కలిసేందుకు వీల్లేదు... | Sakshi
Sakshi News home page

కలిసేందుకు వీల్లేదు...

Published Sat, Aug 31 2013 2:14 AM

కలిసేందుకు వీల్లేదు... - Sakshi

ఉస్మానియా వద్ద విజయమ్మ, భారతిలను అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్: ఆరోగ్య పరిస్థితి విషమించిన జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లిన ఆయన మాతృమూర్తి వై.ఎస్.విజయలక్ష్మి, సతీమణి వై.ఎస్.భారతిలను పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం సాయంత్రం 9.21 గంటలకు విజయమ్మ, భారతి ఉస్మానియా ఆస్పత్రి గేటు వద్దకు రాగానే బారికేడ్లను మూసివేసి పోలీసులు వలయంగా ఏర్పడి వారిని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. జగన్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నందున చూసేందుకు తమను అనుమతించాలని వారు పదే పదే విజ్ఞప్తి చేసినా పోలీసులు అనుమతించలేదు. ‘‘మేమేమీ ఆందోళన చేయటానికి ఇక్కడకు రాలేదు. బిడ్డ ఆరోగ్యం క్షీణిస్తోంటే కన్నతల్లిగా చూడాలని నాకు ఉంటుంది కదా!’’ అని విజయమ్మ గద్గద స్వరంతో కోరారు. లోపలకు పంపవద్దని తమకు ఉన్నతస్థాయి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని పోలీసు అధికారులు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.
 
 ఇదేమి న్యాయమంటూ తీవ్ర ఆవేదనతో విజయమ్మ, భారతి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని వెనక్కు నెట్టారు. దీంతో అక్కడ ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోలీసు అధికారులు ముందుకొచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. లోపలకు పంపటానికి తమకు అనుమతి లేదని రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్‌ఎంఓ)ను పిలిపించి జగన్ ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడిస్తామని చెప్పారు. ‘‘జగన్ పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. షుగర్ 45కు పడిపోయింది. కీటోన్స్ పెరిగిపోతున్నాయి. ఇంకా దీక్ష కొనసాగించటం ఆరోగ్యరీత్యా ఏమాత్రం క్షేమకరం కాదని మేం చెప్పాం. అయినా జగన్ వినిపించుకోలేదు. ప్రజాసంక్షేమం కోసం ఎంతకైనా తెగిస్తానని జగన్ చెప్తున్నారు...’’ అని రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ వచ్చి విజయమ్మ, భారతిలకు ఆర్‌ఎంఓ వివరించారు.
 
 జగన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించిన నేపథ్యంలో కలవరపడిన ఆయన సతీమణి వై.ఎస్.భారతి శుక్రవారం సాయంత్రం 5.55 గంటలకు కూడా ఉస్మానియా ఆస్పత్రి వద్దకు వచ్చారు. అయితే.. ఆమె వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. జైలు అధికారుల నుంచి అనుమతి ఉంటేనే ఆస్పత్రి లోపలికి అనుమతిస్తామని కరాఖండీగా చెప్పారు. జైలు అధికారుల అనుమతి కోరుతూ ఆమె అక్కడే లేఖ రాసే ప్రయత్నం చేసినా పోలీసులు అంగీకరించలేదు. చంచల్‌గూడ జైలు వద్దకు వెళ్లి జైలు అధికారులను కలవాలని ఆమెను బలవంతంగా తిప్పిపంపారు. ఆమె నేరుగా జైలు సూపరింటెండెంట్ సైదయ్య వద్దకు వెళ్లి అనుమతి కోరారు. జైల్లో నిరాహార దీక్ష చేసిన కారణంగా ములాఖత్‌లు రద్దుచేశామని, ఆస్పత్రిలో కూడా జగన్‌ను కలిసేందుకు ఎవర్నీ అనుమతించబోమని ఆయన స్పష్టంచేయటంతో భారతి నిరాశతో వెనుతిరిగారు. శుక్రవారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రికి వచ్చిన వై.ఎస్.వివేకానందరెడ్డిని కూడా పోలీసులు లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement