బ్లాక్‌ స్పాట్‌లకు చెక్‌? | Sakshi
Sakshi News home page

బ్లాక్‌ స్పాట్‌లకు చెక్‌?

Published Mon, Mar 26 2018 11:33 AM

Police Officails Fid Out Black Spots On Road - Sakshi

చీమకుర్తి రూరల్‌: పదేళ్లలో వాహనాల సంఖ్య పెరిగినా వాటికి అనుగుణంగా రోడ్లు విస్తరణ జరగకపోవడంతో కర్నూల్‌ రోడ్డుపై తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట నుంచి చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెం వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర కర్నూల్‌ రోడ్డుపై జరిగే రోడ్డు ప్రమాదాలు స్థానిక ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. సాధారణ వాహనాలతో పాటు గ్రానైట్‌ క్వారీలు, ఫ్యాక్టరీలు, కంకర మిల్లులకు చెందిన భారీ వాహనాలు, పొక్లెయిన్‌లు, డంపర్‌లు, టిప్పర్‌లు ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఒంగోలు నుంచి నంద్యాల ప్రతిపాదనల దశలో ఉన్న ఫోర్‌లైన్‌ వస్తే ప్రమాదాలను కాస్త తగ్గించొచ్చని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కానీ అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటంతో చేసేది లేక ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్‌లను ఒంగోలు డీఎస్పీ ఆధ్వర్యంలో చీమకుర్తి, సంతనూతలపాడు పోలీసులు గుర్తించారు. వారి ప్రకారం ఈ రెండు మండలాల్లో కలిపి కర్నూల్‌ రోడ్డుపై సుమారు 25కుపైగా బ్లాక్‌స్పాట్‌లున్నట్లు గుర్తించారు. వాటికి అనుగుణంగానే చీమకుర్తి మండలంలో ప్రమాదాలు నివారించేందుకు ప్రస్తుత ఎస్‌ఐ జీవీ చౌదరి బ్లాక్‌స్పాట్‌ల వద్ద ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు.  

ప్రయాణికుల అసంతృప్తి
కర్నూల్‌ రోడ్డుపై పొదిలి వైపు నుంచి చీమకుర్తి మండలం ప్రారంభమయ్యే మర్రిచెట్లపాలెం నుంచి సంతనూతలపాడులో కలిసే టపా చెట్టు వరకు దాదాపు 18 కిలోమీటర్లు పొడవునా 20కి పైగా బ్లాక్‌స్పాట్లను గుర్తించారు. బ్లాక్‌స్పాట్‌కు ఇరువైపులా వాహనాల వేగాన్ని నియంత్రించే క్రమంలో డబుల్‌ రోడ్డును కాస్త సింగిల్‌వేగా మార్చేస్తున్నారు. అందుకోసం ఖాళీ డబ్బాలు, టైర్లు, ఐరన్‌ బారికేడ్‌లను ఉపయోగించి వాటిపై రేడియమ్స్‌ స్టిక్కర్‌లు అతికించి ప్రయాణం సాగించే వాహనాలకు హెచ్చరికలు ఏర్పాటు చేశారు. ప్రధానమైన కూడళ్లు, బైపాస్‌ కేంద్రాలు, వేబ్రిడ్జిల వైపు వాహనాలు వెళ్లే ప్రాంతాలు, కాలేజీ కేంద్రాలు, జనావాసాలు ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాద నివారణ చర్యలు చేపట్టంతో గతంతో పోల్చుకుంటే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు నివారించగలిగినట్లు పోలీసులు విశ్వసిస్తున్నారు. కానీ అదే సమయంలో మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, కడప, కర్నూల్‌ ప్రాంతాల నుంచి ఒంగోలుకు వచ్చేవారు. అదే విధంగా ఒంగోలు నుంచి ఆయా ప్రాంతాలకు సూదూరంగా రాకపోకలు సాగించే వాహనదారులకు ఇలా కిలోమీటర్‌కు ఒకచోట ఏర్పాటు చేసిన ప్రమాద నియంత్రణ కేంద్రాలు ప్రయాణానికి ఆటంకంగా మారాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఫోర్‌లైన్‌ నిర్మిస్తే గానీ ఈ సమస్యకు పరిష్కారం లభించదని, కానీ ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంపై స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి:బ్లాక్‌స్పాట్‌ల వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడంతో చాలా వరకు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. మర్రిచెట్లపాలెం నుంచి టపాచెట్టు వరకు చీమకుర్తి మండల పరిధిలోని అన్ని బ్లాక్‌స్పాట్‌ల వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నాం. అంతేకాకుండా రోడ్డుకు ఇరువైపులా చెట్లు, వంతెనలకు రేడియమ్‌ స్టిక్కర్లు అంటించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం.–జీవీ చౌదరి, ఎస్‌ఐ, చీమకురి

Advertisement

తప్పక చదవండి

Advertisement