రగులుకున్న రగడ | Sakshi
Sakshi News home page

రగులుకున్న రగడ

Published Fri, Jan 24 2014 1:05 AM

PITHAPURAM  TDP Constituency In charge SVSN Varma ticket again

సాక్షి, కాకినాడ :గత ఎన్నికల్లో ఓటమి పాలైన పిఠాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ఈసారి కూడా టిక్కెట్ తనదేనన్న ధీమాతో ఉన్నారు. నియోజకవర్గంలో మెజార్టీగా ఉన్న కాపు, బీసీ సామాజికవర్గాల నేతలు ఎక్కడ తనకు పోటీకి వస్తారోననే భయంతో వారిని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననివ్వకుండా పక్కన పెడుతున్నారు. పొమ్మనకుండా పొగపెట్టినట్టు ఒక్కొక్కరిగా పార్టీ నుంచి సాగనంపేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కొత్తపల్లి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంగళి సుబ్బారావును పార్టీ నుంచి సాగనంపారు. మరో మాజీ జెడ్పీటీసీ జవ్వాది కృష్ణ మాధవరావుతో పాటు పిఠాపురం మండల టీడీపీ అధ్యక్షుడు అల్లుమల్లు విజయ్‌కుమార్, రాయవరం పీఏసీఎస్ అధ్యక్షుడు మాదేపల్లి శ్రీనివాసరావు, చిత్రాడ సర్పంచ్ సింగంపల్లి బాబూరావులను పార్టీ కార్యకలాపాల్లో పాల్గొననివ్వకుండా పక్కన పెట్టేశారు. 
 
 పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న మాజీ ఎమ్మెల్యే దివంగత వెన్నా నాగేశ్వరరావు తనయుడు జగదీష్‌ను సైతం పక్కన పెట్టేందుకు ప్రయ త్నించడం పట్ల పలువురు కాపు, బీసీ నేతలు వర్మపై గుర్రుగా ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఏకమవుతూ తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. ఆయా సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ద్వితీయ శ్రేణి నేతలంతా వర్మ వ్యవహారశైలిపై అవకాశం చిక్కిన ప్పుడల్లా బాహాటంగానే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఏదేమైనా ఈసారి వర్మకు టిక్కెట్ ఇవ్వకూడదన్న డిమాండ్‌ను బలంగా వినిపిస్తున్నారు. భగ్గుమన్న అసంతృప్తి ఎన్టీఆర్ వర్ధంతి రోజున జల్లూరులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వెళ్లిన వర్మను స్థానిక నాయకులు అడ్డుకున్నారు. ఒక దశలో వర్మ అనుచరులకు, స్థానిక నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, తోపులాటకు దారితీసింది. చివరకు పార్టీని వర్మ నుంచి రక్షించాలంటూ ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించే పరిస్థితి ఏర్పడింది. 
 
 కాగా నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి నుంచి వర్మను తప్పించాలంటూ చిత్రాడలో సర్పంచ్ సింగంపల్లి బాబూరావు నేతృత్వంలో వర్మ దిష్టిబొమ్మతో గురువారం ర్యాలీ నిర్వహించడం పార్టీలో అసంతృప్తి సెగల తీవ్రతకు అద్దం పట్టింది. 216 జాతీయ రహదారిపై ధర్నా చేసి, వర్మ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేయడం ద్వారా ఆయన పట్ల తమలో ఎంత వ్యతిరేకత పేరుకుందో చాటారు. మండల టీడీనీ మాజీ అధ్యక్షుడు అల్లుమల్లు విజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే వెన్నా నాగేశ్వరరావు తనయుడు జగదీష్, పిఠాపురం మాజీ జెడ్పీటీసీ జవ్వాది కృష్ణ మాధవరావు, కొత్తపల్లి మాజీ జెడ్పీటీసీ వెంగళి సుబ్బారావు(పార్టీ బహిష్కృత నేత) తదితరులు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపడమే కాక వర్మ తీరుపై మండిపడ్డారు. ఇన్‌చార్జి పదవి నుంచి వర్మను తప్పించాలంటూ చంద్రబాబుకు  లేఖను సైతం పంపారు. కార్యకర్తల మనోగతం పట్టించుకోకుండా అధినేత ఒంటెత్తు పోకడలతో వర్మనే కొనసాగిస్తే పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామంటూ వీరంతా చెప్పకనే చెబుతున్నారు.
 

Advertisement
Advertisement