పోలీసు విభజన సా..గుతోంది | Sakshi
Sakshi News home page

పోలీసు విభజన సా..గుతోంది

Published Tue, Jun 7 2016 2:00 AM

పోలీసు విభజన సా..గుతోంది - Sakshi

- ఏపీ పోలీస్ అకాడమీ ఇంకా తెలంగాణలోనే ఉంది
వార్షిక క్రైం నివేదిక వివరాలు వెల్లడించిన డీజీపీ జె.వి.రాముడు

 సాక్షి, విజయవాడ: రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా శాఖలపరంగా రెండు రాష్ట్రాల మధ్య పూర్తి స్థాయిలో విభజన జరగలేదని రాష్ట్ర డీజీపీ జె.వి. రాముడు అన్నారు. 40ఏళ్లపాటు శ్రమించి అభివృద్ధి చేసిన పోలీస్ అకాడమి, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ తదితరాలన్నీ ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని.. వాటిని ఇక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడలోని ఓ హోటల్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర వార్షిక క్రైం నివేదికను వెల్లడిస్తూ శాఖాపరంగా భవిష్యత్ సవాళ్లు.. వివిధ కేసుల్లో సాధించిన పురోగతి.. ఇతరత్రా అంశాలపై ఆయన మాట్లాడారు. శాఖాపరంగా రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు, పంచాయితీలు పరిష్కారం కాగానే శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ పోలీస్ కేంద్రాలు అభివృద్ధి చేస్తామన్నారు. ఏపీఎస్పీ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఇతర టెక్నికల్ వింగ్‌లలో సంఖ్యాపరంగా సిబ్బంది విభజన జరగాల్సి ఉందన్నారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను తాత్కాలికంగా అనంతపురంలో ఏర్పాటు చేశామని చెప్పారు.

 ఈ ఏడాది నిర్వహించే కృష్ణా పుష్కరాలకు 33 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు డీజీపీ రాముడు చెప్పారు. తుని విధ్వంసం ఘటనలో కచ్చితంగా అరెస్టులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. దర్యాప్తు ఇంకా జరుగుతోందని, ఇప్పటికే కొంత మందిని అరెస్టు చేశారని వివరించారు. సోమవారం ఆరుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని, ఇప్పటి వరకు 26 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

Advertisement
Advertisement