మంచి ముహూర్తం చూడు స్వామీ! | Sakshi
Sakshi News home page

మంచి ముహూర్తం చూడు స్వామీ!

Published Tue, Mar 10 2020 7:53 AM

Political Heat In Anantapur District - Sakshi

సాక్షి, అనంతపురం : జిల్లా అంతటా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్‌ రాజకీయ వేడి రాజుకుంది. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా ఎవరు కూడా కాస్తంత కూడా ఖాళీ లేకుండా బిజీగా గడిపేస్తున్నారు. మరో ఇరవై రోజుల వ్యవధిలో నేతల భవితవ్యం తేలిపోనుండడంతో తమ రాతలు గట్టిగా ఉండాలని భావిస్తున్న వారు మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. అది ప్రచారమైనా..నామినేషన్‌ పర్వమైనా సమయం మంచిదా కాదా అంటూ బేరీజు వేసుకుంటున్నారు. రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు సెంటిమెంటు పిచ్చి కాస్త అధికంగానే ఉంటుంది. ఏం చేస్తే ఏమవుతుందోనని జాగ్రత్తగా ఆచితూచి అడుగేయడానికి సిద్ధపడుతుంటారు. నామినేషన్ల పండుగ ప్రారంభం కావడంతో శుభ ముహూర్తం కోసం పండితుల చుట్టూ తిరుగుతున్నారు.      
                                       
ఒక్కరోజే.. 
నగర పాలక, స్థానిక సంస్థల ఎన్నికలలో నామినేషన్లు వేయడానికి ఈ నెల 9న (సోమవారం) అధికారికంగా ప్రారంభమైనా తొలిరోజు పౌర్ణమి కావడంతో అంత మంచిది కాదని భావించి ఎక్కువమంది నామినేషన్లు వేయడానికి సిద్ధపడలేదు. డమ్మీ నామినేషన్లే ఎక్కువగా వేశారు. ఇక రెండవ రోజు మంగళవారం అదీ అంత శ్రేష్టమైంది కాదన్నది కొందరి విశ్వాసం. ఎల్లుండి బుధవారం చివరి రోజే కాకుండా హస్త నక్షత్రం, విధియ కలసి రావడంతో మంచి ముహూర్తం ఉన్నరోజని పండితులంటున్నారు. అది కూడా ఉదయం 10 గంటల నుండి 12.30 వరకు బాగుంటుందని ముఖ్యంగా 11.32 గంటలకు రవిహోరలో అద్భుత ముహూర్తముంటుందని అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలలో ఉన్నవారికి మంచిదే కాకుండా ముహూర్తాల సెంటిమెంటు ఎంత వరకు వెళ్లిదంటే జాతకాలు, దేవుడు అంటే పెద్దగా నమ్మకం లేని కమ్యూనిస్టులు కూడా స్నేహితుల వద్ద వీటి ప్రస్తావన తెస్తున్నారని పండితులే అంటున్నారు. జయాపజయాలు ఎలా ఉన్నా ఎవరికైనా జాగ్రత్త పడాలనుంటుందన్నది సత్యం. 

సెంటిమెంటు బలంగా మారింది  
చాలామంది నాయకులు నామినేషన్ల కోసం మంచి ముహూర్తాలను ఖరారు చేసుకున్నారు. ఈసారి సమయం తక్కువగా ఉన్నందున ఈ నెల 11న విధియ రోజు వచ్చే రెండు మూడు గంటల పాటు ఉండే  ముహూర్తం మాత్రమే చాలా బలంగా ఉంది. ఇక గెలుపోటములు వారి నక్షత్ర జాతకాలను అనుసరించే సాగుతాయి.    – కరణం వాసుదేవరావు, జ్యోతిష్యులు, రాప్తాడు   

Advertisement
Advertisement