సంచలన కేసులు.. నీరుగారుస్తున్న పోలీసులు | Sakshi
Sakshi News home page

సంచలన కేసులు.. నీరుగారుస్తున్న పోలీసులు

Published Thu, Aug 27 2015 3:30 AM

సంచలన కేసులు.. నీరుగారుస్తున్న పోలీసులు - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప : కడప నారాయణ కళాశాలలో మనీషా, నందిని అనే ఇద్దరు విద్యార్థినులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోస్టుమార్టమ్ నివేదికలో వీరి మృతికి కారణాలేంటో స్పష్టంగా పేర్కొనలేదు. అరగంట వ్యవధిలో ఇద్దరు ఎలా చనిపోయారు? అందుకు బలమైన కారణాలేమిటి? వీరి మరణాల వెనుక ఎవరి ప్రమేయం ఉంది? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పటికీ ఎలాంటి జవాబులు లేవు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ కేసు దర్యాప్తులోనే ఉంది.

  మైదుకూరు మండలం మిట్టమానుపల్లె దళితవాడకు చెందిన సావిత్రి అనే మహిళ మేనమామ పోలికలతో కుమారుడికి జన్మ ఇచ్చింది. సోదరుడితో వివాహేతర సంబంధం కారణంగానే మేనమామ పోలికలు అంటూ అనుమానించిన భర్త చంద్ర చాలాకాలంగా వేధింపులకు గురిచేశాడు. తుదకు కిరాతకంగా హత్య చేశాడు. స్నేహితులతో కలిసి ఇంట్లోనే మద్యం సేవించిన భర్త కసికొద్ది పొడిచి చంపాడు. ఈ కేసులో కత్తిపై ఉన్న వేలిముద్రల సేకరణకానీ, నేరనిర్ధారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ పాటించలేదని తెలుస్తోంది. హత్యకు ప్రేరేపించిన స్నేహితులపై పోలీసుల దృష్టి అసలు పడలేదు.

  కడప నగరం రైల్వేస్టేషన్ రోడ్డులోని ఓ హోటల్‌లో పెద్ద ఎత్తున జూదం నిర్వహిస్తున్న విషయం నగర పోలీసు యంత్రాంగానికి తెలిసింది. ఊహించని స్థాయిలో ఆ హోటల్‌పై దాడులు నిర్వహించారు. దాదాపు రూ.30 లక్షలు నగదు పట్టుబడినట్లు సమాచారం. జూదం ఆడుతున్నవారిలో పోలీసులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నాగరాజుపేటలో ఓ జూదగృహంపై దాడి చేసి కొందరు జూదరులతోపాటు రూ.8లక్షలు నగదు సీజ్ చేసినట్లు కేసు నమోదు చేశారు.

 ఈ మూడు సంఘటనలను పరిశీలిస్తే పోలీసు వ్యవస్థ పనితీరుపై విశ్వాసం సన్నగిల్లుతోంది. వృత్తిలో నిబద్ధత కొరవడిందని స్పష్టమవుతోంది. నిందితులను రక్షించే దిశగా పోలీసు దర్యాప్తు కొనసాగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో సంచలన సంఘటన జరిగితే పోలీసు యంత్రాంగం చాలెంజ్‌గా తీసుకునేది. కేసును ఛేదించేవరకూ  విశ్రమించేవారు కాదు. ప్రస్తుతం పోలీసు అధికారుల విధి నిర్వహణలో ఆ వైఖరి కనుమరుగైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మిట్టమానుపల్లెలో దళిత మహిళ హత్యకేసులో నిందితులను తప్పించే విధంగానే పోలీసులు వ్యవహరించారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. శాస్త్రీయ పద్ధతులను లెక్కలోకి తీసుకోకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. అక్రమార్కులైతేనేమీ ఆదాయం ఉంటే చెలిమి చేస్తామంటూ నిరూపిస్తున్నారు. అసాంఘిక శక్తులను ప్రోత్సహించడంలో జిల్లాలో చిన్నబాస్‌లు ముందుంటున్నారు. ఈజీమనీ  కోసం పోలీసు ప్రతిష్టను కొంతమంది తాకట్టు పెడుతున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా,  చట్టానికి లోబడి బాధ్యతలు నిర్వర్తించడం అరుదుగా ఉంటోంది. ఆదాయం, ఆపై అధికార పార్టీ మెప్పు దక్కితే చాలన్నట్లుగా ఎక్కువ మంది వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

 అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించడంలో...
 జిల్లాలో క్రికెట్ బెట్టింగ్స్, మట్కా కంపెనీలు మూతపడ్డాయనుకున్న తరుణంలో చాపకింద నీరులా ప్రవేశించాయి. వీటి వెనుక ప్రత్యక్షంగా పరోక్షంగా కొందరు పోలీసు అధికారులు, త్రిబుల్‌స్టార్ బాస్‌ల ఐడీ పార్టీలు ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు విన్పిస్తున్నాయి.  వీటిని కట్టడి చేయాలనే తపన అత్యున్నతాధికారులకు ఉన్నప్పటికీ కింది స్థాయి యంత్రాంగంలో ఆ స్ఫూర్తి కొరవడింది. ఆకస్మిక దాడుల సమాచారం  సైతం అసాంఘికశక్తులకు క్షణాల్లో తెలిసిపోతోంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు అధికంగా నడుస్తుండడమే అందుకు కారణంగా పలువురు చెప్పుకొస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement