బందోబస్తా.. బాబోయ్‌! | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 30 2018 11:12 AM

Police face troubels while on Security duty for CM, Ministers - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో బందోబస్తులు పోలీసుల ప్రాణాలను బలిగొంటున్నాయి. విధి నిర్వహణలో విగతజీవులుగా మారుతున్నా వారిపట్ల సర్కారు అవలంబిస్తున్న తీరుతో పోలీసుల్లో అసహనం పెరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి పర్యటన కోసం రేణిగుంట విమానాశ్రయంలో బందోబస్తుకు వెళ్లిన ఎస్సై వెంకటరమణ గుండెపోటుతో మృతిచెందిన ఘటన యావత్‌ పోలీసు శాఖను ఆవేదనకు గురిచేసింది. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న ఇలాంటి ఘటనలను తలుచుకుని వారు తీవ్ర కలత చెందుతున్నారు.

  • అసెంబ్లీ బందోబస్తు విధుల్లో ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఏఎస్సై కొల్ల మోహన్‌ కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా తీవ్రమైన ఎండల్లో రోడ్డుపైనే విధులు నిర్వర్తించిన మోహన్‌కు బీపీ, షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోవడంవల్లే అస్వస్థతకు గురైనట్టు వైద్యులు నిర్ధారించారు. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు.
  • అలాగే, గతేడాది కర్నూలు జిల్లాలో సీఎం పర్యటన బందోబస్తుకు వెళ్లిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ హంపన్న చేతిలోని ఏకే–47 మిస్‌ఫైర్‌ అయ్యింది. దీంతో తీవ్రగాయాలైన హంపన్నను ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.
  • నెల్లూరులో ఏఎస్పీ శరత్‌బాబు కారు డ్రైవర్‌గా ఉండే కానిస్టేబుల్‌ రమేష్‌బాబు రివాల్వర్‌ కాల్పులతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
  • గతేడాది సెప్టెంబర్‌ 28న కడపలో మంత్రి ఆదినారాయణరెడ్డి గన్‌మెన్‌ చంద్రశేఖర్‌రెడ్డి రివాల్వర్‌ మిస్‌ఫైర్‌ కావడంతో అతనూ మృతిచెందాడు. ఇవే కాదు.. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు మరెన్నో.

బందోబస్తుకు కనీస సౌకర్యాలు కరువు
ఈ నేపథ్యంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలున్న పోలీసులను బందోబస్తు, ట్రాఫిక్‌ విధుల నుంచి తప్పించి తేలికపాటి విధులు అప్పగించాలన్న వారి వేదన ఆరోణ్యరోదనగానే మారింది. అసెంబ్లీ సమావేశాల బందోబస్తుకు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే దాదాపు 900 మంది పోలీసులకు కనీస సౌకర్యాలు, సమయానికి భోజనం, మంచినీళ్లు, విశ్రాంతి కూడా దొరకడంలేదంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయమై  పలుమార్లు ముఖ్యమంత్రి, డీజీపీలను కలిసి తమ సమస్యలు చెప్పినా స్పందనలేదని వారు వాపోతున్నారు. ఆర్పీ ఠాకూర్‌ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన రోజున.. ‘పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తాను, తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్న, 50 ఏళ్లు పైబడిన వారికి బందోబస్తు, ట్రాఫిక్‌ విధుల నుంచి మినహాయిస్తా’నన్న ఆయన మాటలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా వాటిని అమలుచేయాలని పోలీసులు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు.

రోగాల బారిన పోలీసులు
మాజీ డీజీపీ సాంబశివరావు రాష్ట్రంలోని పోలీసులకు మూడు దశల్లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో దాదాపు 950 మంది ప్రాణాంతక రోగాల బారిన పడినట్టు గుర్తించారు. చాలామంది పోలీసుల్లో గుండె, కిడ్నీ సమస్యలు, బీపీ, షుగర్, కండరాల సమస్య, కంటి చూపు మందగించడం, అల్సర్‌ (గ్యాస్ట్రిక్‌) రుగ్మతలు ఉన్నట్టు గుర్తించారు.

ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి
క్షణం విశ్రాంతి లేక.. రాత్రి పగలు విధులు నిర్వర్తిస్తూ సమయానికి ఆహారం అందక.. తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడే తమకు ప్రాణసంకటంగా మారుతోందని పోలీసులు వాపోతున్నారు. వీరికి వీక్లీఆఫ్‌లు కూడా ఉండడంలేదు. బాసిజం కూడా వారిని తీవ్రంగా వేధిస్తోంది. బందోబస్తు డ్యూటీలు, ట్రాఫిక్‌ విధులకు తోడు ఇటీవల సీఎం చంద్రబాబు రకరకాల పేర్లతో నిర్వహించే సభలు, యాత్రలు, పర్యటనలతో వీరు నలిగిపోతున్నారు. బందోబస్తులో ఉన్నప్పుడు ఆయా ప్రాంతాల్లో సరైన మంచినీరు, సమయానికి ఆహారం దొరక్క నానా ఆవస్థలుపడుతున్నారు.

Advertisement
Advertisement