Sakshi News home page

వసూల్ రాజా వసూల్

Published Tue, Jan 12 2016 1:52 AM

Police and Transport departments dominant hongardulade

పోలీస్, ట్రాన్స్‌పోర్టుశాఖల్లో హోంగార్డులదే హవా
అవినీతికి పాల్పడుతున్నారంటూ
సబ్‌డివిజన్‌లు మార్చిన ఎస్పీ!
అధికారపార్టీ నేతల అండదండలతో మళ్లీ పాత స్టేషన్‌లకే..

 
పోలీసు శాఖలో డీఎస్పీ నుంచి ఎస్‌ఐ వరకూ అధికారులంతా తమకు ఇష్టమైన హోంగార్డును వెంట ఉంచుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇంటిలో సొంత పనులు దగ్గర నుంచి డైలీ వసూళ్ల వరకు వీరి ద్వారానే వ్యవహారం నడుపుతున్నారు. నిబంధనల ప్రకారం వేటుపడితే అధికార పార్టీ నేతల అండదండలు, పోలీసు అధికారుల ఆశీస్సులు ఉన్న హోంగార్డులు మాత్రం గోడకు కొట్టిన బంతిలా మళ్లి గతంలో పని చేసిన పోలీస్‌స్టేషన్‌లకు వచ్చేస్తున్నారు. తమ హవా
  కొనసాగిస్తున్నారు.
 
గుంటూరు : గుంటూరు జిల్లాలో అనేక మంది హోంగార్డులు ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తూ అక్కడి ఎస్సై, సీఐ, చివరకు డీఎస్పీలకు సైతం నెలవారి మామూళ్లు ఇసూలు చేసి ఇస్తూ, వారి ఇళ్లల్లో సొంత పనులు చక్కబెడుతూ  హెడ్‌కానిస్టేబుళ్ల కంటే ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్నారు. దీనిపై దృష్టి సారించిన గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్ నాలుగు నెలల క్రితం అవినీతికి పాల్పడుతున్న హోంగార్డుల జాబితాను రహస్యంగా స్పెషల్ బ్రాంచ్ అధికారుల ద్వారా తెప్పించుకున్నారు. వీరందరినీ వేరే సబ్‌డివిజన్‌లలోని పోలీస్ స్టేషన్‌లకు బదిలీ చేశారు. అరుుతే అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలున్న హోంగార్డులు నెల తిరకుండానే మళ్లి పాత పోలీస్‌స్టేషన్‌లకు వచ్చేశారు.   ఉదాహరణకు జిల్లాలోని నరసరావుపేట -2 పోలీస్ స్టేషన్‌లో సీఐలకు నమ్మిన బంటులా ఇంట, బయట పనులు చేసిపెడుతున్న ఓ హోంగార్డును ఎస్పీ నారాయణ నాయక్ గురజాల సబ్ డివిజన్‌కు బదిలీ చేశారు. అయితే ఆయన ఓ ముఖ్యనేత తనయుడితో పైరవీ చేసి అధికారులపై ఒత్తిడి తెచ్చి తొలుత గుంటూరుకు, అక్కడి నుంచి రొంపిచర్ల పోలీస్ స్టేషన్‌కు, తిరిగి నరసరావుపేట-2టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చేశారు. మళ్లీ అధికారుల పక్కనే తిరుగుతూ దందా కొనసాగిస్తున్నారు.
 
ట్రాన్స్‌పోర్టు శాఖలో..
 జిల్లాకు చెందిన 20 మంది హోంగార్డులను రోడ్డు ట్రాన్స్‌పోర్టు శాఖకు డిప్యూటేషన్‌పై పంపించారు. మామూలుగా ఆరు నెలలకొకసారి డిప్యూటేషన్‌లు మార్చాలనే నిబంధన ఉన్నప్పటికీ పైరవీలు చేసుకుంటూ అక్కడే సాగుతున్నారు. నెలకో బ్రేక్ ఇన్‌స్పెక్టర్ వద్దకు, లేదా చెక్‌పోస్టు డ్యూటీలు చేసుకుంటూ నెలనెలా వేలల్లో సంపాదిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఇలాగే అవినీతికి పాల్పడడమే కాకుండా బ్రేక్ ఇన్‌స్పెక్టర్లను సైతం అవినీతి రొచ్చులోకి లాగుతున్న హోంగార్డుల వ్యవహారాన్ని గమనించిన అక్కడి డీటీసీ హోంగార్డులను మార్చేశారు. గుంటూరు జిల్లాలో అలా జరగాల్సి ఉన్నప్పటికీ మిగతా హోంగార్డులకు హెవీ వెహికల్ లెసైన్సులు లేవనే సాకుతో ఆ 20 మందిని నాలుగేళ్లుగా ఆర్టీఏ పరిధిలో కొనసాగిస్తున్నారు. దీనిపై అధికారులను వివరణకోరగా నరసరావుపేట -2 టౌన్‌లో పనిచేసి గురజాలకు మార్చిన హోంగార్డు తిరిగి అక్కడికి వెళ్లిన విషయం తమకు తెలియదని తెలిపారు. విచారించి మారుస్తామని పేర్కొన్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement