Sakshi News home page

నిధుల రాజకీయం షురూ!

Published Wed, Sep 17 2014 11:51 PM

Political funding suru!

సాక్షి ప్రతినిధి, కర్నూలు: పార్టీలకతీతంగా, పల్లెల అభివృద్ధే ధ్యేయంగా విధులు నిర్వహించాల్సిన కర్నూలు జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అన్న చందంగా నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపుతున్నారని విమర్శలున్నాయి. దీంతో ప్రతిపక్ష జెడ్పీటీసీ సభ్యుల నుంచే కాక అధికారపక్ష సభ్యుల నుంచీ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో కాలంగా అభివృద్ధికి దూరంగా ఉన్న పల్లెల్లో ప్రగతి కాంతులు వస్తాయని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత కొత్తగా ఏర్పాటైన పాలకవర్గంపై ఉంది. దీనికి అవసరమైన నిధులను కేటాయించాల్సిన బాధ్యత జెడ్పీ చైర్మన్‌పై ఉంది. నిధులను సమకూర్చకపోయినా ఉన్న నిధులైనా సక్రమంగా పంపిణీ చేయాల్సి ఉంది. అలా కాకుండా చైర్మన్ ఇష్టానుసారంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పలువురు సభ్యులు ఆభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జెడ్పీలో అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు దండిగా ఉన్నాయి. ఆ నిధుల కేటాయింపునకు చైర్మన్ శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యులకు ఓ రకంగా.. టీడీపీ జెడ్పీటీసీ సభ్యులకు మరో రకంగా.. తన అనుచరులకు ఇంకో రకంగా నిధులు కేటాయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. జిల్లాలో 53 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. వీరిలో 30 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచినవారే ఉన్నారు. అయితే టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి బలవంతంగా చైర్మన్ పీఠం లాక్కున్న విషయం తెలిసిందే.
 అనుచరులపై అంతులేని అభిమానం.. పల్లెల్లో పలు అభివృద్ధి పనుల కోసం అంచనాలతో నివేదికలు తయారుచేసుకొని తీసుకురావాలని జెడ్పీ చైర్మన్ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యులను రూ.20 లక్షలు విలువచేసే పనులకు మాత్రమే అంచనాలు తీసుకురావాలని తెలిపారు. టీడీపీ సభ్యులకు మాత్రం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల విలువైన పనులకు నివేదికలు సిద్ధం చేసుకురమ్మని చెప్పినట్లు సమాచారం. తన అనుచరులు, టీడీపీ ముఖ్య నాయకులు చెప్పిన వారికి మాత్రం రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు పనులకు అంచనాలు తీసుకురమ్మని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఇవన్నీ గుట్టుగా జరిగిపోవాలని ఆయా జెడ్పీటీసీ సభ్యులకు సమాచారం అందించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను వైఎస్సార్‌సీపీ సభ్యులకు, జనరల్ ఫండ్స్‌తో పాటు ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రెండింటినీ టీడీపీ సభ్యులకు పంచిపెడుతున్నట్లు తెలిసింది. ఇందులో ఎన్నికల తరువాత టీడీపీలో చేరిన ఓ నాయకుడు చెప్పిన జెడ్పీటీసీ సభ్యుల పట్ల చైర్మన్ గురుభక్తి ప్రదర్శించినట్లు విశ్వసనీయ సమాచారం. వారికి నిధుల కేటాయింపు విషయాన్ని ఉపముఖ్యమంత్రికి గానీ, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌కు తెలియకుండా ఉంచాలని సంబంధిత జెడ్పీటీసీ సభ్యులను కోరినట్లు తెలిసిం ది. నిబంధలనకు విరుద్ధంగా నిధుల కేటాయింపులపై పలువురు సభ్యులు గురువారం జరగబోయే సర్వసభ్య సమావేశంలో నిలదీయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
 
 
 
 

Advertisement

What’s your opinion

Advertisement