మూడేళ్లలో పోలవరం పూర్తి చేయాలి | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో పోలవరం పూర్తి చేయాలి

Published Tue, Jul 15 2014 1:33 AM

మూడేళ్లలో పోలవరం పూర్తి చేయాలి - Sakshi

 జగ్గంపేట : పోలవరం నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున మూడేళ్లలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు బాధ్యత తీసుకోవాలని వైఎస్సార్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. స్థానిక జేవీఆర్ కాంప్లెక్స్‌లో సోమవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో ఆమోదించడం హర్షణీయమన్నారు. సభలో జరిగిన చర్చలో హోం మంత్రి సమర్థంగా వివరణ ఇచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ పున్వర్విభజన బిల్లులో పోలవరం ప్రాజెక్టును ఉంచడం, కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకోవడం ఉభయ రాష్ట్రాలకు మంచిదన్నారు.
 
 దేశంలో నదుల అనుసంధానికి పోలవరం ద్వారా నాంది పలికనట్టవుతుందన్నారు. గోదావరి బేసిన్ నుంచి కృష్ణ బేసిన్‌కు నీరు మళ్లించడం ఇదే మొట్టమొదటిది అవుతుందన్నారు. తెలంగాణ రాజకీయ నాయకులు పబ్బంగడుపుకొనేందుకు, ఉనికి కాపాడుకునేందుకు పోలవరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. హనుమంతరావు లాంటి సీనియర్ నాయకులు పోలవరం డిజైన్ మార్చకపోతే అమలాపురం మునిగిపోతుందని చెబుతున్నారు, అసలు పోలవరం నైసర్గిక స్వరూపాన్ని తెలుకుని ఆయన మాట్లాడాలన్నారు.
 
 పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించవద్దని కోరారు. ఇటీవల జరిగిన బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.250 కోట్ల నిధులు అరకొరగా కేటాయించారన్నారు. తమ పార్టీ అధినాయకుడు జగన్‌మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు నిధులను కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరితే ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో కలిపే ఆర్డినెన్స్ ఆమోదంపై రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ తరఫు సభ్యులను అభినందిస్తున్నామన్నారు.

Advertisement
Advertisement