వైఎస్‌ఆర్ సీపీ ఆందోళనను అడ్డుకున్న పోలీసులు | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ సీపీ ఆందోళనను అడ్డుకున్న పోలీసులు

Published Mon, Jun 1 2015 11:37 PM

police stop in YSR Congress concern

 పార్వతీపురం: ఓటుకు నోటు కార్యక్రమానికి పాల్పడిన టీడీపీ నేతల దురాగతానికి నిరసనగా సోమవారం వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్, మజ్జి వెంకటేష్, చుక్క లక్ష్ముంనాయుడు, చింతల జగన్నాథం తదితరుల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే స్థానిక పోలీసులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.
 
  సీఐ వి. చంద్రశేఖర్, ఎస్‌ఐ వి.అశోక్‌కుమార్ తదితరుల ఆధ్వర్యంలో పోలీసులు ఒక్కసారిగా వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలపై విరుచుకుపడి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమానికి విఘాతం కలిగించారు. దీనిపై వైఎస్‌ఆర్ సీపీ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధంగా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తే ఇలా చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మంత్రి రవి, ఎస్. శ్రీనివాసరావు, కవ్వాటి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
 
 ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి
 రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఓటుకు నోటు కార్యక్రమాన్ని చేపట్టిన టీడీపీ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ అన్నారు. సోమవారం ఆయన పార్టీ నాయకులు మజ్జి వెంకటేష్, చింతల జగన్నాథం, మంత్రి రవి, చుక్క లక్ష్ముంనాయుడు తదితరులతో కలసి ఆర్డీఓ ఆర్.గోవిందరావును కలిశారు. ఈ సందర్భంగా వారు ఆర్డీఓతో మాట్లాడుతూ అవినీతి నిరోధకశాఖ విడుదల చేసిన వీడియో క్లిప్‌ంగుల లో సాక్షాత్తు రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో ముడుపులు ఇస్తున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపిన విషయాన్ని ప్రజలంతా మీడియాలో చూశారన్నారు.
 
 ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగావున్న వ్యక్తి అవినీతికి ప్రోత్సహించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఎన్నికల కమిషన్, రాష్ట్ర గవర్నర్ కలుగజేసుకొని టీడీపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరారు. అనంతరం ఆర్డీఓ గోవిందరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్. రాజారావు, బి. కృష్ణ, ఎస్. శ్రీనివాసరావు, కవాటి రాంబాబు, నర్సంనాయుడు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement