2019 ఎన్ని'కలలో'..! | Sakshi
Sakshi News home page

2019 ఎన్ని'కలలో'..!

Published Tue, Jan 1 2019 8:50 AM

Political parties share their hopes for 2019 - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొత్త సంవత్సరం కోటి ఆశలతో మొదలు కానుంది. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో అందరిలోనూ ఆశలు చిగురుస్తున్నాయి. 2018 అభివృద్ధిపరంగా జిల్లాకు చేదు అనుభవమే మిగిల్చింది. సహజ వనరులు, మౌలిక సదుపాయాలు అన్నీఉన్నా పారిశ్రామికంగా వెనకబాటుతనం ఇంకా పోలేదు.  చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒక్కటీ రాలేదు. పరిశ్రమల కోసం భూమి సేకరించే ప్రక్రియ ఇంకా నడుస్తోంది. ఇతర అంశాల్లోనూ ఆశించిన ప్రగతి లేదు. ఆగస్టులో భారీ వర్షాలు, చివరిలో పెథాయ్‌ తుపాను వ్యవసాయ రంగాన్ని కకావికలం చేశాయి. ప్రభుత్వం నుంచి సాయం ఏమాత్రమూ అందలేదు. మిగతా రంగాల్లోనూ ఆశించిన ప్రగతి లేదు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల ఏడాది కావడంతో రాజకీయ ముఖచిత్రం మారనుంది.  

అధికారపక్షం పనితీరు పేలవం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు ఇచ్చిన హామీలు ఒక్కటీ 2018లో నెరవేర్చలేదు.  2019 ఎన్నికల వత్సరం కావాడంతో  మళ్లీ హామీలు గుప్పిస్తారా లేక ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా అన్నది వేచిచూడాలి. ఇప్పటి వరకూ జిల్లా పర్యటనల్లో సీఎం అర్ధసెంచరీ దాటినా పట్టిసీమ, పోలవరం భజన తప్ప ఒక్క హామీ కూడా అమలు చేసినట్లు చెప్పుకోలేని పరిస్థితి.  పరిశ్రమల కోసం అటవీ శాఖ భూములను డీ–నోటిఫై చేయకుండా ఫైలును కేంద్రం తిరస్కరిం చింది. తాడేపల్లిగూడెం అభివృద్ధికి సహకరించలేదంటూ మొన్నటి వరకూ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ మాజీ మంత్రి రాజీనామా అస్త్రాన్ని సంధించడం ఏడాది చివరిలో కొసమెరుపు.   

కుమ్మలాటలు, విభేదాలు 
మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీలో విబేధాలు రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నాయి. తెలుగుదేశంతో ప్రత్యక్ష యుద్ధానికి  మాజీ మిత్రపక్షం బీజేపీ దిగింది.  ఇసుక, మట్టి ఏదీ వదలకుండా  మూడేళ్లు దోచుకోవడంపైనే అధికార టీడీపీ దృష్టి పెట్టింది. ప్రజాప్రతినిధులు వందల కోట్ల రూపాయలు సంపాదించారన్న ఆరోపణలు వినిపించాయి. ప్రతి నియోజకవర్గంలో తెలుగుతమ్ముళ్ల మధ్య కుమ్ములాటలు పెరుగుతూ వస్తున్నాయి. కోడి పందేలు, జూదాలు, మద్యం సిండికేట్లలో పెత్తనం చేస్తూ ప్రజలకు దూరం అవుతూ వచ్చారు. చింతలపూడిలో ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే పీతల సుజాత మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మంత్రి జవహర్‌కు అసమ్మతి సెగ తగిలింది. ఆయనను వ్యతిరేకిస్తున్న వర్గం ఏకంగా రెండో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి షాక్‌ ఇచ్చింది. పాలకొల్లులో ఎమ్మెల్యే రామానాయుడు, ఎమ్మెల్యే అంగర రామమోహనరావు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇదే పరిస్థితి నర్సాపురం, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలలో ఉన్నాయి. సీఐల బదిలీల వ్యవహారంలో ఉండి ఎమ్మెల్యేకి, నరసాపురం పార్లమెంట్‌ ఇన్‌చార్జికి మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. 

పోరుబాటలో వైఎస్సార్‌ సీపీ  
ప్రజలను అన్ని విధాల మోసం చేసిన  పాలకులపై ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటానికి సన్నద్ధం అవుతోంది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో చేపట్టిన పాదయాత్రతో శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. 2018 మే 13 నుంచి జూన్‌ 12 వరకూ సుమారు నెలరోజుల పాటు జిల్లాలో 316 కిలోమీటర్లు వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   పాదయాత్ర చేశారు.  జిల్లా ప్రజలు వైఎస్‌ జగన్‌కు నీరాజనాలు పలికారు. మాజీ ఎమ్మెల్యేలు చెరుకువాడ రంగనాథరాజు, మద్దాల సునీత, జవహర్‌వతి పార్టీలో చేరారు. పాదయాత్ర నింపిన స్ఫూర్తితో పార్టీ శ్రేణులు ముందుకు దూసుకెళ్తున్నాయి. రావాలి జగన్, కావాలి జగన్‌ పేరుతో మరోమారు ప్రతి ఇంటికీ వెళ్లి పార్టీ ప్రకటించిన నవరత్నాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్తున్నారు. సర్కారు తీసుకుంటున్న  ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నారు. సర్కారుపై సమరశంఖం పూరిస్తున్నారు. 

జనసేనలో గందరగోళం
దాదాపు నెలరోజుల పాటు జిల్లాలో పవన్‌కల్యాణ్‌ బసచేసినా పార్టీకి ఒక రూపు మాత్రం రాలేదు. పార్టీలో చేరిన ఇర్రింకి సూర్యారావు, యర్రా నవీన్, మల్లుల లక్ష్మీనారాయణ వంటి నేతలు మినహా   నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల నేతలు ఆ పార్టీలో చేరలేదు. ఇప్పటికీ నియోజకవర్గాల్లో  ఎవరు నాయకులో కనీసం వారికే తెలియని సందిగ్ధం నెలకొంది. మరో నాలుగునెలల్లో ఎన్నికలు ఉన్నా ఇప్పటికీ పార్టీ సంస్థాగత యంత్రాంగం లేకపోవడం ఆ పార్టీ సానుభూతిపరుల్లో అసంతృప్తి నింపుతోంది.  

బీజేపీ భవితవ్యమూ ప్రశ్నార్ధకమే!
ఓ ఎంపీ, ఓ మంత్రి ఉన్నా ఈ నాలుగున్నరేళ్ల కాలంలో జిల్లా రాజకీయాలపై ఏమాత్రం ప్రభావం చూపలేని పరిస్థితిలో బీజేపీ ఉంది. అయితే  మంత్రివర్గం నుంచి వైదొలగిన తర్వాత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అధికార పార్టీపై యుద్ధం ప్రకటించారు. తాడేపల్లిగూడెంలో అభివృద్ధిపై బహిరంగం చర్చకు సిద్ధమంటూ ప్రకటించారు. 15 రోజుల్లో నియోజకవర్గాన్ని పట్టించుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. మరోవైపు ఎంపీ గోకరాజు గంగరాజు మాత్రం ఇప్పటికీ తెలుగుదేశంపై నోరుమెదపడం లేదు. 

నామమాత్రంగా వామపక్షాలు
మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమ ఉనికే ప్రశ్నార్థకంగా మారడంతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నామమాత్రంగా మారిపోయాయి. అడపాదడపా తుందుర్రు మెగా ఆక్వా ఫుడ్‌పార్కు వ్యతిరేక పోరాటంతో పాటు ప్రజా సమస్యలపై ధర్నాలకు పరిమితమయ్యారు. ఈ ఏడాదిలో సీపీఎం రాష్ట్ర మహాసభలు జిల్లాలోనే నిర్వహించుకోవడం ఒక్కటే వామపక్షాలకు గుర్తుంచుకునే అంశంగా మారింది. 

Advertisement
Advertisement