Sakshi News home page

కుట్రలు.. కుయుక్తులు

Published Tue, Nov 21 2017 5:32 AM

police over action in ys jagan meeting at banaganapalle - Sakshi

బనగానపల్లె: కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం, ఆదివారం నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్ర సంపూర్ణంగా విజయవంతం కావడంతో అధికార పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. తదుపరి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కుట్రలు పన్నారు. అందులో భాగంగా సోమవారం బనగానపల్లె మండలం హుస్సేనాపురం సమీపంలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సును విఫలం చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఉదయం నుంచే బనగానపల్లె శివార్లలోని అన్ని కూడళ్లలో భారీగా పోలీసులను మోహరించారు. అన్ని వైపుల నుంచి ఆటోలు, ప్రైవేట్‌ వాహనాల్లో అధిక సంఖ్యలో తరలివస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. సదస్సుకు వెళ్లొద్దంటూ బెదిరించారు. మహిళలను అక్కడికి తీసుకెళ్తే మీకు ఇబ్బందులు తప్పవంటూ ఆటోవాలాలను హెచ్చరించారు. దీంతో కొందరు తమ ఆటోలను వెనక్కి తిప్పారు. 

ప్రతిఘటించిన మహిళలు: మహిళలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోలీసులను ప్రతిఘటించారు. తమ కష్టాలను ప్రతిపక్ష నేతకు చెప్పుకొనేందుకు వెళ్తున్నామని, మహిళా సదస్సుకు వెళ్లొద్దని చెప్పడానికి మీరెవరని ప్రశ్నించారు. అయినా పోలీసులు వినకపోవడంతో ఎస్సార్‌బీసీ ప్రధాన కాలువ వద్ద మహిళలు ధర్నాకు దిగారు. ప్రభుత్వం, పోలీసులు, అధికార పార్టీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని అన్ని కూడళ్ల వద్దా ఇదే పరిస్థితి నెలకొంది.  

వైఎస్సార్‌సీపీ నాయకుల ఆందోళన: మహిళా సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వంగల పరమేశ్వరరెడ్డి, అవుకు మండల పార్టీ అధ్యక్షుడు కాటసాని తిరుపాల్‌రెడ్డి, న్యాయవాదుల విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ ఖైర్‌తోపాటు స్థానిక నాయకులు కాటసాని రమాకాంత్‌రెడ్డి, బండి బ్రహ్మానందరెడ్డి, శంకర్‌రెడ్డి తదితరులు ఆయా ప్రాంతాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి చర్చలు జరపడంతో మహిళలను అనుమతించారు.  వాహనాలను అనుమతించకపోవడంతో వేలాది మంది మహిళలు కిలోమీటర్ల కొద్దీ నడిచి సదస్సు ప్రాంగణానికి చేరుకున్నారు.  మహిళలను సదస్సుకు వెళ్లకుండా అడ్డుకోవడం దారుణమని, ప్రభుత్వానికి మహిళల ఉసురు తగులుతుందని అవుకు మండలం నిచ్చెనమెట్ల గ్రామానికి చెందిన తలారి లక్ష్మీదేవి, తలారి వెంకట లక్ష్మమ్మ శాపనార్థాలు పెట్టారు.  

Advertisement
Advertisement