‘పచ్చ’జెండా మోసినోళ్లపై కక్ష | Sakshi
Sakshi News home page

‘పచ్చ’జెండా మోసినోళ్లపై కక్ష

Published Mon, Aug 11 2014 11:58 PM

‘పచ్చ’జెండా మోసినోళ్లపై కక్ష - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ :రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. పిఠాపురం నియోజకవర్గంలో ఆ పార్టీ రెబెల్‌గా బరిలో దిగి ఘన విజయం సాధించిన ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ తిరిగి ఆ పార్టీ గూటికే చేరిపోయారు. అయితే.. అటు అధిష్టానమూ బాగానే ఉంది, ఇటు తిరిగి పార్టీ పంచకు వచ్చిన వర్మా బాగానే ఉన్నారు.. ‘ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థి కోసం ఒళ్లొంచి కష్టించిన’ తమకే కష్టకాలం వచ్చిపడిందని తెలుగుతమ్ముళ్లు వాపోతున్నారు. నాడు తనకు కాక పార్టీ అభ్యర్థి కోసం పని చేసినందున ఎమ్మెల్యే వర్మ తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఆక్రోశిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్రమంతటా ఉన్న తెలుగుదేశం పార్టీ ఉందా లేక ఎమ్మెల్యే వర్మ మార్కు టీడీపీయే ఉందా అని పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి.  పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తలకు పెద్దపీట వేయాలని అధినేత చంద్రబాబు పార్టీ వేదికలపై గంభీరోపన్యాసాలు ఇస్తున్నారు.
 
 కానీ పిఠాపురం టీడీపీలో ఇందుకు భిన్నమైన  వాతావరణం కనిపిస్తోంది. పిఠాపురంలో ‘రెబెల్’ వర్మకు వ్యతిరేకంగా టీడీపీ అభ్యర్థి పోతుల విశ్వం కోసం పని చేయడమే అక్కడి కార్యకర్తలు, నాయకులు చేసిన తప్పు అన్నట్టు వర్మ, ఆయన అనుచర వర్గం వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్మకు టిక్కెట్టు ఇవ్వనందుకు పలువురు టీడీపీ కార్యాలయం సాక్షిగా బాబు దిష్టిబొమ్మను దహనం చేసి, పార్టీ జెండాలను కూడా తగలబెట్టారు. పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారు.ఈ నిరసన కార్యక్రమాలకు వెన్నంటి నిలిచిన వారే ఇప్పుడు అంతా తామే అన్నట్టు పార్టీలో హవా కొనసాగిస్తున్నారు. పార్టీ కోసం పని చేసి ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేతలు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
 
 ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించిన పిఠాపురం టౌన్ టీడీపీ ప్రెసిడెంట్, కౌన్సిలర్ రెడ్నం భాస్కరరావు, యు.కొత్తపల్లి వైస్ ఎంపీపీ అనిశెట్టి సత్యానందరెడ్డి, గొల్లప్రోలు రూరల్ పార్టీ అధ్యక్షుడు బవిరిశెట్టి రాంబాబులు పార్టీలో పెత్తనం చలాయిస్తుండటంపై నిప్పులు చెరుగుతున్నారు. నాడు అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ అభ్యర్థి విశ్వం కోసం పనిచేసిన నాయకులను శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని వర్మ అనుచరవర్గం బహిరంగంగానే చెబుతోంది. చెప్పడమే కాదు ఆచరణలో చేసి చూపిస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు,  ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుల దృష్టికి తీసుకువెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పెద్దల మాట కూడా పట్టించుకోకుండా వర్మ తన వర్గాన్ని ఎగదోస్తున్నారని వ్యతిరేక వర్గం కారాలు మిరియాలు నూరుతోంది.
 
 అల్లుమల్లుపై అవిశ్వాసానికి రంగం సిద్ధం..
 కాగా పార్టీ కోసం పనిచేసినందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి మొర ఆలకించే వారు లేరని కేడర్ ఆవేదన చెందుతోంది. పోతుల విశ్వంకు వరుసకు సోదరుడైన రాంబాబు అదే రకంగా వర్మ వర్గం నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పిఠాపురం టౌన్‌షిప్‌లో విశ్వం ఎన్నికల క్యాంప్ నిర్వహణకు ఆశ్రయం ఇవ్వడమే ఆయన నేరమైంది. లే అవుట్ పక్కన స్థానికుల కోరిక మేరకు పుంత రోడ్డును ఆధునికీకరించడంతో రాంబాబు ఎన్నికల అనంతరం నోటీసు అందుకోవాల్సి వచ్చింది.
 
 అలాగే జల్లూరు ఎంపీపీ యూపీ స్కూల్ మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ నిర్వాహకురాలు ఎస్.వరలక్ష్మి కుమారుడు టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. అదే ఇప్పుడు వరలక్ష్మి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ పోవడానికి కారణమైందని తెలుగుతమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. విశ్వం కోసం క్రియాశీలకంగా పనిచేసిన పి.రాయవరం సొసైటీ ప్రెసిడెంట్ అల్లుమల్లు విజయకుమార్‌పై వర్మ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని నాయకులు మండిపడుతున్నారు. సొసైటీ ప్రెసిడెంట్‌గా ఆయనపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం చేశారు.
 
 11 మంది సొసైటీ డెరైక్టర్‌లు కాకినాడలో జిల్లా సహకార అధికారికి అవిశ్వాసం తీర్మానం కోసం సోమవారం లేఖ ఇవ్వడం, ఈ నెల 30న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడంతో వివాదం ముదురుతోంది.  ఎమ్మెల్యే హస్తం లేకుండా ఇదంతా జరగదని, ఎన్నికల్లో టీడీపీకి పనిచేసి ఇప్పుడు వేధింపులు ఎదుర్కొంటున్న నాయకులు జిల్లా ముఖ్య నేతలకు ఫిర్యాదు చేశారు. ఇండిపెండెంట్‌గా గెలుపొంది తిరిగి సొంత గూటికి చేరిన వర్మ మరింత హుందాగా వ్యవహరించాల్సింది పోయి కక్ష సాధింపు చర్యలను ప్రోత్సహిస్తే పార్టీకి చేటని పార్టీశ్రేణులు అంటున్నారు. పార్టీ పెద్దలుగా చలామణీ అయ్యే జిల్లా నేతలు ఇప్పటికైనా జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
 

Advertisement
Advertisement