Sakshi News home page

జిల్లాలో పోలీస్‌స్టేషన్లన్నీ ఖాళీ

Published Wed, Jul 8 2015 4:41 AM

జిల్లాలో పోలీస్‌స్టేషన్లన్నీ ఖాళీ - Sakshi

- పుష్కరాలకు తరలనున్న పోలీసు యంత్రాంగం
 - 10న రాజమండ్రిలో రిపోర్ట్ చేయనున్న పోలీసులు
 - స్థానికంగా అరకొర సిబ్బందితో కొంత ఇబ్బందే
నూజివీడు :
గోదావరి పుష్కరాల పుణ్యమా అని జిల్లాలోని పోలీసు స్టేషన్లన్నీ మరో రెండు రోజుల్లో ఖాళీ కానున్నాయి. పుష్కరాలకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను జిల్లాలోని పోలీసు సిబ్బందిని పెద్ద ఎత్తున బందోబస్తు విధులకు నియమించారు. దీంతో పోలీసు అధికారులతో పాటు సిబ్బంది అంతా పుష్కరాల బందోబస్తు విధులకు తరలివెళ్లనున్నారు.

వీరంతా ఈనెల 10వ తేదీనే రాజమండ్రి వెళ్లి  రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత రెండు రోజుల పాటు అక్కడే వారికి పలు అంశాలలో శిక్షణనిస్తారు.  జిల్లా నుంచి  సీఐలు 20 మంది, ఎస్‌ఐలు 60మంది, హెడ్‌కానిస్టేబుల్‌లు, ఏఎస్‌ఐలు కలిపి 200 మంది, కానిస్టేబుళ్లు 650 మంది, మహిళా కానిస్టేబుళ్లు 80మంది, మహిళా హోంగార్డులు 20 మంది, హోంగార్డులు 100 మందిని ఇప్పటికే పుష్కరాల విధులకు నియమిస్తూ  జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో డ్యూటీ పడిన వారంతా ఈ నెల 10వ తేదీన రాజమండ్రిలో రిపోర్ట్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. వీరంతా మరల ఈ నెల 26న తమతమ పోలీస్‌స్టేషన్‌లకు తరలిరానున్నారు. అప్పటి వరకు స్థానిక పోలీసుస్టేషన్లలో అరకొర సిబ్బంది మాత్రమే విధులు నిర్వహించనున్నారు.
 
అప్రమత్తంగా ఉండకపోతే...
ఇంత పెద్ద ఎత్తున పోలీసులు పుష్కరాలకు వెళ్తున్న నేపథ్యంలో పట్టణాల్లో, గ్రామాల్లో నైట్‌బీట్‌లు సమర్థవంతంగా అమలుకాని పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా లేకపోతే దొంగతనాలు జరిగే ప్రమాదముందని,  స్థానికులు పోలీసులకు సహకరించాలని పలువురు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement