పోలీస్ ఎలర్ట్..! | Sakshi
Sakshi News home page

పోలీస్ ఎలర్ట్..!

Published Sat, Feb 15 2014 3:03 AM

police alert..!

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్:  ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రాజకీయ పార్టీలు, నేతల భద్రతకు చర్యలు చేపట్టాల్సిందిగా ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ కింది స్థాయి అధికారులను అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేసినట్లు సమాచారం. పార్టీ కార్యాలయాలు, ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద బందోబస్తుపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా గస్తీ ముమ్మరం చేయాలని నిర్ణయించారు. తెలంగాణవాదులు చేసే ఆందోళనలపైనా పోలీసు యంత్రాంగం ఓ కన్నేసింది.
 
 ముందస్తు అనుమతి, సమాచారం లేకుండా ఆందోళనకు దిగేవారిపైనా కఠినంగా వ్యవహరించేలా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర పునర్విభజన బిల్లుపై కొంత అనుమానస్పదంగా వ్యవహరిస్తున్న రాజకీయ పక్షాలను ఆందోళనకారులు లక్ష్యంగా చేసుకునే అవకాశముందని పోలీసులు అంచనా వేస్తున్నారు. బందోబస్తు చర్యలపై ఎస్పీ నాగేంద్రకుమార్ శుక్రవారం ప్రత్యేకంగా అధికారులతో సమీక్షించినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన విషయాన్ని ఎస్పీ నాగేంద్రకుమార్ ధ్రువీకరించారు.
 
 ఆ రెండు పార్టీలపైనే?
 సోమవారం తిరిగి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండటంతో రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వైఖరిపై ఉత్కంఠ నెలకొంది. బిల్లుపై రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న తెలుగుదేశం పార్టీకి తెలంగాణ ప్రాంతంలోనే అత్యధికంగా ఎనిమిది మంది శాసనసభ్యులు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు బిల్లు ఆమోదంలో కీలకంగా మారిన భారతీయ జనతా పార్టీకి ఇద్దరు శాసన సభ్యులు జిల్లా నుంచే ఉన్నారు. రెండు పార్టీల నేతల ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేసి బిల్లు ఆమోదం దిశగా సొంత పార్టీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో వున్నారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీల నేతలపైనే ఒత్తిడి ఉన్నా, బిల్లు ఆమోదం పొందకపోతే కాంగ్రెస్ నేతలు కూడా ఒత్తిడి ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో నేతల నివాసాలు, పార్టీ కార్యాలయాలు, నేతల విగ్రహాలు పరిరక్షణ లక్ష్యంగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement