ప్రాణాలతో  చెలగాటం | Sakshi
Sakshi News home page

ప్రాణాలతో  చెలగాటం

Published Sun, Mar 18 2018 12:05 PM

Playing games with life - Sakshi

కొవ్వూరు: మనిషి ప్రాణాలు నిలబెట్టే ఔషధ విక్రయ కేంద్రాల నిర్వహణలో నిబంధనలకు పాతరేస్తున్నారు. జిల్లాలో చాలా చోట్ల ఫార్మసిస్టులు లేకుండానే మెడికల్‌ షాపులు నడుపుతున్నారు. అద్దె సర్టిఫికెట్స్‌పై అమ్మకాలు సాగిస్తున్నా పట్టించుకునే నాథుడు లేరు. కొన్ని దుకాణాల్లో అడ్డుఅదుపు లేకుండా కాలం చెల్లిన ఔషధాల విక్రయాలు సాగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. స్టాకు రిజిస్టర్లు లేకుండానే లావాదేవీలు నడుస్తున్నాయి.

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నప్పటికీ ఔషధ తనిఖీ అధికారులకు పట్టడం లేదు. అడపాదడపా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 2,500 వరకు మెడికల్‌ షాపులున్నాయి. 450 హోల్‌సేల్‌ దుకాణాలున్నాయి. 14 బ్లడ్‌బ్యాంక్‌లు, మూడు బ్లడ్‌ స్టోరేజ్‌ కేంద్రాలు, మూడు మందుల తయారీ కంపెనీలు న్నాయి. ఫార్మసిస్టులు లేకపోవడం మూలంగా ఏ మందులో ఏఏ పదార్థాల మిశ్రమం ఏమిటి అనే దానిలో స్పష్టత లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఏ రోగానికి ఏ మందులు వాడతారు. ఏవిధంగా వినియోగించాలన్నదీ తెలియాలంటే ప్రతి మెడికల్‌ షాపుల్లోను ఫార్మసిస్టులు తప్పనిసరిగా ఉండాలి. ఒక ఔషధానికి బదులు మరో ఔషధం ఇస్తే ప్రాణాలకే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఫార్మసిస్టులు లేకుండానే నిత్యం వందల కోట్ల మెడిసిన్స్‌ వ్యాపారం సాగుతోంది.

నెలవారీగా మూమూళ్లు
దుకాణదారుల నుంచి నెలవారీ మామూళ్లు గుంజుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఒక్కో షాపు నుంచి నెలకి రూ.500 చొప్పున ఏడాదికి ఒక్కో షాపు ద్వారా రూ.6 వేలు మామూళ్లు ముట్టజెప్పుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ నాయకులను ఔషధ తనిఖీ అధికారులు మధ్యవర్తులుగా ఉంచుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి మామూళ్లు వసూలు చేస్తున్నట్టు సమాచారం. జిల్లావ్యాప్తంగా 2,500 దుకణాలున్నాయి. వీటి ద్వారా ఈ విధంగా లెక్కలు వేస్తే సుమారు నెలకి రూ.12.50 లక్షల వరకు మామూళ్లు ముడుతున్నట్టు సమాచారం. ఈ సొమ్మును పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు పంచుకుంటారని చెబుతున్నారు.

మొక్కుబడిగా తనిఖీలు
ప్రస్తుతం జిల్లాలో మెడికల్‌ దుకాణాల తనిఖీ అంతా మొక్కుబడి తంతుగానే సాగుతుంది. జిల్లాలో ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌తో పాటు తణుకు, కొవ్వూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం, ఏలూరులో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయాలున్నాయి. వీరిలో ప్రస్తుతం భీమవరం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టు ఖాళీగా ఉంది. ఒక్కో ఇన్‌స్పెక్టర్‌ నెలకి నలభై దుకాణాలు తనిఖీలు, ఐదు శాంపిల్స్‌ సేకరించాల్సి ఉంటుంది. రెండు శాంపిల్స్‌ ప్రభుత్వ పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, కమ్యూనిటీ ఆసుపత్రుల నుంచి మూడు ట్రేడర్స్‌ నుంచి సేకరించాల్సి ఉంటుంది. శాంపిల్స్‌ నివేదికలు అందిన తర్వాత సంబంధిత కంపెనీలు, వ్యక్తులపైన చర్యలు తీసుకుంటారు. చాలా చోట్ల మెడికల్‌ దుకాణాల్లో ఫార్మసిస్టులే ఉండటం లేదు.

వాస్తవంగా వైద్యులు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్‌కి అనుగుణంగా మందులు విక్రయాలు చేయాలి. కొనుగోలుదారులకు బిల్లు ఇవ్వాలి. కొన్ని దుకాణాల్లో నకిలీ మందులు, నాసిరకం మందులు విక్రయాలు సాగిస్తున్నప్పటికీ మొక్కుబడి తంతుగానే తనిఖీ చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకం మందులను, ఫిజీషియన్‌ శాంపిల్స్‌ను చిల్లర విక్రయాల ద్వారా సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం. మందుల షీట్‌పై ముద్రించిన తేదీని వాళ్ల వద్ద ఉంచుకుని రెండో వైపు కత్తిరించి ఇవ్వడం ద్వారా సొమ్ము చేసుకుంటున్నట్టు తెలిసింది. ఇటువంటి సందర్భాలు జిల్లాలో కోకొల్లలు. 

Advertisement
Advertisement