మధుసూదన్ హత్య కేసు ఛేదింపు | Sakshi
Sakshi News home page

మధుసూదన్ హత్య కేసు ఛేదింపు

Published Tue, Dec 9 2014 2:08 AM

police busted the case of madhusudhan naik

అనంతపురం క్రైం : రైల్వేగార్డు మధుసూదన్‌నాయక్ హత్య కేసును అనంతపురం టూటౌన్ పోలీసుల ఛేదించారు. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. భార్యను లైంగికంగా వేధిస్తున్నాడనే అనుమానంతో స్నేహితుడే మధుసూదన్‌నాయక్‌ను మట్టుబెట్టాడు. అదృశ్యం కేసుగా నమోదైన ఈ ఘటనను చివరకు పోలీసులు హత్యగా తేల్చారు. వివరాలను సోమవారం డీఎస్పీ మల్లికార్జునవర్మ విలేకరులకు వెల్లడించారు. ఆయన మాటల్లోనే...నాయక్‌నగర్‌కు చెందిన మధుసూదన్‌నాయక్ కడప జిల్లా నందలూరులో రైల్వేగార్డుగా పని చేస్తున్నాడు. వారానికోసారి అనంతపురం వచ్చి వెళ్లేవాడు.

ఇందులో భాగంగా ఈనెల 1న అనంతపురం వచ్చాడు. ఉదయం 10 గంటల సమయంలో బయటికెళ్లినవాడు ఇంటికి తిరిగి రాలేదని, ఆచూకీ తెలపాలని  అతని తమ్ముడు మహేష్‌నాయక్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు ఆదేశాల మేరకు డీఎస్పీ మల్లికార్జున వర్మ పర్యవేక్షణలో టూటౌన్ సీఐ శుభకుమార్, ఎస్‌ఐలు సుబ్బరాయుడు, రవిశంకర్‌రెడ్డి, ఏఎస్‌ఐ ప్రసాద్, కానిస్టేబుళ్లు మనోహర్, నల్లప్ప, ప్రవీణ్, ఆసిఫ్, కేశవులు, జాన్సన్, మధు, రాజశేఖర్ ప్రత్యేకంగా బృందంగా ఏర్పడ్డారు. పక్కా సమాచారం రావడంతో నాయక్‌నగర్‌కు చెందిన ఈ. ధనుంజయను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.

ఆత్మకూరు మండలం ముట్టాలకు చెందిన ధనుంజయ బతుకుదెరువు కోసం 20 ఏళ్ల కిందట అనంతపురం వచ్చాడు. 2005లో కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం గుడిసిగుప్పరాళ్లకు చెందిన అరుణతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాయక్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ధనుంజయ సెల్‌వన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 5వ తరగతి చదివేటప్పటి నుంచి ధనుంజయ, మధుసూదన్‌నాయక్ మిత్రులు. 2012లో మధుసూదన్‌నాయక్ నుంచి రూ. 1.50 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పటి నుంచి మధుసూదన్‌నాయక్ తరచూ ఇంటికి వస్తుండేవాడు. మూన్నెళ్ల నుంచి ధనుంజయ భార్యతో అసభ్యంగా వ్యవహరించి లైంగిక వేధింపులకు గురి చేసేవాడు.

భార్య ద్వారా తెలుసుకున్న ధనుంజయ అతనిని ఎలాగైనా అంతమొందించాలని భావించాడు. వరుసకు బంధువైన ప్రవీణ్‌కుమార్ అలియాస్ ప్రవీణ్‌ను కలుపుకుని హత్యకు కుట్ర రచించాడు. కొంతవడ్డీ డబ్బు చెల్లిస్తామని ఫోన్‌లో సమాచారం అందించారు. దీంతో మధుసూదన్‌నాయక్ ధనుంజయ ఇంటికెళ్లాడు. కాసేపు మాటల్లోకలిపి వెనుకనుంచి ప్రవీణ్‌కుమార్ టువాలుతో ముఖాన్ని అదిమిపట్టాడు. వెంటనే ధనుంజయ తాడుతో మెడకు బిగించాడు. అలాగే దిండుతో ముఖాన్ని గట్టిగా అదిమిపట్టి చంపేశారు. డ్రాయర్ మినహా బట్టలన్నీ ఊడదీశారు. సెల్‌ఫోన్లు, ఐడీకార్డు, ఏటీఎంకార్డులను తీసుకున్నారు.

శవాన్ని ఇంట్లో ఖాళీ యూరియా సంచిలో కట్టి ప్లాస్టిక్‌డ్రమ్ములో వేశారు. డ్రమ్మును ద్విచక్రవాహనంలో ఉంచుకుని బుక్కరాయసముద్రం సమీపంలోని హెచ్‌ఎల్‌సీ కాలువగట్టుపై సుమారు 3 కిలోమీటర్లు దూరం వెళ్లాక డ్రమ్ములో నుంచి శవాన్ని బయటకు తీసి బరువైన బండరాళ్లు వేసి కాలువలోకి వేశారు. తర్వాత మృతుని బట్టలు, ఐడెంటిటీకార్డు, ఏటీఎంకార్డు కాల్చివేసి అక్కడి నుంచి పరారయ్యారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement