కొండనూ కొల్లగొడుతున్నారు! | Sakshi
Sakshi News home page

కొండనూ కొల్లగొడుతున్నారు!

Published Tue, Mar 8 2016 3:49 AM

కొండనూ కొల్లగొడుతున్నారు!

అనుమతులు లేకుండానే
  అక్కమాంబ కొండపై తవ్వకాలు, బ్లాస్టింగ్‌లు
అక్రమార్కులకుఅధికార పార్టీ నేతల అండ
చర్యలకు వెనకాడుతున్న అధికారులు

 
కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం పరిసరాల్లో ఎకోరియన్ పవన్ విద్యుత్ కంపెనీ ఆధ్వర్యంలో గాలిమరలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను కంపెనీ పలువురికి సబ్‌కాంట్రాక్ట్ ఇచ్చింది. గాలిమరల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను సబ్‌స్టేషన్‌కు అనుసంధానించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన విద్యుత్ టవర్లను ప్రైవేటు భూములలో ఏర్పాటు చేయాలంటే భూ యజమానులకు లక్షలాది రూపాయల పరిహారం చెల్లించాలి. దీంతో కంపెనీ కొండ చుట్టూ, పైన పొరంబోకు స్థలంలో విద్యుత్ టవర్లను ఏర్పాటు చేసి పరిహారం సొమ్మును మిగుల్చుకునేందుకు సిద్ధమైంది. అధికార పార్టీ నేతల అండ కూడా ఉండటంతో ఈ పనులను చకచకా చేసుకుపోతోంది. ఇందుకోసం పెద్ద పెద్ద యంత్రాలతో కొండను తవ్వుతున్నారు. గుంతలు తవ్వి.. బండలు వచ్చిన చోట ట్రాక్టర్ బ్లాస్టింగ్ యంత్రాలతో వాటిని పేల్చుతున్నారు. అనంతపురం ప్రధాన రహదారి పక్కనే ఉన్న అక్కమాంబ కొండలో ఈ విధ్వంసం సాగిపోతోన్నా..
 

ఎవరూ పట్టించుకోవడం లేదు. రెవెన్యూ, మైన్స్‌అండ్ జియాలజీ శాఖల అనుమతులు.. ఏపీ వాల్టా చట్టం లాంటివేవీ అక్రమార్కులకు అడ్డురాలేదు. ఆలయ, కొండ సంరక్షణను చూసుకోవాల్సిన ఆలయ కమిటీ ముడుపులు తీసుకుని కొండనే అమ్మేందుకు సిద్ధపడిందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 చర్యలు చేపట్టని అధికారులు
 ఎలాంటి అనుమతుల్లేకుండా అక్కమాంబ కొండను ధ్వంసం చేస్తున్నా.. అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం వెనకంజ వేస్తోంది. అక్రమార్కులను కట్టడి చేయడానికి తహశీల్దార్ రవీంద్రనాథ్, సీఐ మన్సూరుద్దీన్ రంగంలోకి దిగడంతో అధికార పార్టీ ముఖ్యనేతల నుంచి ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం.

కొండ వద్దకు చేరుకున్న సీఐ... యంత్రాల యజమానులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు గోవిందప్పను మందలించారు. ఇందుకు స్పందించిన కమిటీ అధ్యక్షుడు ఆలయ అభివృద్ధికి రూ.లక్షలు ఇస్తామన్నందునే సహకరించామని సమాధానమిచ్చారు. ఇది జరిగిన కొద్దిసేపటికే పోలీసు అధికారికి అధికార పార్టీ నేతల నుంచి ఫోన్లలో ఒత్తిళ్లు అధిక మయ్యాయి.

మునిసిపాలిటీ అనుమతులున్నాయా?!
కొండలో విద్యుత్ టవర్ల ఏర్పాటు కోసం విధ్వంసానికి పాల్పడుతున్న కాంట్రాక్టర్లకు మున్సిపాలిటీ అనుమతులున్నాయా అనే అనుమానం కలుగుతోంది. మునిసిపల్ చైర్మన్ వైపీ రమేష్ మాత్రం అనుమతులు ఇచ్చామని చెబుతున్నారు.

 రెవెన్యూ అనుమతుల్లేవ్ -రవీంద్రనాథ్,  తహశీల్దార్
అక్కమాంబ కొండలో గాలిమరల కంపెనీ కాంట్రాక్టర్లు పనులు చేపట్టడానికి రెవెన్యూ అనుమతుల్లేవు. చట్ట ప్రకారం కొండ పొరంబోకు ప్రాంతంలో పనులకు రెవెన్యూశాఖ అనుమతులుండాలి. వాటిని తీసుకోకుండా పనులు చేస్తున్నందున నిలిపివేశాం. తిరిగి చేపడితే చర్యలు తప్పవు.

 కాంట్రాక్టర్లపై కేసులు పెడతాం -  రామాంజినేయులు, ఈవో, దేవాదాయ శాఖ
అక్కమాంబ కొండలో ఎలాంటి అనుమతుల్లేకుండా యంత్రాలతో తవ్వకాలు చేస్తున్న కాంట్రాక్టర్లపై కేసులు పెడతాం. ఆలయ అభివృద్ధి బాధ్యత ఆలయ కమిటీకి ఉంటుంది. కొండలో పనులు చేపట్టాలంటే వివిధ శాఖల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.

Advertisement
Advertisement