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే లబ్బీపేటలో రివాల్వర్ దొరకడం తీవ్ర కలకలం సృష్టించింది.
 
రివాల్వర్ దొరికినట్టుగా చెపుతున్న ప్రాంతానికి చేరువలో ఖరీదైన వ్యక్తులు బస చేసే స్టార్ హోటళ్లు ఉన్నాయి. రాష్ట్ర మంత్రులు కూడా తరుచూ ఇక్కడ బస చేస్తున్నారు. రాజధాని ప్రకటన తర్వాత రాయలసీమ, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన పలువురు వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వచ్చి ఇక్కడ బస చేస్తున్నారు. నగరం చుట్టు పక్కల భూములు కొనుగోలు చేసేవారి రాకతో ఇక్కడి ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.

హోటల్ గదులు కూడా వీరి రాకతో ఖాళీ ఉండటం లేదు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాంతంలో రివాల్వర్ దొరికడం పలు అనుమానాలకు ఆస్కారం కలిగించింది. విషయం దావానంలా వ్యాపించడంతో పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు ఆందోళన చెందారు. దొరికిన రివాల్వర్‌ను బొమ్మ తుపాకీగా పోలీసులు చెపుతున్నప్పటికీ ఇక్కడి వారిలో నెలకొన్న సందేహాలు వీడలేదు.
 
గోప్యంగా ఉంచారు..
రివాల్వర్ దొరికిందనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. లబ్బీపేటలో వీరు రివాల్వర్ స్వాధీనం చేసుకున్నట్టు తెలి యగా.. మీడియా ప్రతినిథులు పోలీసులను ఆరా తీశారు. తొలుత.. ‘రివాల్వరా? దొరికిందా?’ అంటూ ఆశ్చర్యం నటించారు. చివరకు మీడియా ప్రతినిథులు గట్టిగా మాచవరం పోలీసులను నిలదీయడంతో.. కొంతసేపు టాస్క్‌ఫోర్స్‌లోనూ, మరికొంత సేసు సీసీఎస్‌లోను ఉందంటూ చెప్పా రు. మరికొంత సమయం తర్వాత దొరికింది సిగరెట్ లైటర్‌గా ఉపయోగించే బొమ్మ తుపాకీ అంటూ సెలవిచ్చారు.

అది కూడా పై అధికారుల పరిశీలనలో ఉందని చెప్పి దాటవేశారు. ఈ హైడ్రామా మూడు నుంచి నాలుగు గంటల పాటు జరిగింది. నిజంగా బొమ్మ తుపాకీ కోసం ఇంతటి గోప్యత పాటించాల్సిన అవసరం లేదు. అది వెంటనే తెలిసి పోతుంది. నిజంగా బొమ్మ తుపాకీ కాబట్టి మీడియా సమక్షంలో ప్రదర్శిస్తే సరిపోయేది. అంతే తప్ప చివరి వరకు కూడా బొమ్మ తుపాకీగా చెపుతూ గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు ఆస్కారం కలిగిస్తోంది.

Advertisement
Advertisement