మంత్రి సోమిరెడ్డిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

మంత్రి సోమిరెడ్డిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

Published Mon, May 28 2018 8:29 AM

Police Case Filed Against On Minister SomiReddy - Sakshi

సాక్షి, గుంటూరు /అమరావతి/ న్యూఢిల్లీ : శ్రీవారి ఆభరణాలు, పింక్‌ డైమండ్‌ మాయమయ్యాయంటూ టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై విచారణ జరిపించకుండా ఎదురుదాడి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తీరు అనుమానాలకు తావిస్తోందని బ్రాహ్మణ సేవా సమితి ఎగ్జిక్యూటివ్‌ మెంబర్, బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ ఆలూరు కోటేశ్వరరావు అన్నారు. రమణదీక్షితులను బొక్కలో వేసి నాలుగు తగిలించాలంటూ రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బ్రాహ్మణ సమాజాన్ని అవమానించే విధంగా వ్యవహరించిన సోమిరెడ్డిపై కేసు నమోదు చేయాలని గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ ఓ హోదాలో ఉన్న వ్యక్తి ఆరోపణలు చేస్తే.. వాటిపై విచారణ చేయించాల్సిన ప్రభుత్వం మౌనంగా ఉండటంలో ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.  

ఆవేశంలో అన్నాను.. క్షమించండి: సోమిరెడ్డి
రమణ దీక్షితులును బొక్కలో వేసి నాలుగు తగిలిస్తే నిజాలు బయటికి వస్తాయంటూ ఆవేశంలో అన్నానని, అందుకు బేషరతు క్షమాపణ చెబుతున్నానని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. ఆదివారం విజయవాడలోని మహానాడు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఇంట్లో స్వామి నగలు ఉన్నాయని విమర్శిస్తుంటే ఆవేశం వచ్చిందని, అందుకే అలా అన్నానని తెలిపారు. బీజేపీ కుట్ర రాజకీయాలు చేస్తోందని.. భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.  

జైల్లో పెట్టిస్తామనడం దేనికి సంకేతం: జీవీఎల్‌  
టీటీడీలో అక్రమాలను భయటపెట్టిన రమణదీక్షితులును జైల్లో పెట్టిస్తామని మంత్రి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతమని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ట్విటర్‌లో జీవీఎల్‌ స్పందించారు. టీటీడీ బోర్డులో అన్యమతస్తులను నియమించిన సీఎం చంద్రబాబు దక్షిణాదిన కొత్త అసహన సుల్తాన్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సోమిరెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement