ఎమ్మెల్యే ‘ఆమంచి’ మోసం చేశారు | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ‘ఆమంచి’ మోసం చేశారు

Published Sat, Feb 4 2017 12:19 PM

ఎమ్మెల్యే ‘ఆమంచి’ మోసం చేశారు - Sakshi

మంజూరైన బ్యాంకు రుణం ఇవ్వకుండా మోసగించాడన్న బాధితుడు
చీటింగ్, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌


చీరాల: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ తనను మోసగించారని, ఆయనపై చీటింగ్, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాధితుడు వేటపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వేటపాలెం మండలానికి చెందిన బాధితుడు సర్వేపల్లి సుబ్బయ్య వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బాపట్ల పార్లమెంటరీ ఇన్‌చార్జి అమృతపాణి సహకారంతో వేటపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేశాడు.

బాధితుడు విలేకరులతో మాట్లాడుతూ కార్పొషన్‌ ద్వారా బ్యాంకు రుణం కోసం 2014–15లో దరఖాస్తు చేసుకున్నానన్నాడు. వేటపాలెం ఎస్‌బీఐ అధికారులు కిరాణ షాపు కోసం రూ 2 లక్షల రుణాన్ని మంజూరు చేశారన్నారు. సరుకుల కొనుగోలుకు కొటేషన్‌ తీసుకురావాలని బ్యాంకు అధికారులు సూచించగా సాయం చేయమని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను ఆశ్రయించగా ఆయన చీరాలకు చెందిన వ్యాపారి చుండూరి శ్రీనివాసరావు ద్వారా కొటేషన్‌ ఇప్పించారన్నారు. అయితే సదరు చుండూరి శ్రీనివాసరావు తనకు  డబ్బులు కానీ కిరాణా సరుకులు కానీ ఇవ్వకుండా తిప్పుతూ అవహేళనగా మాట్లాడారన్నారు.

పలుమార్లు గట్టిగా ప్రశ్నించగా తన పర్సంటేజిని తీసుకుని మిగిలిన డబ్బును ఎమ్మెల్యేకు ఇచ్చానని చెప్పాడన్నారు. డబ్బులు ఇవ్వాలని ఎమ్మెల్యేను ప్రాధేయపడగా ఆయన అకౌంట్‌ నుంచి రూ.50,000 తన అకౌంట్‌కు బదిలీ చేశారన్నారు. మిగతా డబ్బులు కూడా ఇస్తే కిరాణా వ్యాపారం పెట్టుకుని జీవిస్తామని ఎమ్మెల్యేకు అడగగా కులం పేరుతో బూతులు తిట్టి చంపేస్తానని బెదిరించాడని బాధితుడు వాపోయాడు. ఎమ్మెల్యే నుంచి తనకు రావాల్సిన రూ.1,50,000 ఇప్పించాలని, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, వ్యాపారి చుండూరి శ్రీనివాసరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశాడు. వారి నుంచి తనకు ప్రాణాపాయం ఉందని బాధితుడు సుబ్బయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బలహీన వర్గాల సంఘ రాష్ట్ర కార్యదర్శి గోసాల ఆశీర్వాదం, దళిత, గిరిజన ఫ్రంట్‌ కన్వీనర్‌ పులిపాటì బాబురావు,  తదితరులు సుబ్బయ్యకు మద్దతుగా నిలిచారు.

Advertisement
Advertisement