నేడు ప్రధానితో సీఎం భేటీ | Sakshi
Sakshi News home page

నేడు ప్రధానితో సీఎం భేటీ

Published Fri, Jan 12 2018 1:37 AM

Pm Appointment to Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి/ఢిల్లీ:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎట్టకేలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. శుక్రవారం ఉదయం 10.40 గంటలకు ప్రధానితో సమావేశమయ్యేందుకు ఆయన కార్యాలయం చంద్రబాబుకు సమయం కేటాయించింది. మోదీతో భేటీ కోసం సీఎం ఏడాది నుంచి ఎదురు చూస్తున్నారు. అపాయింట్‌మెంట్‌ కోరినా మోదీ ఇవ్వడం లేదంటూ టీడీపీ నేతలు చాలా రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ ఎంపీలు ప్రధానిని కలినప్పుడు ఈ వ్యవహారాన్ని ప్రస్తావించారు. చంద్రబాబుకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంగీకరించి మోదీ 12వ తేదీన సమయం ఇచ్చారు. కాగా సీఎం చంద్రబాబు గురువారం రాత్రి 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.

గతంలో ప్రయత్నాలన్నీ నిష్ఫలం
చంద్రబాబుతో ముఖాముఖి సమావేశానికి మోదీ దాదాపు ఏడాదిన్నర నుంచి అవకాశం ఇవ్వకపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మోదీని కలిసేందుకు బాబు చేసిన ప్రయత్నాలు ఫలప్రదం కాలేదు. ప్రధానిని కలిసేందుకు బాబు పలుమార్లు యత్నించినాఅవి నిష్ఫలమే అయ్యాయి.దీంతో బాబును కలిసేందుకు మోదీ ఎందుకు ఇష్టపడడం లేదన్న విషయం చర్చనీయాంశంగా మారింది.

చంద్రబాబుపై ఫిర్యాదుల పరంపర
రాజధాని నిర్మాణంసహా రాష్ట్రంలో జరుగుతున్న పలు అవినీతి వ్యవహారాలపై ప్రధాని మోదీకి ఫిర్యాదులందడంతో ఆయన బాబుకు ప్రాధాన్యం ఇవ్వట్లేదనే వాదన వినిపించింది. అమరావతి పేరుతో భారీ కుంభకోణానికి తెరలేపడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇష్టారాజ్యం, రాష్ట్రంలో ఏమీ జరక్కపోయినా ఏదో అద్భుతం చోటుచేసుకుంటోందంటూ అసత్యాలు ప్రచారం చేస్తుండడంపై రాష్ట్ర బీజేపీ నేతలతోపాటు పలువురు మోదీకి నివేదికలు ఇచ్చారు. దీనికితోడు రాజకీయ పరమైన కారణాలు కూడా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.

ఎన్డీఏలో ఉంటూనే మూడో ఫ్రంట్‌ కోసం చంద్రబాబు తెరవెనుక ప్రయత్నాలు చేశారనే ప్రచారం నేపథ్యంలో బాబును మోదీ దూరం పెట్టారని రాజకీయ వర్గాల్లో  చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల సీపీఐ అగ్రనేతలు రాజా, నారాయణలు మోదీని కలిశారు. ఆ తర్వాత వెంటనే టీడీపీ ఎంపీలు బీజేపీ ఎంపీలను వెంటబెట్టుకుని వెళ్లి మోదీ అపాయిం ట్‌మెంట్‌ తమకూ ఇవ్వాలని కోరడంతో ఇచ్చారు. ఆ సమయంలో తమ అధినేత బాబుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని టీడీపీ ఎంపీలు కోరడంతో  ప్రధాని అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది.

నేడు పుణేలో ‘మినీ పోలవరం’ సందర్శన
మహారాష్ట్రలోని పుణేలో సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌(సీడబ్ల్యూపీ ఆర్‌ఎస్‌)లో ఎకరం విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మినీ పోలవరం ప్రాజెక్టును బాబు శుక్రవారం పరిశీలిం చనున్నారు. శుక్రవారం  ప్రధానితో భేటీ ముగిశాక ప్రత్యేక విమానంలో సీఎం పుణేకు చేరుకుంటారు.

Advertisement
Advertisement