అభద్రతలో ఆమె! | Sakshi
Sakshi News home page

అభద్రతలో ఆమె!

Published Thu, Jul 10 2014 1:46 AM

అభద్రతలో ఆమె! - Sakshi

 మనకు స్వాతంత్య్రం ఎప్పుడొచ్చిందని మగవాళ్లను అడిగితే 1947 అని టక్కున చెప్పేస్తారు. అదే ప్రశ్న మహిళలను అడిగితే అదెప్పుడొచ్చింది? అని ఎదురు ప్రశ్నిస్తారేమో!.. ఆడది అర్ధరాత్రి అయినా ధైర్యంగా తిరగగలిగిన నాడు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని గాంధీజీ చెప్పారు. ఇప్పటికీ ఆ పరిస్థితి లేనందున మా వరకూ స్వాతంత్య్రం రానట్లేనని కూడా వివరిస్తారు. నిజమే.. మహిళలపై అకృత్యాలు, వేధింపులు నానాటికీ పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. స్టేషన్లలో నమోదవుతున్న కేసులు, సర్కారు గణాంకాలే దీన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది.
 
 శ్రీకాకుళం క్రైం: ఈవ్ టీజింగ్, వరకట్న హత్యలు, వేధింపులు, లైంగిక దాడులు.. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులకు అంతే లేదు. మహిళల రక్షణకు ఎన్నో చట్టాలు అమల్లో ఉన్నాయి. మహిళా పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నా మగువల మానప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగణంగా పోలీస్ సిబ్బంది, స్టేష న్లు పెరగకపోవడం.. చట్టాలపై విస్తృత ప్రచారం చేసి అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో నేరాలను అదుపు చేయడం అసాధ్యంగా మారుతోంది. ఈ దిశగానే ఆలోచంచిన పోలీస్ శాఖ సిబ్బంది, సౌకర్యాలు పెంచడంతో నేర నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కసరత్తు చేస్తోంది. దీనివల్ల జిల్లాలోనూ మహిళా పోలీస్‌స్టేషన్లు, సిబ్బంది సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
 
 నేరాల నియంత్రణకు కార్యాచరణ
 మహిళలపై జరగుతున్న నేరాల గణాంకాలను చూసి పోలీస్ బాస్‌లు ఉలిక్కిపడ్డారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచిందని ఇటీవల జాతీయ స్థాయిలో ప్రకటించిన గణాంకాలు వెల్లడించాయి. దీంతో కొత్త ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడు ఇటీవల సీనియర్ ఐపీఎస్ అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షంచారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు పటిష్ట రక్షణ కల్పించాలని ఈ సమావేశంలోనే నిర్ణయించారు. దీనికి అనుగుణంగా జిల్లాల్లో ప్రతి సబ్‌డివిజన్‌లో ఒక మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని, ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు, ఒక మహిళా హోంగార్డు ఖచ్చితంగా ఉండేలా చూడాలని కూడా నిర్ణయించారు. జిల్లాస్థాయిలో ఏఎస్పీ అధ్వర్యంలో మహిళల రక్షణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి దీనికి ఆమోదం పొందాలని నిర్ణయించారు.
 
 జిల్లాలో పరిస్థితి ఏమంత భిన్నంగా లేదు
 రాష్ట్రస్థాయి పరిస్థితికి శ్రీకాకుళం జిల్లా పరిస్థితికీ పెద్ద తేడా లేదు. జిల్లాలోనూ మహిళలపై నేరాల సంఖ్య ఏయేటికాయేడు పెరిగి పోతోంది. వాటిలో కొన్ని మాత్రమే పోలీస్‌స్టేషన్ల వరకు వస్తున్నాయి. గత మూడేళ్లలో ఇలా స్టేషన్లకు వచ్చిన కేసుల లెక్కలు చూస్తే ఎవరికైనా ఆందోళన కలగకమానదు. మహిళలపై వేధిం పుల కేసులే తీసుకుంటే.. 2012లో జిల్లావ్యాప్తంగా 289 కేసులు నమోదైతే.. 2013లో ఆ సంఖ్య 328కి పెరిగింది. ఇక ఈ ఏడాది లో మొదటి ఐదు నెలల్లోనే 111 కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పోలీస్ బాస్‌లు తీసుకున్న నిర్ణయాలు అమలైతే జిల్లాకు మరో రెండు మహిళా పోలీసుస్టేషన్లు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం శ్రీకాకుళంలోనే మహిళా పోలీసు స్టేషన్ మాత్రమే ఉంది. దీంతో జిల్లావ్యాప్తంగా జరిగే వరకట్న వేధిం పుల కేసులన్నీ ఇక్కడికే వస్తున్నాయి. ఈ స్టేషన్‌లో ప్రస్తుతం ఉన్న సీఐ, ఎస్సైలు పురుషులే కావడంతో ఇక్కడికి ఫిర్యాదు చేసేందుకు వచ్చే మహిళలకు ఇబ్బందికరంగా ఉంది. అదే మహి ళా సీఐ, ఎస్సైలు ఉంటే మహిళలు తమ కష్టాలను స్వేచ్ఛగా చెప్పగలుగుతారని అంటున్నారు.
 
 మహిళా పోలీసుస్టేషన్లు అవసరమే: ఎస్పీ
 ఇదే విషయమై జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ మాట్లాడుతూ జిల్లాకు అదనంగా రెండు మహిళా పోలీసుస్టేషన్లు అవసరమేనన్నా రు. మహిళల రక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన తరుణంలో అదనపు స్టేషన్లు ఏ ర్పాటు చేయడంతో వాటిలో మహిళా అధికారులు, సిబ్బందిని నియమిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు.  
 

Advertisement
Advertisement