పేలవంగా హార్టీకల్చర్ షో | Sakshi
Sakshi News home page

పేలవంగా హార్టీకల్చర్ షో

Published Thu, May 26 2016 12:43 AM

పేలవంగా హార్టీకల్చర్  షో - Sakshi

భారీగా స్టాల్స్ అద్దెలు... సౌకర్యాలు నిల్
కానరాని ఇంటర్నేషనల్ సంస్థలు
కేవలం ఐదు రాష్ట్రాల నుంచే ఎగ్జిబిటర్ల రాక

 
 
విజయవాడ
: లయోలా కళాశాలలో ఏర్పాటైన ఉద్యానవన ఎగ్జిబిషన్‌లో స్టాల్స్ అద్దెలు ఎక్కడా లేనంత భారీగా వసూలు చేశారు. మూడు రోజులు నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు  సౌకర్యాలు ఏర్పాటు చేయటంలో నిర్వాహకులు  పూర్తిగా విఫలమయ్యారు. దాంతో  ప్రభుత్వం ఆర్బాటంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఉద్యానవన ఉత్పత్తుల మామిడి ప్రదర్శన పేలవంగా కొనసాగింది. సీఎం చంద్రబాబు ఈ ఎగ్జిబిషన్‌ను సోమవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవం నాడు  300 మంది మాత్రమే హాజరయ్యారు. మంగళవారం సందర్శకులు నామమాత్రంగానే వచ్చారు. ఎగ్జిబిషన్ నిర్వహణను కేంద్ర ప్రభుత్వ రంగసంస్థ అయిన (సీఐఐ) కాన్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్‌కి అప్పగించి  రాష్ట్ర  ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది.


స్టాల్స్ నిర్వాహకులకు సీఐఐ సరైన ఏర్పాట్లు చేయలేకపోయింది. భారీగా అద్దెలు మాత్రం వసూలు చేశారని పలువురు ఫిర్యాదు చేశారు. ఏసీ స్టాల్స్‌కు రూ.45వేలు అద్దె వసూలు చేశారు. దాదాపు 150 ఏసీ స్టాల్స్ ద్వారా రూ.65.50 లక్షల అద్దె వసూలు చేశారు. అదే విధంగా సాధారణ స్టాల్స్ 50 ఏర్పాటు చేశారు. వీటికి ఒక్కొకదానికి రూ.20వేల చొప్పున అద్దె వసూలు చేశారు. మొదటి రోజు ఏసీ స్టాల్స్‌లో ఏసీలు పని చేయలేదు. స్టాల్స్ యజమానులకు, సిబ్బందికి భోజన వసతి, లావెట్రీలు కూడా ఏర్పాటు చేయలేదు. దాంతో స్టాల్స్ నిర్వాహకులు, సందర్శకులు, రైతులు నానా అగచాట్లు పడ్డారు.   హైదరాబాద్ హైటెక్‌లో జరిగే  ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్‌లో విజయవాడ కంటే తక్కువగా స్టాల్‌కు రూ.30వేల మాత్ర మే అద్దె వసూలు చేసేవారని వివిధ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. బెంగళూరులో జరిగే ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్‌లో కూడా స్టాల్‌కు రూ.32 వేలు అద్దె  తీసుకున్నారని,  ఇక్కడ భారీగా వ సూలు చేశారని వాపోయారు. 

మహా రాష్ట్ర, ఢిల్లీ, హార్యానా, గుజరాత్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వ్యవసాయ పరికరాలు తయారు చేసే కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. వీటిలో అధికంగా మన రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారు. డ్రిప్ ఇరిగేషన్, రెయిన్‌గన్స్, ప్లాస్టిక్ షీట్స్, పాలీహౌస్ తదితరాలు తయారు చేసే కంపెనీలు తమ వస్తువులను ప్రదర్శించాయి. అంతర్జాతీయ స్థాయిలో కంపెనీల సామగ్రి రాకపోవటంతో రైతులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొరియా, జపాన్, తైవాన్, చైనా తదితర దేశాల కంపెనీల వస్తువులు  ఇక్కడ ప్రదర్శిస్తే బాగుండేదని రైతులు పేర్కొన్నారు.  
 
 
ఆర్గానిక్ పంటలపై దృష్టి సారించండి
గుణదల : ఉద్యాన పంటలు పడించే రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా మెరుగైన దిగుబడులు సాధించడంతోపాటు ఆరోగ్యవంతమైన పంటలను అందించిన వారవుతారని రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు.  బుధవారం మామిడి ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులు నూతన విధానాలను అందిపుచ్చుకుని మెరుగైన ఫలితాలు సాధించాలని పేర్కొన్నారు.  రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల్లో ఫుడ్ ఫ్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని మరింత వృద్ధిలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని, దేశంలోనే ఉద్యాన పంటల సాగులో బొప్పాయి, మిరప, ఆయిల్ ఫామ్ మొదటి స్థానంలో ఉన్నాయని, మామిడి, టమాట పంటలు రెండో స్థానంలో ఉన్నాయని, అన్ని రకాల ఉద్యాన పంటల్లో దేశంలో మొదటి స్థానం సాధించటానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.  మామిడి మేళాలో ప్రదరించిన రైతులకు అవార్డు, సర్టిఫికెట్, రూ.5 వేల నగదు బహుమతులను అందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement