‘పోలవరం’ సిబ్బందికి జీతాల్లేవ్ | Sakshi
Sakshi News home page

‘పోలవరం’ సిబ్బందికి జీతాల్లేవ్

Published Sun, Jun 29 2014 2:56 AM

‘పోలవరం’ సిబ్బందికి జీతాల్లేవ్ - Sakshi

- ముంపు మండలాల ‘విలీనం’ కష్టాలు
- భూసేకరణ విభాగంలోని 200 మంది
- ఉద్యోగులకు విడుదల కాని జీతాలు

కుకునూరు : ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన పాల్వంచ, భద్రాచలం డివిజన్లలోని పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లో పనిచేస్తున్న రెవెన్యూ శాఖ భూసేకరణ విభాగంలోని ఉద్యోగులకు జూన్ నెల జీతాలు విడుదల కాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 200 మంది ఉద్యోగులు, సిబ్బందికి చెల్లించాల్సిన జీతాలు రూ.8 లక్షలు పెండింగ్‌లో పడ్డాయి. ఈ ఉద్యోగుల జీతాల బిల్లులు ఇంకా ఆన్‌లైన్ కాకపోవడమే ఇందుకు కారణమని ఉన్నతాధికారులు తెలుపుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పాల్వంచ, భద్రాచలం డివిజన్లు కేంద్రాలుగా భూసేకరణ విభాగంలో రాజీవ్‌సాగర్ ఎత్తిపోతల పథకం (దుమ్ముగూడెం) కింద ఒక యూనిట్, ఇందిరాసాగర్ ప్రాజెక్టు (పోలవరం) కింద నాలుగు యూనిట్లు పనిచేస్తున్నాయి.

వీటిలో దుమ్ముగూడెం ప్రాజెక్టు పరిధి ముంపు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లో లేకపోవడంతో ఆ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ఉద్యోగులకు జూన్ నెల జీతాలు ఆన్‌లైన్ కావడంతో వారికి చెల్లించారు. అయితే పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో చేర్చడంలో  భూసేకరణ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆంధ్రాలోకి వచ్చారు. ముంపు మండలాల పరిధిలో ఆ శాఖ కింద నలుగురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల(ఎస్‌డీసీ)తోపాటు 200 మంది రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. జూన్ నెలకు సంబంధించి జీతాల చెల్లింపు నిలిచిపోయింది.

ఆర్డినెన్స్ విడుదలే కారణం :  కేంద్ర ప్రభుత్వం ముంపు మండలాలకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను విడుదల చేయడంతో ఈ సమస్య వచ్చింది. ముంపు మండలాలకు చెందిన సిబ్బందికి జీతాలు ఇంతవరకు ఆన్‌లైన్ చేయలేదు. వారికి సంబంధించి హెడ్‌ఆఫ్ అకౌంట్ సైతం ఆన్‌లైన్‌లో లేకపోవడం గమనార్హం.  ఈ విషయమై గురువారం కుకునూరుకు వచ్చిన ఆర్‌డీఎల్‌ఎస్ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ బీఎస్.నారాయణరెడ్డిని వివరణ కోరగా ముంపు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ విడుదలైనందున ఆ శాఖలు, వారి జీతాలను కూడా తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం సర్కిల్‌కు కలిపారని తెలిపారు.

Advertisement
Advertisement